అత్తెసరు చదువులు
ఏటా రూ.10 వేల కోట్లు వెచ్చిస్తున్నా సర్కారు బడుల్లో చదువు అంతంతే..
- ఆశించిన స్థాయిలో పెరగని విద్యా ప్రమాణాలు
- ప్రాథమిక స్కూళ్లలో తెలుగులో చదవగలిగేవారు సగమే
- రాయగలిగినవారు 42 శాతమే
- గణితంలో వెనుకంజ.. భాగహారం చేసేవారు 26 శాతమే
- ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనూ ఇదే తీరు
- ప్రైవేటు స్కూళ్ల పరిస్థితీ ఇంతే
- విద్యాశాఖ క్షేత్ర స్థాయి తనిఖీల్లో వెల్లడైన వాస్తవాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య కోసం ఏటా వెచ్చిస్తున్న బడ్జెట్ దాదాపు రూ. 10 వేల కోట్లు! నిధులు దండిగానే ఉన్నా పిల్లలకు చదువులు మాత్రం రావడం లేదు. ఏళ్లు గడుస్తున్నా విద్యా ప్రమాణాలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. సుశిక్షితులైన టీచర్లు ఉన్నా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించలేకపోతున్నారు. ప్రైవేటు స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తెలుగులో చదవగలిగిన వారు 52 శాతమే ఉన్నారు. ఇక తెలుగులో రాయగలిగిన వారు 42 శాతమే ఉన్నారు. ఇంగ్లిష్‌లో పదాలు చదవగలిగిన వారు 40 శాతం, రాయగలిగిన వారు 30 శాతం ఉన్నారు.
గణితంలో కూడికలు చేయగలిగినవారు 62 శాతం, తీసివేతలు చేయగలిగిన వారు 53 శాతం, గుణకారం చేయగలిగినవారు 38 శాతం, భాగహారం చేయగలిగిన వారు మరీ దారుణంగా 26 శాతమే ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లది దాదాపుగా ఇదే పరిస్థితి. వాటిల్లో తెలుగులో చదవగలిగిన వారు 60 శాతం, రాయగలిగిన వారు 56 శాతం ఉన్నారు. ఇంగ్లిష్ పదాలు చదవగలిగిన వారు 65 శాతం, రాయగలిన వారు 61 శాతం ఉన్నారు. గణితంలో కూడికలు చేయగలిగిన వారు 75 శాతం, తీసివేతలు చేయగలిగిన వారు 69 శాతం, గుణకారం చేయగలిగిన వారు 57 శాతం, భాగహారం చేయగలిగిన వారు 49 శాతం ఉన్నారు.
విద్యాశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయి బృందాలు క్షేత్రస్థాయిలో చేసిన తనిఖీల్లో కఠోరమైన ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. గతనెల 22 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలోని 394 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 116 ప్రాథమికోన్నత పాఠశాలలు, 401 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 109 కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, 57 మోడల్ స్కూళ్లు, 56 గురుకుల పాఠశాలలు, 116 ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు, 119 ప్రైవేటు ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తంగా 1,368 స్కూళ్లలో అధ్యయనం చేశారు. ఆ నివేదికలను హైదరాబాద్‌లో జరుగుతున్న డీఈవోల సదస్సుల్లో కొత్తగా నియమితులైన డీఈవోలకు విద్యాశాఖ అందజేసింది. విద్యాప్రమాణాల పెంపునకు పక్కా కార్యాచరణ రూపొందించుకొని సర్కారు బడిని బాగు చేయాలని సూచించింది. ఇదేకాదు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో చేసిన స్టేట్ లెవెల్ అచీవ్‌మెంట్ సర్వేలోనూ (స్లాష్) ఇలాంటి వాస్తవాలే బయటపడ్డాయి.
క్షేత్రస్థాయిలో వెల్లడైన వాస్తవాలివీ..
► ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తెలుగులో చదవడం, రాయడంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. ఇంగ్లిష్ చదవడం, రాయడంలో రాష్ట్ర సగటు 48 శాతం, 38 శాతం ఉండగా.. ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇంతకన్నా తక్కువగా ఉంది.
► రాష్ట్రంలో సగటున ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కూడికలు చేయగలిగిన వారు 45 శాతం, తీసివేతలు చేయగలిగిన వారు 59 శాతం, గుణకారం చేయగలిగిన వారు 45 శాతం, భాగహారం చేయగలిగినవారు 35 శాతం ఉన్నారు. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇంతకన్నా తక్కువగా ప్రగతి ఉంది. గణితంలో రాష్ట్ర సగటు కంటే రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పిల్లలు బాగా చేయగలుగుతున్నారు.
► ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్లో దాదాపు 50 శాతం మంది కనీస సామర్థ్యాలు లేకుండా 6వ తరగతిలో చేరారు
అమలుకు నోచుకోని ప్రత్యేక కార్యాచరణ
రాష్ట్రంలో చదవలేని, రాయలేని, స్పందించలేని (3ఆర్) విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని విద్యాశాఖ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికలను పాఠశాలలకు పంపించింది. కానీ ఆ ప్రణాళికలేవీ అమలుకు నోచుకోవడం లేదు. కనీసం సగానికి సగం పాఠశాలల్లోనూ ఇవి అందుబాటులో లేవు. ప్రైమరీ స్కూళ్లలో ఉదయం రెగ్యులర్ సబ్జెక్టులు బోధించి, మధ్యాహ్నం 3ఆర్ కార్యక్రమం అమలు చేయాల్సి ఉన్నా.. ఎక్కడా పట్టించుకోవడం లేదు. 90 శాతం ఉన్నత పాఠశాలల్లో కూడా ఇది అమలు కావడం లేదు. హైస్కూళ్లలో ఎనిమిది పీరియడ్లలో ఆరు పీరియడ్లు సబ్జెక్టు బోధించి, రెండు పీరియడ్లు వీటిని బోధించాల్సి ఉంది. 90 శాతం స్కూళ్లలో 3 ఆర్‌లు నేర్పించే బాధ్యత గణితం, తెలుగు, ఇంగ్లిష్ ఉపాధ్యాయు లదేనని భావిస్తున్నారు. దీనిపై ప్రధానోపాధ్యాయులు, ఉప విద్యాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.