
శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముచ్చటిస్తున్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా మరో ముందడుగు పడింది. విభజన వివాదాల పరిష్కారం కోసం త్వరలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇంకా కొలిక్కి రాని వివాదాలకు సత్వర ముగింపు పలకాలని అభిప్రాయానికి వచ్చారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు.
శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలసి నమాజ్ చేస్తున్న గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వై.ఎస్. జగన్. చిత్రంలో ఏకే ఖాన్, ఎర్రబెల్లి, ఫరూక్ హుస్సేన్, మహమూద్ అలీ తదితరులు
రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల విభజనతోపాటు విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ సంస్థల మధ్య విద్యుత్ బిల్లులు, ఆస్తులు, అప్పుల పంపకాలు, ఏపీ భవన్ విభజన తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు గడిచినా ఇంకా అపరిష్కృతంగా మిగిలిపోయిన అంశాలను ఉభయ ప్రయోజనకరంగా పరిష్కరించుకోవాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. రంజాన్ మాసం సందర్భంగా రాజ్‌భవన్ కాంప్లెక్స్‌లోని ‘సంస్కృతి’కమ్యూనిటీ హాల్‌లో గవర్నర్ శనివారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్ చేరుకున్న కేసీఆర్, జగన్... గవర్నర్ సమక్షంలో గంటకుపైగా చర్చలు జరిపారు.
ఇఫ్తార్‌లో ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌కు ఖర్జూరం తినిపిస్తున్న సీఎం కేసీఆర్
ప్రేమను పంచండి: గవర్నర్ సందేశం
ప్రేమను పంచండి.. ప్రేమను చాటండి అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. రాజ్‌భవన్ కాంప్లెక్స్‌లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో ఆయన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరినీ ప్రేమించండి.. ప్రేమను పంచండి అని అల్లా చెప్పారన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అల్లా బోధనలను జీవితంలో ఆచరించాలని రంజాన్ సందేశమిస్తుందన్నారు. అందరికీ రంజాన్ పండుగ శుభకాంక్షాలు తెలిపారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం మత పెద్దలు, ప్రముఖులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ అనంతరం అక్కడే ముస్లిం సోదరులు మగ్రిబ్ నమాజ్ చేశారు. నమాజ్ అనంతరం గవర్నర్ అతిథులకు విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, ఎర్రబల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వై. విజయసాయిరెడ్డి, ఎంపీ వై.ఎస్. మిథున్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు పండు తినిపిస్తున్న ఏపీ సీఎం వై.ఎస్. జగన్