subject teachers
-
సబ్జెక్టు టీచర్లుగా అర్హులైన ఎస్జీటీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ హైస్కూళ్లు, ఇతర ప్రీ హైస్కూళ్లలో 3వ తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. నూతన విధానంలోని స్కూళ్లలో 3వ తరగతి నుంచి సబ్జెక్టుల బోధనకు సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీలు)కు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలని భావించింది. దీనికోసం తగిన అర్హతలున్న 2,095 మంది ఎస్జీటీలతోపాటు మరో 3,714 మంది మొత్తం 5,809 మంది ఎస్జీటీలకు పదోన్నతి ఇవ్వడానికి జీవో నంబర్లు 117, 128 ను విడుదల చేసింది. వీటిపై కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేశారు. కోర్టు ఆదేశాలతో పదోన్నతుల ప్రక్రియ పూర్తికాలేదు. అయితే విద్యార్థులకు సబ్జెక్టు బోధనకు వీలుగా పాఠశాల విద్యా శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. 5,809 మందినీ తాత్కాలికంగా సబ్జెక్టు బోధన చేసేలా చర్యలు చేపట్టారు. కోర్టు కేసులు పరిష్కారమై, వీరికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చే వరకు సబ్జెక్టు బోధన చేస్తారు. ఇందుకు వీరికి నెలకు రూ. 2,500 చొప్పున సబ్జెక్టు టీచర్ అలవెన్స్ ఇస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మెమో జారీచేశారు. -
స్కూళ్లు తెరిచి రెండు నెలలు.. సర్దుబాటు తలనొప్పులు, పరిష్కారం?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలో మళ్ళీ సర్దుబాటు తలనొప్పులు మొదలయ్యాయి. స్కూళ్లు తెరిచి రెండు నెలలు దాటినా సబ్జెక్టు టీచర్ల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీనిని భర్తీ చేయడానికి ఒక చోటు నుంచి మరో చోటుకు టీచర్లను సర్దుబాటు చేస్తున్నారు. ఫలితంగా అనేక స్కూళ్లలో బోధన కుంటుపడుతోందన్న విమర్శలొస్తు న్నాయి. ఈ సర్దు బాట్లన్నీ జిల్లాల పరిధిలోనే జరుగుతా యని రాష్ట్ర అధికారులు అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సర్దుబాటు చేయాల్సి వస్తోందని జిల్లాల అధికారులు చెబుతున్నారు. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువులు మొదలు పెట్టినా, ఈ తరహా సర్దు బాట్లు ఏమిటని విద్యారంగ నిపుణులు ప్రశ్నిస్తు న్నారు. ఉపాధ్యాయుల కొరతే ఈ సమస్యకు కారణ మని అధికారులు అంటున్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేపడితే తప్ప కొత్త నియామకాలపై స్పష్టత రాదని, అప్పటి వరకూ సర్దు బాట్లు తప్పవని చెపుతున్నారు. విద్యా వాలంటీర్ల నియామకం లేక.. ఏటా విద్యా వలంటీర్లను తీసుకుని బోధన కార్యక్రమాలు చేపట్టేవాళ్లు. దీనివల్ల సమస్య తీవ్రత కొంత కనిపించేది కాదు. అయితే కరోనా వచ్చినప్పటినుంచి విద్యా వలంటీర్ల నియా మకం చేపట్టడం లేదు. ఫలితంగా సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత మరింత పెరిగింది. ఇటీవల సేకరించిన వివరాల ప్రకా రం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 5 వేల మంది సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. సెకండరీ గ్రేడ్ టీచర్లతో కలిపి 16,500 మంది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించారు. అయితే, ఈ సంఖ్య 19 వేల వరకూ ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ప్రమోషన్లు ఇస్తే పరిష్కారం పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడం వల్ల ఖాళీలను భర్తీ చేయడం లేదు. దీనివల్ల విదావ్యవస్థలో అనేక ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పలుమార్లు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. విధిలేక పోరాటానికి సిద్ధమయ్యాం. ఇప్పటికైనా సర్దుబాటు కాకుండా, శాశ్వత పరిష్కారం వైపు అడుగులేయాలి. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి) ప్రాథమిక విద్యపైనా ప్రభావం.. రాష్ట్రంలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధన విష యంలో ప్రభుత్వం ఇప్పటికీ శ్రద్ధ పెట్టడం లేదని విమ ర్శలు వస్తున్నాయి. ఈ కేటగిరీలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయినట్లు ఇటీవల నివేదికలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ ఉపాధ్యాయుల కొరత తీర్చడం అటుంచి, ఉన్న టీచర్లను వేరే ప్రదేశాలకు సర్దుబాటు చేస్తు న్నారనే విమర్శలొస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఓ స్కూల్ ఉపాధ్యాయుడిని ఉన్నత పాఠశాలకు పంపారు. దీంతో ప్రాథమిక పాఠశాలలో బోధన కుంటుపడింది. ఆసిఫా బాద్లో 65 మందిని, నిర్మల్లో 110 మందిని, ఆదిలా బాద్లో 97 మందిని ఈ విధంగానే సర్దుబాటు చేశారు. -
బోధనకు యాతన
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ పోస్టులు ఖాళీగా ఉండటంతో బోధనకు ఆటంకంగా మారింది. సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులతో భర్తీ చేయాల్సిన ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ప్రతి నెలా పదవీ విరమణలతో ఖాళీ అవుతున్న పోస్టుల్ని ఎప్పటికప్పుడు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఈ ప్రక్రియ జిల్లాలో గత 15 నెలలుగా నిలిచిపోవడంతో ఉపాధ్యాయ ఖాళీలు పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల పరిధిలో 561 పోస్టులు, ప్రాథమిక పాఠశాలల పరిధిలో 63 ప్రధానోపాధ్యాయ, 33 ఎస్జీటీ పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. దీంతో పాటు ఉన్నత పాఠశాలల్లో 23 ప్ర«ధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి సర్వీసు రూల్స్ సాకుతో బ్రేక్ ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలు ప్రభావంతో ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల మధ్య తలెత్తిన విభేదాలతో న్యాయస్థానాల్లో ఉన్న కేసులను సాకుగా చూపుతున్న ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియ చేటప్టడం లేదు. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరుచుకోవడంతో నేటికీ పూర్తిస్థాయిలో విద్యా బోధన జరగడం లేదు. సైన్స్, సోషల్, మాథ్స్ సబ్జెక్టులతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషా సబ్జెక్టులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోర్టు తదుపరి ఉత్తర్వులకు లోబడి అడ్హక్ పద్ధతిలో పదోన్నతులు కల్పించేందుకు అవకాశం ఉన్నప్పటికీ విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నారు. ఐదు ఎడ్యుకేషన్ డివిజన్లలో టీచర్ల కొరత జిల్లాలోని గుంటూరు, తెనాలి, బాపట్ల, నరసరావుపేట, సత్తెనపల్లి డివిజన్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత నెలకొంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని పాఠశాలల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయి. గతంలో జరిగిన పదోన్నతుల కౌన్సెలింగ్లో పల్నాడు ప్రాంతం నుంచి పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు గుంటూరు, తెనాలి, బాపట్ల డివిజన్లలోని పాఠశాలలకు రావడంతో అక్కడ ఖాళీలు పేరుకుపోయాయి. ఉదాహరణకు బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు జెడ్పీ హైస్కూల్లో గణితం బోధించేందుకు ఉపాధ్యాయుడే లేరు. వెల్దుర్తి మండలం, నూజెండ్ల, ఈపూరు మండలాల్లోని పాఠశాలల్లో ఖాళీలు పేరుకుపోయాయి. బోధనకు తీవ్ర ఆటంకం సర్వీసు రూల్స్ అమల్లో నెలకొన్న వివాదాలతో పదోన్నతులు చేపట్టకపోవడం సరికాదు. విద్యా బోధనకు తీవ్ర ఆటంకంగా మారడంతో అడ్హక్ పద్ధతిలో అయినా పదోన్నతులు చేపట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. పాఠశాలలు ప్రారంభమైన పరిస్థితుల్లో ప్రభుత్వం దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలి.వి.వి.శ్రీనివాసరావు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు -
ప్రభుత్వ బడులపై నమ్మకం పెంచండి
సాక్షి, హైదరాబాద్: అనేక కారణాలతో ప్రభుత్వ బడులపై ప్రజల్లో అసంతృప్తి ఉం దని, దానిని తొలగించేందుకు డీఈవోలు అంకితభావంతో పని చేయాలని, ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెంచాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జిల్లా విద్యాధికారులను (డీఈవో) ఆదేశించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. బుధవారం సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో డీఈవోల రాష్ట్ర స్థారుు సదస్సును కడియం శ్రీహరి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు తీసుకొచ్చేందుకు డీఈవోలు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులతో వచ్చేనెల 10లోగా సమావేశాలు నిర్వహించాలన్నారు. పదో తరగతి పరీక్షలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున మంచి ఫలితాలు సాధించేలా పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. 2017 జూన్ నాటికి అన్ని పాఠశాలల్లో కనీస వసతులు, కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ తరగతులుండాలని, ఆ మేరకు డీఈవో చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇబ్బందులేమైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచిం చారు. విద్యార్థులు చదువును మధ్యలో మానేస్తే టీచర్లు వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మాట్లాడాలని, తిరిగి పిల్లలను పాఠశాలల్లో చేర్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రతి స్కూల్ లో డిజిటల్ తరగతులుంటాయని హామీ ఇచ్చారు. సబ్జెక్టు టీచర్లు లేనిచోట రిటైర్డు టీచర్లను తీసుకోండి.. సబ్జెక్టు టీచర్లు లేని చోట రిటైర్డ్ టీచర్లను తీసుకోవాలని సూచించారు. వారు దొరక్కపోతే అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాఠాల బోధన చేపట్టాలన్నారు. వారు అందుబాటులో లేకపోతే విద్యా వాలంటీర్లను నియమించాలన్నారు. 2017-18 విద్యా సంవత్సరంలో మరో లక్ష మంది విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించే లక్ష్యంతో బడిబాట నిర్వహిస్తామన్నారు. -
వలంటీర్ల నియామకం ఎండమావే !
మోడల్ స్కూళ్లలో పరిస్థితి పట్టించుకోని యంత్రాంగం కంచిలి:ఏపీ మోడల్ స్కూళ్లలో అకడమిక్ వలంవటీర్ల నియామకం ఎండమావిగా మారింది. ఈ ప్రక్రియను ఇంతవరకూ చేపట్టలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్పప్పటికీ ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక చేసిన చేసిన వారికి సైతం నియామకపత్రాలు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువులు సక్రమంగా సాగే పరిస్థితి కనిపించటం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 14 మోడల్ స్కూళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కో స్కూల్లో సుమారు 500 మంది విద్యార్థులు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్నారు. ఒక్కో స్కూల్లో 13 నుంచి 15 మంది వరకు రెగ్యులర్ అభ్యసనా సిబ్బంది ఉండాల్సి ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నియామక ప్రక్రియలు చేపట్టలేదు. తాత్కాలికంగా సబ్జెక్టు టీచర్ల కొరత నుంచి గట్టెక్కటానికి నియమించాల్సిన అకడమిక్ వటంటీర్లను కూడా ఇంతవరకు నియమించకపోవంతో పాఠ్యాంశాలు ఎంతవరకు పూర్తవ్వగల వనే సందేహంఉపాధ్యాయ సిబ్బందిలో సైతం నెలకొంది. మోడల్ స్కూళ్ల వ్యవస్థ ఏర్పడి మూడో విద్యాసంవత్సరం మొదలైనప్పటికీ బాలారిష్టాల సమస్యలు ఇంతవరకు పరిష్కరించకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందనే భావనే వ్యక్తమవుతోంది. కార్పోరేట్ విద్యాసంస్థల స్థాయిలో విద్యను అందిస్తామని చెప్పి ఏర్పాటు చేసిన ఈ విద్యాలయాల్లో అధ్యాపక సిబ్బందినే ఇంతవరకు పూర్తిస్థాయిలో నియమించలేదు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే వీటి ఏర్పాటు లక్ష్యం ఎంతవరకూ ఫలిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రారంభానికి నోచుకోని వసతి గృహ సముదాయాలు ఒకవైపు అకడమిక్ వటంటీర్ల సమస్యతో మోడల్ స్కూల్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు నిర్మాణం పూర్తిచేసుకొన్న వసతి గృహాలను ప్రారంభించకపోవటంతో విద్యార్థులు హాస్టల్ వసతికి నోచుకోవటం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే వీటి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ మరుగుదొడ్లు, ప్రహరీ పనులు చేపట్టలేదు. ఫలితంగా వసతి గృహాలు ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లాలో మఠంసరియాపల్లి, రాజపురం, సోంపేట, ఇచ్ఛాపురం, కరవంజ, ఈదులవలస పాఠశాలల్లో వసతి గృహాల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా చిన్నపాటి పనులు పూర్తి చేయకపోవటంతో ఈ విద్యాసంవత్సరంలోనైనా విద్యార్థులు వసతికి నోచుకుంటారో లేదో అనే అనుమానం తలెత్తుతోంది. జిల్లా యంత్రాంగం కూడా మోడల్ స్కూళ్లలో నెలకొన్న సమస్యలపై సీరియస్గా స్పందించకపోటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారయ్యింది. -
అప్గ్రేడేషన్ ఎప్పుడో?
ఏళ్ల తరబడి పండిట్, పీఈటీల నిరీక్షణ సమాన పనికి సమాన వేతనం పొందని పండితులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ)లు తమ పోస్టుల అప్గ్రేడేషన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఇతర సబ్జెక్టు టీచర్లు స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో ఎక్కువ వేతనం తీసుకుంటుండగా.. పండిట్లు, పీఈటీలు మాత్రం సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) స్థాయిలో తక్కువ వేతనంతోనే పనిచేయాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతోంది. స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా పనిచేస్తున్నా.. తమకు ఆ స్థాయి వేతనం ఇవ్వకపోవడం పట్ల వారు ఆవేదన చెందుతున్నారు. పైగా ఉన్నత పాఠశాలల్లో బోధించే వారంతా స్కూల్ అసిస్టెంట్లే ఉండాలని 2009లో ప్రభుత్వమే ఓ విధానం చేసింది. ఇందులో భాగంగా అప్పటివరకు ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 పండిట్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్-తెలుగు, స్కూల్ అసిస్టెంట్-ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్-హిందీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టును ఫిజికల్ డెరైక్టర్ పోస్టులుగా మా ర్చింది. భవిష్యత్ నియామకాలన్నీ ఈ పద్ధతిలోనే చేపట్టాలని పేర్కొంది. కానీ అప్పటికే ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్, పీఈటీల పోస్టులను అప్గ్రేడ్ చేసేందుకు మా త్రం సర్కారు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న 7 వేల మందికి పైగా పండిట్లు, 3 వేల మం ది కి పైగా ఉన్న పీఈటీలు తమ పోస్టుల అప్గ్రేడేషన్ కోసం ఆందోళన చెందుతున్నారు. జూనియర్ల కింద పనిచేస్తున్నాం భాషా పండితులకు పదోన్నతులు లేవు. దీంతో జూనియర్ల కింద పనిచేయాల్సి వస్తోంది. ఆత్మన్యూనతాభావం వేధిస్తున్నా ఉద్యోగం కోసం పనిచేయక తప్పడం లేదు. - పొన్నాల బాలయ్య, కరీంనగర్ సమాన పనికి సమానం వేతనం ఇవ్వాల్సిందే.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే ఎలా? స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా పనిచేస్తున్నా గుర్తించకపోతే ఎలా? ఏళ్ల తరబడి పండిట్లను, పీఈటీలను దోపిడీ చేస్తున్నారు. -ఎ.కుమారస్వామి, వరంగల్ అధిక ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నాం తెలుగు, ఉర్దూ, హిందీ సబ్జెక్టుల్లో అధిక ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నాం. పండితుల బోధన వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయి. ఇతర సబ్జెక్టుల వారితో సమానంగా పనిచేస్తున్నాం. ఆయినా మమ్మల్ని గుర్తించకపోతే ఎలా? - వేల్పుల స్వామి, కరీంనగర్ ఇదేనా పండితులకిచ్చే మర్యాద సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నాం. అలాంటి పండితులకు ఇచ్చే మర్యాద ఇదేనా? పక్క టీచర్లతో సమాన వేతనం ఇవ్వకుండా అవమానాలకు గురిచేయడం సరైందేనా? ఒక్క ప్రభుత్వం ఆలోచించాలి. - బత్తిని వేణుగోపాల్, కరీంనగర్