కొత్తగా రెక్కలొచ్చెనా..!
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ.. కొత్తగా చేరిన విద్యార్థులతో నగరంలోని కళాశాలల్లో పండుగ కళ కనిపిస్తోంది! ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, మరెన్నో లక్ష్యాలతో కాలేజీ క్యాంపస్‌లో అడుగుపెట్టిన యువతకు.. సరికొత్త ప్రపంచం సాక్షాత్కారమవుతుంది. స్వేచ్ఛాయుత వాతావరణం.. కొత్త స్నేహాలు, భిన్న మనస్తత్వాలు, విభిన్న నేపథ్యాలు, సంస్కృతులు.. వీటి మధ్య ఏదో తెలియని బెరుకుతనంతో కూడిన తడబాటు.. ఎవరిని పలకరిస్తే ఏమనుకుంటారో అనే భావన.. ఇలాంటి పరిస్థితుల్లో క్యాంపస్ లైఫ్ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
తల్లిదండ్రుల పర్యవేక్షణకు దూరంగా.. కొత్తగా కాలేజీ క్యాంపస్‌లో అడుగుపెట్టిన విద్యార్థికి రంగుల లోకంలో విహరిస్తున్నట్లుగా ఉంటుంది. కొత్త వాతావరణం.. సరికొత్త స్నేహాలు.. అపరిమిత స్వేచ్ఛ.. మరోవైపు చదువుల ఒత్తిడి.. ఇటువంటి సమయంలోనే విద్యార్థులు తమను తాము నియంత్రించుకునే సామర్థ్యాన్ని సొంతం చేసుకోవాలి. అటు అకడమిక్ వ్యవహరాలను, ఇటు కో కరిక్యులర్ యాక్టివిటీస్‌తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త వాళ్లతో, భిన్న వాతావరణంలో సర్దుకుపోయే అనుకూలతను, సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే విద్యార్థి వేసే ప్రతి అడుగు ఉన్నత కెరీర్‌కు బాటలు వేస్తుంది.
పరిచయం చేసుకోండి
కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టే సరికి వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ రకాల మనస్తత్వాలున్న విద్యార్థులు తారసపడతారు. ఇలాంటప్పుడు ఎవరితో ఎలా వ్యవహరించాలి.. అనే విషయంలో ఒత్తిడికి లోనుకావద్దు. వ్యక్తిగత నైపుణ్యాలను అలవరచుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ అవసరం లేదు. ప్రవర్తనా తీరును కొంత మార్చుకుంటే సరిపోతుంది. కొత్తగా క్యాంపస్‌లో చేరిన ఫ్రెషర్స్ తనతోపాటు కోర్సులో చేరిన వారితో, సీనియర్లతో, అధ్యాపకులతో సాధ్యమైనంత వరకు పరిచయాలు పెంచుకోవాలి. అందరితో స్నేహంగా మసలుకొనే ప్రయత్నం చేయాలి. ఇందుకు గ్రూప్ మూవింగ్ ఓ చక్కటి ప్రత్యామ్నాయం.
వ్యక్తుల మధ్య స్నేహం పెంచేందుకు చిరునవ్వు ఉపయోగపడుతుంది. ముఖంపై చిరునవ్వును చెదరనివ్వని వారు ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు. మాటల కూర్పు.. వినే ఓర్పు.. పలికే నేర్పుల.. సమాహారమే సంభాషణ. కాబట్టి సంభాషణ నైపుణ్యాలను పెంచుకోవాలి. ఎదుటి వారు చెప్పే విషయాలను జాగ్రత్తగా వినాలి. మన మాటలు ఎదుటివారిని ఆకట్టుకునేలా ఉండాలి. బిడియం లేకుండా లెక్చరర్లు, సీనియర్లను సంప్రదించి తెలియని విషయాలను తెలుసుకోవాలి. మీ సబ్జెక్టులతోపాటు ఆయా అంశాలపై మీ ఆలోచనలను, అభిప్రాయాలను తోటి విద్యార్థులతో, లెక్చరర్లతో పంచుకోండి.
చదువు ఒక్కటే కాదు
కాలేజీ అంటే.. కేవలం చదువు ఒక్కటే కాదు. విద్యార్థిని అన్ని అంశాల్లో సుశిక్షితుడిని చేసే చక్కటి వేదిక. కాబట్టి అకడమిక్ కార్యకలాపాలకే పరిమితం కాకుండా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో కూడా పాల్గొనాలి. ఇంటర్-కాలేజీ స్పోర్ట్స్, సెమినార్ల నిర్వహణ, కళాశాలలోని క్లబ్‌ల్లో సభ్యత్వం వంటి కార్యకలాపాల్లో పాలుపంచుకోవాలి. తద్వారా నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, టీమ్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ మెరుగవుతాయి. కాలేజీలో కోర్సును దిగ్విజయంగా పూర్తిచేసేందుకు, మంచి కెరీర్‌లో స్థిరపడేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
క్రమశిక్షణ ముఖ్యం
కాలేజీ జీవితాన్ని పూర్తిగా అస్వాదించాలంటే క్రమశిక్షణ కూడా చాలా అవసరం. క్యాంపస్‌లో కాలు పెట్టిన దగ్గరి నుంచి నిజాయతీగా కష్టపడటం అలవాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలి. అకడమిక్ వ్యవహారాలు సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. క్లాస్ అసైన్‌మెంట్స్‌ను నిర్దేశించిన సమయంలోగా సమర్పించడానికి ప్రయత్నించాలి. అదేసమయంలో అకడమిక్ వ్యవహరాలకు, సోషల్ లైఫ్ మధ్య సమన్వయం ఉండేలా జాగ్రత్తపడాలి. కెరీర్ దృష్టికోణంలో ఈ రెండూ అంశాలు చాలా కీలకమైనవి.
సమయం ఆదా
మరో కీలకమైన అంశం..ట్రాన్స్‌పోర్టేషన్. కాలేజీకి వెళ్లాల్సిన మార్గంపై అవగాహన పెంచుకోవాలి. కాలేజీ కి దగ్గర్లో ఉన్న బస్టాప్? ఏ నెంబర్ బస్ అక్కడికి వెళ్తుంది? ఏయే సమయాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయి? కాలేజీకి దగ్గర్లో ఎంఎంటీస్ స్టేషన్ ఉందా? సమీప ప్రదేశాలు? వంటి వివరాలను సేకరించాలి. తద్వారా కాలేజీ షెడ్యూల్‌కు అనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లను చేసుకోవడానికి వీలవుతుంది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ఎలాంటి హడావుడి లేకుండా కాలేజీకి చేరుకోవచ్చు. అంతేకాకుండా కోర్సుకు సంబంధించిన పుస్తకాలు, రికార్డులు, ఇతర సామాగ్రి లభించే ప్రదేశాలు, స్టోర్స్‌పై అవగాహన పెంచుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చే డబ్బును సక్రమంగా ఉపయోగించుకోవడంలోనూ, టైం మేనేజ్‌మెంట్‌లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.
ఏదో ఒక హాబీ
చదువుతోపాటు విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రావీణ్యం సాధించడానికి ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే నిరంతరం క్లాసులు, ల్యాబ్‌లు, లైబ్రరీ.. అంటే బోర్ కొట్టడం సహజం. కాబట్టి పెయింటింగ్, ఫొటోగ్రఫీ, థియేటర్ ఆర్ట్స్, డ్యాన్స్ వంటి కళలను నేర్చుకోవడాన్ని ఒక హాబీగా మార్చుకోవాలి. కాలేజీ రోజుల్లో అలవరచుకున్న హాబీనే తదనంతర కాలంలో ప్రధాన వ్యాపకంగా మార్చుకొని ఉన్నతస్థాయికి చేరుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఉజ్వల భవితకు హాబీ కూడా అవసరమే.
ఉన్నతంగా ఎదగాలి!
శ్రీవివిధ ప్రాంతాలు, భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులకు సిటీ వాతావరణం మొదట కొత్తగానే ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఎదుైరె నా త్వరలోనే ఇక్కడి వాతావరణానికి అలవాటుపడిపోతారు. అయితే విద్యార్థులు ముఖ్యంగా స్కిల్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టాలి. చదువుతోపాటు ఇతర ప్రయోజనకర కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ నైపుణ్యాలను పెంచుకోవాలి. డిగ్రీతోపాటు సొంతంగా జీవించడానికి కావాల్సిన నైపుణ్యాలు వృద్ధి చేసుకోవాలి. జాబ్ చేయడమే లక్ష్యంగా కాకుండా జాబ్‌ప్రొవైడర్లుగా రాణించడానికి కృషిచేయాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకోవాలి.
తగిన నైపుణ్యాలు సొంతం చేసుకుంటే ఉద్యోగం కోసం వెతికే పనిలేకుండా పది మందికి ఉద్యోగం కల్పించేలా చిన్న కంపెనీని ఏర్పాటు చేయొచ్చు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌స్కిల్స్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. ధైర్యంతో ఉండాలి. ఒంటరిగా ఎవరూ వంద శాతం విజయాలను సాధించలేరు. కలిసి చదువుకోవడం, కలిసి పనిచేయడం ద్వారానే కోర్సుతోపాటు కెరీర్‌లోనూ సక్సెస్ సాధిస్తారు. అందుకే మంచి స్నేహితులను ఎంచుకోవాలి. విద్యాభ్యాసంతోపాటే ఈవెంట్ మేనేజ్‌మెంట్, క్రైసిస్ మేనేజ్‌మెంట్ వంటి విషయాలపై అవగాహన ఏర్పడినప్పుడే పూర్తి స్థాయి విద్యావంతులుగా తయారవుతారు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రజ్ఞ ఉంటుంది. దాన్ని స్వత హాగా తెలుసుకోవాలి. స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ఏ అంశంపై ఆసక్తి ఉందో గమనించాలి. దానిలో మీ బలాలు, బలహీనతలేంటో బేరీజు వేసుకోవాలి. పూర్తి స్థాయి నైపుణ్యం సాధించేందుకు ప్రయత్నించాల్ణి.
- ప్రొ. బి. టి. సీత, ప్రిన్సిపల్,
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్, కోఠి
ఆసక్తికర దశ
కాలేజీ జీవితం అంటేనే.. చదువుతో పాటు అనేక విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించే ఆసక్తికరమైన దశ. చదువు ఎంత ముఖ్యమో స్నేహాలు, కొత్త విషయాలను నేర్చుకోవడం కూడా అంతే కీలకం. చదువుతోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్నేహితులతో సరదాలు వంటి మిగతా అంశాలనూ సమన్వయం చేసుకోవాలి. ఏ సమయంలో ఏది అవసరమో అదే చేయాలి. ప్రతి విషయంలో తమ పరిమితులను గుర్తిస్తూ స్వీయ నియంత్రణతో మెలగాలి. అప్పుడు అటు చదువుతోపాటు ఇటు ఉన్నత వ్యక్తిత్వం అలవడి ఉజ్వల భవిష్యత్‌కు సరైన పునాది పడుతుంది!!
ఇంటర్నెట్‌లో సమస్త సమాచారం
ప్రస్తుతం అంతా టెక్నాలజీ యుగం. సాంకేతిక ైనె పుణ్యంతో ప్రపంచం ముందుకు దూసుకుపోతున్న తరుణం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆయా అంశాలపై అవగాహనతో (టెక్ సవే) ఉండాలి. ఇందుకు ఇంటర్నెట్‌ను సమర్థంగా వినియోగించుకోవాలి. సిటీలో జరిగే వివిధ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ ఫెయిర్స్, కెరీర్ ఈవెంట్స్ సమాచారాన్ని నెట్ ద్వారా తెలుసుకొని వాటికి హాజరయ్యే ప్రయత్నం చేయాలి. ఇంటర్నెట్ వినియోగం ద్వారా ఒకే క్లిక్‌తో సమస్త సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నెట్ బ్రౌజింగ్‌ను అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా ఫేస్‌బుక్, ట్విటర్, లింక్డ్ ఇన్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లలో నిర్మాణాత్మకంగా పాల్గొనండి. స్నేహితులు, బంధువులతోపాటు మీ కోర్సుకు, సబ్జెక్టుకు సంబంధించిన నిపుణులతో నిత్యం సంబంధాలను కొనసాగించడానికి ఇవి చక్కని వేదికలుగా ఉపయోగపడతాయి. విద్య, కెరీర్‌కు సంబంధించి యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్స్ ఎన్నో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. మొబైల్, ట్యాబ్‌లెట్‌లోకి వీటిని ఇన్‌స్టాల్ చేసుకోవడం చాలా ప్రయోజనకరం.