ఏళ్ల తరబడి పండిట్, పీఈటీల నిరీక్షణ
సమాన పనికి సమాన వేతనం పొందని పండితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ)లు తమ పోస్టుల అప్‌గ్రేడేషన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఇతర సబ్జెక్టు టీచర్లు స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో ఎక్కువ వేతనం తీసుకుంటుండగా.. పండిట్‌లు, పీఈటీలు మాత్రం సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) స్థాయిలో తక్కువ వేతనంతోనే పనిచేయాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతోంది. స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా పనిచేస్తున్నా.. తమకు ఆ స్థాయి వేతనం ఇవ్వకపోవడం పట్ల వారు ఆవేదన చెందుతున్నారు.
పైగా ఉన్నత పాఠశాలల్లో బోధించే వారంతా స్కూల్ అసిస్టెంట్లే ఉండాలని 2009లో ప్రభుత్వమే ఓ విధానం చేసింది. ఇందులో భాగంగా అప్పటివరకు ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 పండిట్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్-తెలుగు, స్కూల్ అసిస్టెంట్-ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్-హిందీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టును ఫిజికల్ డెరైక్టర్ పోస్టులుగా మా ర్చింది. భవిష్యత్ నియామకాలన్నీ ఈ పద్ధతిలోనే చేపట్టాలని పేర్కొంది. కానీ అప్పటికే ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేసేందుకు మా త్రం సర్కారు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న 7 వేల మందికి పైగా పండిట్‌లు, 3 వేల మం ది కి పైగా ఉన్న పీఈటీలు తమ పోస్టుల అప్‌గ్రేడేషన్ కోసం ఆందోళన చెందుతున్నారు.
జూనియర్ల కింద పనిచేస్తున్నాం
భాషా పండితులకు పదోన్నతులు లేవు. దీంతో జూనియర్ల కింద పనిచేయాల్సి వస్తోంది. ఆత్మన్యూనతాభావం వేధిస్తున్నా ఉద్యోగం కోసం పనిచేయక తప్పడం లేదు.
- పొన్నాల బాలయ్య, కరీంనగర్
సమాన పనికి
సమానం వేతనం ఇవ్వాల్సిందే..
సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే ఎలా? స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా పనిచేస్తున్నా గుర్తించకపోతే ఎలా? ఏళ్ల తరబడి పండిట్‌లను, పీఈటీలను దోపిడీ చేస్తున్నారు.
-ఎ.కుమారస్వామి, వరంగల్
అధిక ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నాం
తెలుగు, ఉర్దూ, హిందీ సబ్జెక్టుల్లో అధిక ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నాం. పండితుల బోధన వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయి. ఇతర సబ్జెక్టుల వారితో సమానంగా పనిచేస్తున్నాం. ఆయినా మమ్మల్ని గుర్తించకపోతే ఎలా?
- వేల్పుల స్వామి, కరీంనగర్
ఇదేనా పండితులకిచ్చే మర్యాద
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నాం. అలాంటి పండితులకు ఇచ్చే మర్యాద ఇదేనా? పక్క టీచర్లతో సమాన వేతనం ఇవ్వకుండా అవమానాలకు గురిచేయడం సరైందేనా? ఒక్క ప్రభుత్వం ఆలోచించాలి.
- బత్తిని వేణుగోపాల్, కరీంనగర్
అప్‌గ్రేడేషన్ ఎప్పుడో?
Published Tue, May 26 2015 2:39 AM | Last Updated on Thu, Sep 19 2019 8:59 PM
Advertisement
Advertisement