సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆరోరోజు దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఇక, నేడు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి దర్శనాలు మొదలయ్యాయి.
కాగా, ఇంద్రకీలాదిపై వినాయకుడి గుడి నుంచి కొండపై వరకూ భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా వేశారు. క్యూలైన్లు నిండిపోవడంతో వీఎంసీ వద్ద కంపార్ట్‌మెంట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఇంద్రకీలాద్రికి రానున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం జగన్.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ఇక, మూలనక్షత్రం సందర్బంగా విశాఖలోని శారదాపీఠంలో అక్షరాభ్యాసాలు జరుగనున్నాయి. రాజశ్యామల అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు. దేవాలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి.
మరోవైపు, తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఆరోరోజు తిరుమల శ్రీవారు.. హనుమంత వాహనంపై దర్శనమివ్వనున్నారు. అలాగే, రాత్రి గజవాహనంలో దర్శనమిస్తారు. ఇక, గురువారం గరుడోత్సవం సందర్భంగా రెండు లక్షలకు పైగా మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. గరుడోత్సవం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,757 కాగా, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,395గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్లు.
ఇది కూడా చదవండి: వరుసగా మూడో ఏడాదీ వైఎస్సార్ అవార్డులు
Comments
Please login to add a commentAdd a comment