మోడల్ స్కూళ్లలో పరిస్థితి
పట్టించుకోని యంత్రాంగం
కంచిలి:ఏపీ మోడల్ స్కూళ్లలో అకడమిక్ వలంవటీర్ల నియామకం ఎండమావిగా మారింది. ఈ ప్రక్రియను ఇంతవరకూ చేపట్టలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్పప్పటికీ ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక చేసిన చేసిన వారికి సైతం నియామకపత్రాలు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువులు సక్రమంగా సాగే పరిస్థితి కనిపించటం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 14 మోడల్ స్కూళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కో స్కూల్‌లో సుమారు 500 మంది విద్యార్థులు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్నారు. ఒక్కో స్కూల్‌లో 13 నుంచి 15 మంది వరకు రెగ్యులర్ అభ్యసనా సిబ్బంది ఉండాల్సి ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నియామక ప్రక్రియలు చేపట్టలేదు.
తాత్కాలికంగా సబ్జెక్టు టీచర్ల కొరత నుంచి గట్టెక్కటానికి నియమించాల్సిన అకడమిక్ వటంటీర్లను కూడా ఇంతవరకు నియమించకపోవంతో పాఠ్యాంశాలు ఎంతవరకు పూర్తవ్వగల వనే సందేహంఉపాధ్యాయ సిబ్బందిలో సైతం నెలకొంది. మోడల్ స్కూళ్ల వ్యవస్థ ఏర్పడి మూడో విద్యాసంవత్సరం మొదలైనప్పటికీ బాలారిష్టాల సమస్యలు ఇంతవరకు పరిష్కరించకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందనే భావనే వ్యక్తమవుతోంది. కార్పోరేట్ విద్యాసంస్థల స్థాయిలో విద్యను అందిస్తామని చెప్పి ఏర్పాటు చేసిన ఈ విద్యాలయాల్లో అధ్యాపక సిబ్బందినే ఇంతవరకు పూర్తిస్థాయిలో నియమించలేదు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే వీటి ఏర్పాటు లక్ష్యం ఎంతవరకూ ఫలిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ప్రారంభానికి నోచుకోని వసతి గృహ సముదాయాలు
ఒకవైపు అకడమిక్ వటంటీర్ల సమస్యతో మోడల్ స్కూల్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు నిర్మాణం పూర్తిచేసుకొన్న వసతి గృహాలను ప్రారంభించకపోవటంతో విద్యార్థులు హాస్టల్ వసతికి నోచుకోవటం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే వీటి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ మరుగుదొడ్లు, ప్రహరీ పనులు చేపట్టలేదు. ఫలితంగా వసతి గృహాలు ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లాలో మఠంసరియాపల్లి, రాజపురం, సోంపేట, ఇచ్ఛాపురం, కరవంజ, ఈదులవలస పాఠశాలల్లో వసతి గృహాల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా చిన్నపాటి పనులు పూర్తి చేయకపోవటంతో ఈ విద్యాసంవత్సరంలోనైనా విద్యార్థులు వసతికి నోచుకుంటారో లేదో అనే అనుమానం తలెత్తుతోంది. జిల్లా యంత్రాంగం కూడా మోడల్ స్కూళ్లలో నెలకొన్న సమస్యలపై సీరియస్‌గా స్పందించకపోటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారయ్యింది.
వలంటీర్ల నియామకం ఎండమావే !
Published Fri, Jul 24 2015 11:18 PM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM
Advertisement