గవర్నర్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతున్న అర్చకులు, ఆలయ ఈఓ
ఇంద్రకీలాద్రి /మంగళగిరిటౌన్/గన్నవరం: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో వి.కోటేశ్వరమ్మ, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ నరసింహన్ దంపతులకు ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
నృసింహుని సేవలో గవర్నర్
గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు ఆలయ ఈవో మండేపూడి పానకాలరావు, అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత ఎగువసన్నిధిలోని పానకాల నరసింహస్వామిని దర్శించుకుని గవర్నర్ దంపతులు పానకాన్ని స్వీకరించారు. అనంతరం దిగువ సన్నిధిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకున్నారు. ఆలయ పండితులు వేదాశీర్వచనం అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని ఈవో బహూకరించారు.
గన్నవరం ఎయిర్‌పోర్టులో గవర్నర్‌కు ఘనస్వాగతం
అంతకుముందు గవర్నర్ నరసింహన్ దంపతులకు గన్నవరం విమానాశ్రయంలో పలువురు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం విజయవాడలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకున్నారు. గవర్నర్ దంపతులకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ప్రొటొకాల్ డైరెక్టర్ కన్నల్ అశోక్, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment