ఇదేం విధానం?
ఇదేం విధానం?
Published Thu, Feb 16 2017 11:57 PM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM
ఏప్రిల్ 23తో ముగిసే విద్యా సంవత్సరం మార్చి 20తోనే ముగియనుంది...
జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం మార్చి 21 నుంచే ఆరంభం
పాఠశాలలు తెరిచేనాటికి పుస్తకాలు అందిచగలరా..?
ఏ పుస్తకం లేకుండానే తరగతులు నిర్వహించాలా...?
ఇదేం నిర్ణయమంటూ మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు
రామచంద్రపురం రూరల్ : ప్రతి ఏడాది ఏప్రిల్ 23వ తేదీతో ముగిసే విద్యా సంవత్సరం ఈసారి మార్చి 20తో ముగియనుంది. అలాగే జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం మార్చి 21వ తేదీ నుంచే మొదలు కానుంది. ఏటా ఏప్రిల్ 23 వరకూ వార్షిక పరీక్షలు నిర్వహించి 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇచ్చేవారు. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేవి. అయితే ఈ ఏడాది పద్ధతి మార్చారు. సెలవుల్లో మార్పు ఉండదు కానీ వార్షిక పరీక్షలు మాత్రం ముందుగానే నిర్వహిస్తారు. అవి ముగియగానే వెంటనే కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత నెల రోజులకు వేసవి సెలవులు ఇస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం 1– 9వ తరగతుల వార్షిక పరీక్షలు (సమ్మేటివ్–3) షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఆ ప్రకారం ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మార్చి 6న ప్రారంభమై 20న ముగుస్తాయి. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మార్చి 15న ప్రారంభమై 18న ముగుస్తాయి. ఆ మేరకు షెడ్యూలు, టైంటేబుల్ జిల్లా విద్యాశాఖకు చేరింది. ఇక్కడి నుంచి అన్ని యాజమాన్యాల పాఠశాలలకు చేరవేశారు. ఈ నిర్ణయంపై తలలు పట్టుకుంటున్న ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లలను ముందస్తు పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.
సిలబస్ సంగతేంటి...
6–10 తరగతులకు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమైంది. ఈ విధానం ఉపాధ్యాయులకు అర్థమయ్యేందుకే బాగా సమయం పట్టింది. విద్యార్థులు ఇంకా ఓనమాలు నేర్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రాజెక్టు పనులకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ యాజమాన్యాలు ఈ విషయంలో కాస్త ముందున్నారు. వారు ఇప్పటికే అన్ని తరగతులకు దాదాపు సిలబస్ పూర్తి చేసి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు సిలబస్ ఇంకా 30 శాతంపైనే పెండింగ్ ఉంది. ఈ పరిస్థితుల్లో దాదాపు నెల రోజుల ముందు పరీక్షలు పెట్టడం తమకు ఇబ్బందికరమేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రకటించి వచ్చే ఏడాది నుంచి అమలు చేసి ఉంటే బాగుండేదంటున్నారు.
పుస్తకాలు ఎలా?
మార్చి 21 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమైతే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఎలా అందుతాయన్న సందేహం తలెత్తుతోంది. పోనీ పుస్తకాలు లేకుండా కేవలం తరగతులతో ఎలాగోలా కాలక్షేపం చేద్దామంటే విద్యార్థులు తీవ్ర ఎండల్లో ఏ మేరకు పాఠశాలలకు వస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Advertisement