ప్రభుత్వ బడులపై నమ్మకం పెంచండి
సాక్షి, హైదరాబాద్: అనేక కారణాలతో ప్రభుత్వ బడులపై ప్రజల్లో అసంతృప్తి ఉం దని, దానిని తొలగించేందుకు డీఈవోలు అంకితభావంతో పని చేయాలని, ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెంచాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జిల్లా విద్యాధికారులను (డీఈవో) ఆదేశించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. బుధవారం సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో డీఈవోల రాష్ట్ర స్థారుు సదస్సును కడియం శ్రీహరి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు తీసుకొచ్చేందుకు డీఈవోలు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులతో వచ్చేనెల 10లోగా సమావేశాలు నిర్వహించాలన్నారు.
పదో తరగతి పరీక్షలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున మంచి ఫలితాలు సాధించేలా పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. 2017 జూన్ నాటికి అన్ని పాఠశాలల్లో కనీస వసతులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ తరగతులుండాలని, ఆ మేరకు డీఈవో చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇబ్బందులేమైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచిం చారు. విద్యార్థులు చదువును మధ్యలో మానేస్తే టీచర్లు వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మాట్లాడాలని, తిరిగి పిల్లలను పాఠశాలల్లో చేర్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రతి స్కూల్ లో డిజిటల్ తరగతులుంటాయని హామీ ఇచ్చారు.
సబ్జెక్టు టీచర్లు లేనిచోట రిటైర్డు టీచర్లను తీసుకోండి..
సబ్జెక్టు టీచర్లు లేని చోట రిటైర్డ్ టీచర్లను తీసుకోవాలని సూచించారు. వారు దొరక్కపోతే అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాఠాల బోధన చేపట్టాలన్నారు. వారు అందుబాటులో లేకపోతే విద్యా వాలంటీర్లను నియమించాలన్నారు. 2017-18 విద్యా సంవత్సరంలో మరో లక్ష మంది విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించే లక్ష్యంతో బడిబాట నిర్వహిస్తామన్నారు.