Diploma in Pre-School Education
-
నేడు డీఈఈసెట్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: ‘డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ), డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్)’ కోర్సుల ప్రవేశపరీక్ష డీఈఈసెట్–2018 నోటిఫికేషన్ శుక్రవారం (13న) విడుదల కానుంది. గురువారం జరిగిన సెట్‌కమిటీ సమావేశంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. పరీక్షలను వచ్చే నెల 20 తర్వాత ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్ష తేదీలను ఖరారు చేస్తారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో డీఈఈసెట్‌ను నిర్వహిస్తారు. మెదక్ డైట్లో డీపీఎస్ఈ కోర్సు ఈసారి కొత్తగా మెదక్ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో (డైట్) డీపీఎస్ఈ కోర్సును ప్రభుత్వం అందుబా టులోకి తెస్తోంది. దీనిలో ప్రవేశాలను డీఈఈసెట్‌తో చేపట్టనున్నారు. డీపీఎస్ఈ కోసం వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. డీఈఈసెట్ కన్వీనర్‌గా రమణకుమార్‌ను నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని 12 ప్రభుత్వ డైట్లు, 188 ప్రైవేటు డీఎ డ్ కాలేజీలు, ఒక డీపీఎస్ఈ కాలేజీలో కలిపి 10 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. జిల్లాకో డైట్ ఇవ్వండి: రాష్ట్రంలో ప్రస్తుతం 10 పాత జిల్లాల్లోనే డైట్ కాలేజీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో లేవు. దీంతో ఆ 21 జిల్లాల్లో ప్రభుత్వ డైట్ కాలేజీలను మంజూరు చేయాలని విద్యాశాఖ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అయితే అన్నింటిని ఒకేసారి మంజూరు చేస్తారా.. విడతల వారీగా ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. -
10 కాలేజీలు అడిగితే.. వచ్చింది ఒక్కటే!
► మెదక్‌లో డీపీఎస్ఈ కోర్సు ప్రారంభానికి ఎన్సీటీఈ అనుమతి ► వసతులు లేనందున మిగతా డైట్లలో అనుమతికి నిరాకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సును పది జిల్లాల్లోని ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాల్లో క్రమంగా ఇంగ్లిషు మీడియం తరగతులను ప్రారంభిస్తున్న విద్యాశాఖ, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌పై ఉపాధ్యాయ శిక్షణ కోర్సు అయిన డీపీఎస్ఈని ప్రవేశ పెట్టాలని భావించినా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) అనుమతించలేదు. దీంతో ఈసారి డీపీఎస్ఈ ప్రారంభానికి అవకాశం లేకుండా పోయంది. పాత పది జిల్లాల్లోని డైట్లలో 100 సీట్ల చొప్పున డీపీఎస్ఈ కోర్సుకు అనుమతించాలని విద్యాశాఖ ఎన్‌సీటీఈకి గతంలో ప్రతిపాదనలు పంపించింది. దానిపై ఎన్సీటీఈ బృందం గత నెలలో రాష్ట్రానికి వచ్చి ఆయా డైట్లను తనిఖీ చేసి వెళ్లింది. చివరకు పదింట్లో ఒక్క మెదక్ జిల్లా డైట్లో డీపీఎస్ఈ కోర్సు ప్రారంభించేందుకు అనుమతించింది. దీంతో కంగుతున్న విద్యాశాఖ ఎన్సీటీఈ అధికారులను సంప్రదించగా వసతుల లేమి, పక్కా భవనాలు లేని కారణంగా మిగతా 9 జిల్లాల్లోని డైట్లలో డీపీఎస్ఈ ప్రారంభానికి అనుమతించడం లేదని స్పష్టం చేసింది. వికారాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ డైట్లకు పక్కా భవనాలు లేవని, అవి రేకుల షెడ్డుల్లో కొనసాగుతున్నందున అక్కడ డీపీఎస్ఈ ప్రారంభానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. మిగతా ఆరు జిల్లాల్లో ఉన్న భవనాలు ప్రస్తుతం డీఎడ్ కోర్సు నిర్వహణకు మాత్రమే సరిపోయేలా ఉన్నాయని, ఒక్కో కాలేజీలో 100 సీట్లు కలిగిన డీపీఎస్ఈ కోర్సు నిర్వహణకు సరిపోవని, మౌలిక సదుపాయాలు లేనందున ఆయా జిల్లాల్లో డీపీఎస్ఈ కోర్సు ప్రారంభానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. దీంతో విద్యాశాఖ పునరా లోచనలో పడింది. వెంటనే వరంగల్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని డైట్లలో రేకుల షెడ్డులను తొలగించి, పక్కా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. మిగతా జిల్లాల్లోనూ అదనపు తరగతి గదులను నిర్మించి వచ్చే ఏడాదైనా అన్ని పాత జిల్లాల్లో డీపీఎస్ఈ కోర్సును ప్రారంభించేందుకు అనుమతి సాధించేదిశలో కసరత్తు ప్రారంభించింది. ఇక ఒక్క మెదక్ డైట్లో కోర్సుకు అనుమతించిన నేపథ్యంలో ఈసారి ఆ ఒక్క కాలేజీలో డీపీఎస్ఈ ప్రారంభించాలా? వచ్చే ఏడాదే అన్నింటిలో ఒకేసారి ప్రారంభించాలా? అన్నది తేల్చాలని ప్రభుత్వానికి విద్యాశాఖ లేఖ రాసింది. ప్రభుత్వం ఓకే అంటే ఈసారి ఒక్క మెదక్‌లోని డైట్లో డీపీఎస్ఈ కోర్సు ప్రారంభం అవుతుంది. లేదంటే ఇక వచ్చే ఏడాదే అన్నింట్లో ప్రారంభిస్తారని తెలుస్తోంది. -
రాష్ట్రంలో ప్రీ స్కూల్ విద్యా కోర్సు
ఎన్‌సీటీఈకి విద్యాశాఖ ప్రతిపాదన వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ఉపాధ్యాయ విద్యా కోర్సును ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభిం చింది. వచ్చే విద్యా ఏడాది (2017–18) నుంచి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) అనే రెండేళ్ల కోర్సును ప్రారంభించేందుకు అనుమతివ్వాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్సీటీఈ) ఇటీవల ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్రంలో డీఎడ్ ఉపాధ్యాయ విద్యా శిక్షణను ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తున్న జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) డీపీఎస్ఈ కోర్సు నిర్వహణకు అనుమతివ్వాలని కోరింది. పాత జిల్లాల ప్రకారం ఉన్న 10 డైట్లలో 10 డీపీఎస్ఈ కోర్సును ప్రారంభిస్తామని, ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున ప్రవేశాలు కల్పించి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ శిక్షణను చేపడతామని పేర్కొంది. జిల్లాల పునర్విభజన అనంతరం మొత్తం 31 జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో కొత్త జిల్లాల్లోనూ డైట్ కాలేజీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఎన్సీటీఈ నుంచి ఆమోదం లభించగానే తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ రంగంలోనూ ప్రీ ప్రైమరీకి డిమాండ్ వల్లే... డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కోర్సులు అమల్లో ఉండగా డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ (డీఈసీఈడీ) కోర్సును ఎన్సీటీఈ 2014లో అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం దాన్ని డీపీఎస్ఈగా మార్చింది. ఈ కోర్సును ప్రారంభించేందుకు పలు రాష్ట్రాలు ఎన్‌సీటీఈకి దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రీ ప్రైమరీ విద్యకు ప్రాధాన్యం పెరిగింది. ఆంగ్ల మాధ్యమంతో కూడిన ప్రీ ప్రైమరీ విద్య ఉండాల్సిందేనని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విధానం అమలవుతున్నా దానిపై ప్రభుత్వ నియంత్రణ లేదు. ప్రభుత్వ రంగంలోనూ ప్రీ ప్రైమరీకి డిమాండ్ పెరగడంతో ప్రైవేటు స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్యపై నియంత్రణకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రైవేటు స్కూళ్లు నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టడంతోపాటు సంబంధిత కోర్సులో శిక్షణ పొందిన వారితో బోధన చేయించేలా చర్యలు చేపట్టాలని నిశ్చయించింది.