రాష్ట్రంలో ప్రీ స్కూల్ విద్యా కోర్సు
ఎన్‌సీటీఈకి విద్యాశాఖ ప్రతిపాదన
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ఉపాధ్యాయ విద్యా కోర్సును ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభిం చింది. వచ్చే విద్యా ఏడాది (2017–18) నుంచి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) అనే రెండేళ్ల కోర్సును ప్రారంభించేందుకు అనుమతివ్వాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్‌సీటీఈ) ఇటీవల ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్రంలో డీఎడ్ ఉపాధ్యాయ విద్యా శిక్షణను ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తున్న జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) డీపీఎస్‌ఈ కోర్సు నిర్వహణకు అనుమతివ్వాలని కోరింది. పాత జిల్లాల ప్రకారం ఉన్న 10 డైట్‌లలో 10 డీపీఎస్‌ఈ కోర్సును ప్రారంభిస్తామని, ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున ప్రవేశాలు కల్పించి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ శిక్షణను చేపడతామని పేర్కొంది. జిల్లాల పునర్విభజన అనంతరం మొత్తం 31 జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో కొత్త జిల్లాల్లోనూ డైట్ కాలేజీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఎన్‌సీటీఈ నుంచి ఆమోదం లభించగానే తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తోంది.
ప్రభుత్వ రంగంలోనూ ప్రీ ప్రైమరీకి డిమాండ్ వల్లే...
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కోర్సులు అమల్లో ఉండగా డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ (డీఈసీఈడీ) కోర్సును ఎన్‌సీటీఈ 2014లో అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం దాన్ని డీపీఎస్‌ఈగా మార్చింది. ఈ కోర్సును ప్రారంభించేందుకు పలు రాష్ట్రాలు ఎన్‌సీటీఈకి దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రీ ప్రైమరీ విద్యకు ప్రాధాన్యం పెరిగింది. ఆంగ్ల మాధ్యమంతో కూడిన ప్రీ ప్రైమరీ విద్య ఉండాల్సిందేనని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విధానం అమలవుతున్నా దానిపై ప్రభుత్వ నియంత్రణ లేదు. ప్రభుత్వ రంగంలోనూ ప్రీ ప్రైమరీకి డిమాండ్ పెరగడంతో ప్రైవేటు స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్యపై నియంత్రణకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రైవేటు స్కూళ్లు నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టడంతోపాటు సంబంధిత కోర్సులో శిక్షణ పొందిన వారితో బోధన చేయించేలా చర్యలు చేపట్టాలని నిశ్చయించింది.