గందరగోళం
♦ ‘కొత్త విద్యాసంవత్సరం’ అస్తవ్యస్తం
♦ పాఠశాలల్లో విఫలమైన ‘ముందస్తు ప్రణాళిక’
♦ ఈ నెల 21నుంచి నూతన తరగతులన్న విద్యాశాఖ
♦ ఆదేశాల్లో మాత్రం కొరవడిన స్పష్టత
♦ బడిలో దిక్కులు చూస్తున్న ఉపాధ్యాయులు
♦ భారీగా పతనమైన విద్యార్థుల హాజరు...
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సీబీఎస్‌ఈ తరహాల్లో ముందస్తుగా కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలనుకున్న విద్యాశాఖ ఆలోచన బెడిసికొట్టింది. సరైన కార్యాచరణ లేకుండానే పలురకాల ఉత్తర్వులు ఇస్తూ పాఠశాల యాజమాన్యాలను అయోమయానికి గురిచేయడంతో అటు విద్యార్థులు.. ఇటు ఉపాధ్యాయులు గందరగోళంలో పడ్డారు. సాధారణంగా ఏప్రిల్ 24తో ముగిసి.. జూన్ 12 నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమయ్యేది. కానీ ఈసారి మార్పులు చేపట్టిన విద్యాశాఖ.. మార్చి 15నాటికి 1 నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు పూర్తి చేసి.. మార్చి 21 నుంచి నూతన విద్యాసంవత్సరాన్ని ప్రారంభించింది. అయితే ప్రణాళిక ప్రకారం పుస్తకాల ముద్రణ, యూనిఫాం పంపిణీ గాడి తప్పడంతో అంతా అయోమయంలో పడింది.
జిల్లాలో మొత్తం 5,447 పాఠశాలలున్నాయి. ఇందులో 2,289 ప్రభుత్వ పాఠశాలలు, 3158 ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో 10,45,878 మంది విద్యార్ధులున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 3,26,743 మంది ఉన్నారు. తాజాగా ఈ నెల 21 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. కానీ వీరికి కొత్త తరగతికి సంబంధించి పాఠ్యాంశ బోధనకు పుస్తకాలు అందలేదు. పాత విద్యార్థుల నుంచి పుస్తకాలు సేకరించి కొత్తగా వచ్చిన వారికి ఇవ్వాలని విద్యాశాఖ సంచాలకులు సూచించినా మెజారిటీ విద్యార్థులు పుస్తకాలు సమర్పించలేదు. దీంతో కొత్త తరగతికి సంబంధించిన బోధనకు ఆదిలోనే అడ్డుకట్టపడింది. మరోవైపు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాటశాలల్లో 5,7, విద్యార్థులు బడి మారాల్సిన పరిస్థితి రావడం..
10తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగియకపోవడంతో ఆయా తరగతుల విద్యార్థులు పుస్తకాలు వెనక్కు ఇవ్వలేదు. ఇలా అన్ని తరగతుల్లోనూ ఇదే తీరు నెలకొనడంతో ఎక్కడా బోధన సవ్యంగా సాగడం లేదు. ఈ క్రమంలో 3ఆర్(చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు) కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా విద్యాశాఖకు డీఎస్‌ఈ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని ప్రధానోపాధ్యాయులకు డీఈఓ చేరవేశారు. అయితే ఈ ప్రక్రియ ఒకటి నుంచి మూడోతరగతి విద్యార్థుల వరకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. నాలుగో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియ బోధనపై ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో టీచర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు.
హాజరులో పతనం..
పరీక్షలు ముగిసిన వెంటనే సెలవులు రావడం విద్యార్థులకు అలవాటుగా మారింది. ఈ క్రమంలో కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడం.. బోధన మాత్రం నిలిపివేయడంతో విద్యార్థులు సైతం బడికి రావడానికి ఇష్టపడడం లేదు. దీంతో పాఠశాలల్లో హాజరుశాతం గణనీయంగా పడిపోతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం దాదాపు 45శాతం తగ్గినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. సరూర్‌నగర్, వికారాబాద్ డివిజన్లలో విద్యార్థుల గైర్హాజరు 50శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘ నేతలు చెబుతుండడం గమనార్హం.