
‘సింగపూర్ అథ్లెటిక్స్ అండ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ 2018’లో గెలుచుకున్న స్వర్ణాలతో కోటేశ్వరమ్మ. ఆమె తీపి జ్ఞాపకంగా దాచుకున్న బ్లేజర్.
‘అచీవ్‌మెంట్’ అనే మాట చాలా గొప్పది. అయితే అదెప్పుడో చాలా మామూలు మాట అయిపోయింది కోటేశ్వరమ్మ విషయంలో! ఎంత పెద్ద విజయం అయినా ఇప్పుడామెకు ఒక మైలురాయి. అంతే! ఇటీవల కూడా నాలుగు గోల్డ్‌మెడల్స్ గెలుచుకుని ఇండియా వచ్చిన ఈ డెబ్బైయ్ ఏళ్ల అథ్లెట్.. ఊపిరి ఉన్నంత వరకూ గ్రౌండ్ ఆడుతూ ఉండడమే తన కోరిక అని అంటున్నారు.
ఏనుగుల కోటేశ్వరమ్మ వయసు 70. ఫిజికల్ డైరెక్టర్‌గా రిటైరయ్యి పన్నెండేళ్లవుతోంది. సాధారణంగా రిటైర్ అయిన వాళ్లను... ‘ఖాళీయే కదా! ఇప్పుడేం చేస్తున్నారు’ అని చాలా మామూలుగా అడిగేస్తుంటారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం, ఎదుటి వాళ్లు సమాధానపడేలా చెప్పడం కొంచెం కష్టమే. అయితే కోటేశ్వరమ్మకు మాత్రం చెప్పడానికి చాలా విజయాలున్నాయి. రిటైర్ అయిన తర్వాతనే ఆమె అంతర్జాతీయ స్థాయి అథ్లెట్ మీట్‌లలో పాల్గొన్నారు.
సగౌరవంగా జాతీయ పతాకాన్ని భుజాల మీద కప్పుకుని, దేశానికి ప్రతినిధిగా వినమ్రంగా తలవంచి బంగారు పతకాలను ధరించారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన ‘సింగపూర్ అథ్లెటిక్స్ అండ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ 2018’ లో పాల్గొని నాలుగు బంగారు పతకాలతో ఇండియాకి వచ్చారు. 17 దేశాల క్రీడాకారులు పాల్గొన్న పోటీలలో నాలుగు మెడల్స్ (అన్నీ స్వర్ణాలే) సాధించిన ఏకైక క్రీడాకారిణి ఆమె. గత ఏడాది మలేసియా నుంచి రెండు స్వర్ణాలను తెచ్చారు.
అంతకు ముందు శ్రీలంకలో మూడు స్వర్ణాలు ఆమె సొంతమయ్యాయి. ఆమె పాల్గొన్న తొలి ఇంటర్నేషనల్ అథ్లెట్ మీట్ 2014. అప్పుడామె రెండు కాంస్యాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. తన జీవితంలో అన్నీ బంగారు, వెండి పతకాలే. కాంస్యం అందుకున్న ఒకే ఒక్క సందర్భం జపాన్ చాంపియన్ షిప్‌లోనే అంటారామె. 66 ఏళ్ల వయసులో, తొలిసారి విదేశీ ప్రత్యర్థులతో పోటీపడడంలో కొంత తడబాటు తప్పలేదు. కానీ ఆమె మాత్రం ‘తన చిన్న ప్రపంచం’లో ఇంటర్నేషనల్ మీట్‌లో పాల్గొనడమే పెద్ద విజయం అంటారు.
చిన్న ప్రపంచం వెనుక
కోటేశ్వరమ్మ ‘తన చిన్న ప్రపంచం’ అన్న మాట వెనుక చాలా పెద్ద అర్థమే ఉంది. నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో పుట్టి పెరిగారామె. స్కూలు, కాలేజ్, ఉద్యోగం, ఇప్పుడు విశ్రాంత జీవనం కూడా కావలిలోనే. తండ్రి చిన్న ప్రభుత్వోద్యోగి, తల్లి గృహిణి. ఏడుగురు సంతానంలో చిన్నమ్మాయి. అక్కలు, అన్నలు ఒక్కరు కూడా క్రీడారంగంలో అడుగుపెట్టలేదు. కోటేశ్వరమ్మకు మాత్రం ఇల్లు, ఆట స్థలమే లోకం. ఐదవ తరగతిలో డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్ అందుకోవడం నుంచి డిగ్రీ వరకు హైజంప్, లాంగ్ జంప్, రన్నింగ్ రేస్‌లలో వరుసగా మెడల్స్ అందుకున్నారు.
షాట్ పుట్, డిస్కస్‌త్రో, జావలిన్ త్రోలతోపాటు వంద మీటర్లు, రెండు వందల మీటర్లు, నాలుగు వందల మీటర్లలో, జిల్లా, స్టేట్, నేషనల్స్‌లో ఆమె అందుకున్న మెడల్స్ వందకు పైగానే ఉంటాయి. అయినా తన ప్రపంచం చాలా చిన్నదనే అంటారామె. ‘‘ఒలింపిక్స్‌లో రాణించే నైపుణ్యం, ఫిట్‌నెస్ ఉండి కూడా ఎక్స్‌పోజర్ లేని కారణంగానే నా పరిధి కుదించుకుపోయింది. అప్పట్లో ఇప్పటిలా ఎలక్ట్రానిక్ మీడియా విస్తరించలేదు.
పేపర్లలో ఒలింపిక్స్ గురించి చదివినా కూడా కోచింగ్ ఎక్కడ తీసుకోవాలో, ఎలా అప్లయ్ చేసుకోవాలో మార్గదర్శనం చేసే వాళ్లు లేరు. దాంతో నేషనల్స్ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. ఈ మాత్రమైనా సాధించగలిగానంటే... అది నేను చదువుకుని, ఉద్యోగం చేసిన విశ్వోదయ, జవహర్‌భారతి విద్యాసంస్థల స్థాపకులు డీఆర్ (దొడ్ల రామచంద్రరెడ్డి) గారి ప్రోత్సాహమే. నా భర్త కూడా స్పోర్ట్స్ పర్సన్ కావడం నాకు చాలా ఉపకరించింది’’అంటారామె.
తొలి ఫోన్‌కాల్
కోటేశ్వరమ్మ భర్త జయచంద్ర రావు ఫుట్‌బాల్ ప్లేయర్. పిల్లలకు పదేళ్లు నిండినప్పటి నుంచి స్పోర్ట్స్ మీట్‌లకు అందరూ వెళ్లేవాళ్లు. మెడల్స్ సాధించడం ఎవరికైనా సంతోషమే. అయితే ఆ అచీవ్‌మెంట్‌లు ఆమెలోని క్రీడాకారిణికి పెద్దగా ఎగ్జయిట్‌మెంట్‌ని ఇచ్చేవి కావు కానీ ఆమెలోని తల్లిని బాగా సంతోషపెట్టేవి. ‘‘పిల్లలు నా మెడల్‌ను పట్టుకుని తాకి చూస్తూ మురిసిపోతుంటే ఎక్కడ లేని ఆనందం కలిగేది.
ఆ స్ఫూర్తితోనే మా ఇద్దరమ్మాయిలు, అబ్బాయి ముగ్గురూ క్రీడాకారులయ్యారు. తల్లిగా నా పిల్లలను, నా 33 ఏళ్ల ఉద్యోగ జీవితంలో వేలాది మందిని క్రీడాకారులుగా తీర్చిదిద్దాను. వందల మంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కొందరు పిల్లలు ఉద్యోగం వచ్చిన వెంటనే తొలి ఫోన్ నాకే చేస్తుంటారు. అలాంటప్పుడు ఎంత సంతోషం వేస్తుందో మాటల్లో చెప్పలేను’’ అంటూ కళ్లు తుడుచుకున్నారామె.
పెన్షన్ డబ్బు దాచుకుని
వేర్ దేర్ ఈజ్ ఏ విల్ దేరీజ్ ఏ వే... అనే నానుడి నిజమేననిపిస్తుంది కోటేశ్వరమ్మను చూస్తే. ఇంటర్నేషనల్స్‌లో ఆడాలనే సంకల్పంతో పెన్షన్ డబ్బు దాచుకున్నారామె. భర్త పోయి పాతికేళ్లయింది. అప్పటికి పిల్లలు పూర్తిగా స్థిరపడలేదు. కుటుంబ బాధ్యతను పూర్తిగా తానే మోయాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఆర్థిక సర్దుబాట్లు తప్పవు. దాంతో ఇంటర్నేషనల్ అథ్లెట్ మీట్ కలను తనలోనే దాచుకోక తప్పలేదు. బాధ్యతలు తీరిపోయి, ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత దాచుకున్న డబ్బుతో నాలుగేళ్లుగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్‌లో పాల్గొంటున్నారు, విజేతగా తిరిగొస్తున్నారు.
ఎన్ని సాధించినా ఇది తీరే దాహం కాదంటారామె. ఇప్పటికింకా ఆసియా దాటి బయటకు వెళ్లలేదని, వరల్డ్ స్పోర్ట్స్‌లో విజేతగా మెడల్ అందుకోవడం తన లక్ష్యమంటున్నారు. ఊహ తెలిసిన తర్వాత పెళ్లయి, పిల్లలు పుట్టిన పదేళ్ల పాటు మాత్రమే ఆటలకు దూరంగా గడిపారామె. తన జీవితంలో వెనక్కి చూసుకుంటే ఇల్లు, గ్రౌండ్ తప్ప మరేమీ లేవంటూ... ఊపిరి ఉన్నంత వరకు ఆడుతూనే ఉండాలి, గ్రౌండ్‌లోనే శ్వాస వదలాలని తన కోరిక అంటున్నారు. ఉద్యోగం నుంచి రిటైర్ కావచ్చు, కానీ క్రీడాకారిణిగా రిటైర్ కావడమనే ఊహనే భరించలేకపోతున్నారు కోటేశ్వరమ్మ.
ఆటల్లో దెబ్బ తగల్లేదు కానీ
ఇన్నేళ్ల క్రీడా జీవితంలో ఒక్క దెబ్బ కూడా తగిలించుకోలేదామె. అయితే పక్కింటి బాదం చెట్టు కాయలను దొంగతనంగా కోసేటప్పుడు తగిలిన గాయం మచ్చ ఇప్పటికీ అలా ఉండిపోయింది. ‘కర్ర గుచ్చుకుపోయి, కండ ఊడి వచ్చేసింది.
అయినా కట్టుకుని కూడా ఆ మర్నాడే ఆటలకు వెళ్లి పోయాను’ అని నవ్వుకుంటూ మోకాలికి కిందగా ఉన్న మచ్చను తడుముకున్నారు. ఆటలాడితే జీవితం అందంగా ఉంటుంది. నిజమే, కోటేశ్వరమ్మ ఫిట్‌నెస్ కోసం ఏ వ్యాయామమూ చేయరు. రోజూ ఇష్టమైనంత సేపు ఆడటమే ఆమె ఆరోగ్య రహస్యం. ‘ఉన్నది ఒక్కటే జీవితం. ఆడుతూ ఆహ్లాదంగా జీవిస్తేనే ఆనందం, ఆరోగ్యం’. అందుకు ఈ క్రీడాకారిణి జీవితమే నిదర్శనం.
ఇప్పటికీ అద్భుతమే!
రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ప్రథమ పౌరుడిని కలవడం నా జీవితంలో అత్యంత అద్భుతంగా అనిపించే సంఘటన. ఇప్పుడు గుర్తు చేసుకున్నా కూడా ఒళ్లు రోమాంచితమవుతుంది. టెన్త్‌క్లాస్(1966)లో ఉన్నప్పుడు ఎన్íసీసీ క్యాడెట్‌గా రిపబ్లిక్ డే పెరేడ్‌లో పాల్గొన్నాను. ఆ తర్వాత రోజు పిల్లలందరినీ రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లారు. అప్పుడు మన రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు. మాకు రోజ్ గార్డెన్ అంతా తిప్పి చూపించారు.
అన్ని రకాల గులాబీ పూలను, అంత పెద్ద తోటను చూడటం మాకదే తొలిసారి. మా సంతోషం చూసి ఆయన పూలు కోయించి మాకందరికీ ఇచ్చారు. రాష్ట్రపతిని కలవడానికి వేసుకున్న మెరూన్ కలర్ బ్లేజర్‌ని ఇప్పటికీ దాచుకున్నాను. పెరేడ్ కోసం మా టీమ్ ఢిల్లీలో దిగిన రోజు మాత్రం అత్యంత విషాదకరం. ఢిల్లీ స్టేషన్‌లో రైలు దిగగానే మన దేశ రాజధాని నగరం ఇది అని పిల్లలంతా కేరింతల్లో ఉన్నాం.
అప్పుడు తెలిసింది ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మరణించారని. వివరాలు తెలిసే వయసు కాదు కానీ మనసంతా ఏదో తెలియని గుబులు ఆవరించిందప్పుడు. ప్రాక్టీస్‌లో మునిగిపోయాక ఇక ఆ సంగతి పూర్తిగా మర్చిపోయాం. ఆ ఢిల్లీ పర్యటన ముగించుకుని కావలికి రాగానే రైల్వే స్టేషన్‌లో ఘనస్వాగతం. జిల్లా నుంచి పెరేడ్‌కు వెళ్లింది నేను మాత్రమే. వీధివీధిలో షామియానాలు వేసి పట్టణం అంతా ఊరేగించారు నన్ను.
చిన్నప్పుడు అంత పెద్ద సంతోషం అనుభవంలోకి రావడంతోనో ఏమో, నేను ఎన్ని మెడల్స్ సాధించినా సరే, ఒక్కొక్క మైలురాయిని దాటుతున్నట్లు ఉంటోంది తప్ప గొప్ప అచీవ్‌మెంట్ అని మనసు పొంగిపోవడం లేదు. బహుశా ఆసియా దాటి ప్రపంచ స్థాయిలో మెడల్ సాధించినప్పుడు నా మనసు నిండుతుందేమో. – ఏనుగుల కోటేశ్వరమ్మ, వెటరన్ అథ్లెట్
Comments
Please login to add a commentAdd a comment