వీధుల్లో టీచర్లు.. గాల్లో చదువులు!
పరీక్షల ముందు అదనపు బాధ్యతలు
ఆందోళనలో విద్యార్థులు
అరకొరగా జనాభా లెక్కలు
విశాఖపట్నం: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా తయారైంది విద్యార్థుల పరిస్థితి. తలాతోకా లేని నిర్ణయాలతో పిల్లల చదువులు గాలికొదిలేయాల్సిన దుస్థితి దాపురించింది. పరీక్షలు ముంచుకొస్తున్న సమయంలో ప్రభుత్వం టీచర్లను జనాభా లెక్కల సేకరణ బాధ్యతలను అప్పగించింది. గతంలో వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులతో జనాభా లెక్కల సేకరణ జరిపించేది. దానివల్ల చదువులకు ఆటంకం ఏర్పడేది కాదు. కానీ మునుపెన్నడూ లేనివిధంగా ఈ సారి విద్యా సంవత్సరం మధ్యలో ఆ పనిని అంటగట్టింది. దీంతో దాదాపు నెల రోజుల నుంచి సగం మందికి పైగా టీచర్లు జనాభా సేకరణలో పడ్డారు. తొలుత డిసెంబర్ 15 వరకు ఈ బాధ్యతలు నిర్వహించాలని చెప్పింది. కానీ నాలుగో వంతు కూడా ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో తాజాగా ఈ నెలాఖరు వరకు పొడిగించింది.
జిల్లాలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఉదయం పూట చదువులు చెప్పడానికి, మధ్యాహ్నం నుంచి జనాభా లెక్కల సేకరణకు వెళ్లేందుకు విద్యాశాఖ అధికారులు అనుమతించారు. పదో తరగతికి బోధించే టీచర్లకు మాత్రం మినహాయింపునిచ్చారు. ప్రభుత్వం మెమో న ంబరు 88140/21-11-15 ప్రకారం టెన్త్ సబ్జక్టులు బోధించే టీచర్లకు జనాభా సేకరణ నుంచి మినహాయింపునిచ్చింది. కానీ జీవీఎంసీ పరిధిలో మాత్రం వీరికి మినహాయింపు ఇవ్వలేదు. దీంతో పలువురు ఎలిమెంటరీతోపాటు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు జనాభా సేకరణ నిమిత్తం వీధుల్లోకి వెళ్లి ఇంటింటా తిరుగుతున్నారు. దీంతో ముఖ్యంగా పదో తరగతి పిల్లలు నష్టపోయే ప్రమాదంలో పడ్డారు. మూడు నెలలు టీచర్ల బదిలీల ప్రహసనం కొనసాగడంతో అరకొరగానే చదువులు సాగాయి. మళ్లీ ఇప్పుడు జనాభా లెక్కల బెడద వచ్చిపడింది.