రేపటి నుంచే బడులు
♦ ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచే
♦ ఉన్నత పాఠశాలలు 9:30 నుంచి సాయంత్రం 5 వరకు
♦ తెలుగు, సాంఘిక సబ్జెక్టుల్లో మార్పులు
♦ త్రైమాసిక పరీక్షలకు చెల్లు చీటీ
♦ అకడమిక్ కేలండర్ జారీ చేసిన విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం (12వ తేదీ) నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నాయి. ఈసారి నుంచి పలు సంస్కరణలు అమలుకానున్నాయి.
పాఠశాలల పనివేళలతో పాటు పీరియడ్ల సంఖ్య, పరీక్షల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు, 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు సాంఘిక శాస్త్రం సబ్జెక్టులలో మార్పులు చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న త్రైమాసిక పరీక్షలను తొలగించింది. దీంతో అర్ధవార్షిక, వార్షిక పరీక్షలే ఉంటాయి. ఇక మార్చి 20 నాటికి పరీక్షలు, ఫలితాల వెల్లడిని పూర్తిచేసి.. వేసవి సెలవుల ప్రారంభంలోగా అంటే ఏప్రిల్ 23 వరకు పైతరగతికి సంబంధించిన పాఠ్యాంశాల బోధన చేపట్టేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 15 నుంచి నుంచి ఏప్రిల్ 23 వరకు ఉన్న ఒంటిపూట బడుల విధానాన్ని తొలగించింది.
మొత్తంగా పీరియడ్‌ల సంఖ్యతోపాటు ఒక రోజులో ఉండే పీరియడ్లను 9 నుంచి 8కి తగ్గించింది. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను ముందుగానే నిర్వహించి, విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశాకే టీచర్లంతా పదో తరగతి పరీక్షల పనులకు వెళ్లేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పదో తరగతి ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు టీచర్లను తీసుకోవాలని, వాల్యుయేషన్‌కు ప్రభుత్వ టీచర్లను తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలతో విద్యా వార్షిక కేలండర్‌ను పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు విడుదల చేశారు. కేలండర్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం పాఠశాలలు కొనసాగేలా పక్కా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీలను ఆదేశించారు.
పరీక్షలు.. ఫలితాలు..
ఇంటర్నల్స్: ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)-1 జూలై 31న. ఎఫ్‌ఏ-2 ఆగస్టు 31న, ఎఫ్‌ఏ-3 నవంబర్ 30న. ఎఫ్‌ఏ-4 ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఫిబ్రవరి 28న, పదో తరగతి వారికి జనవరి 31న నిర్వహించాలి.
రాతపరీక్షలు: అర్ధవార్షిక పరీక్షలు.. (ఎస్‌ఏ-1) దసరా సెలవులకు ముందు అక్టోబర్ 3 నుంచి 9 వరకు; వార్షిక పరీక్షలు.. ఒకటి నుంచి 9వ తరగతి వరకు మార్చి 7నుంచి 14 వరకు. పదో తరగతి పరీక్షల తేదీలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
* ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, లెక్కలు వచ్చేలా ప్రధానోపాధ్యాలంతా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అక్టోబర్ 30 వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.
* ఒకటి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల ఫలితాలను మార్చి 20న ప్రకటించాలి. తల్లిదండ్రులతో చర్చించాలి. అదేరోజున ఫలితాలపై సమీక్షించాలి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 23 వరకు పైతరగతుల (వచ్చే విద్యా సంవత్సరపు) బోధన చేపట్టాలి.
* ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు. వచ్చే ఏడాది జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభం.
కేలండర్‌లోని ప్రధాన అంశాలు
* ప్రాథమిక పాఠశాలలను 7 గంటల పాటు కొనసాగించాలి (ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు).
* ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఏడున్నర గంటల పాటు నడవాలి. ప్రాథమికోన్నత స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం పాత వేళలు కొనసాగుతాయి.
* సబ్జెక్టుల వారీగా మొత్తం పీరియడ్ల సంఖ్య 54 నుంచి 48కి తగ్గింది. లైబ్రరీ పీరియడ్‌లు రెండింటిని తొలగించారు. ఫిజికల్ సైన్స్ పీరియడ్‌లను 4 నుంచి 5కు పెంచారు. వర్క్, కంప్యూటర్ విద్య, విలువల విద్య, ఆర్ట్ ఎడ్యుకేషన్‌లకు మొత్తంగా 9 పీరియడ్లు ఉంటే వాటిని ఐదుకు తగ్గించారు. సాంఘిక అంశాలపై పీరియడ్‌ను తొలగించారు.
ప్రభుత్వం ప్రకటించన సెలవుల వివరాలు
⇒ అక్టోబర్ 10 నుంచి 25 వరకు దసరా సెలవులు
⇒ 2016 జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
⇒ మైనారిటీ స్కూళ్లకు డిసెంబర్ 24 నుంచి 30 వరకు క్రిస్‌మస్ సెలవులు