మెడికల్ కాలేజీలో సీటు కోసం విపరీతమైన డిమాండ్... లక్షలు వెచ్చించేందుకైనా వెనుకాడని పరిస్థితి. దీంతో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి కమర్షియల్‌గా మారుతోందనే సర్వత్రా విమర్శలు. మరో వైపు ఆధునిక అవసరాలకు తగ్గట్లు సిలబస్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న ఎంసీఐ 2016-17 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌లో కొత్త కరిక్యులంను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అకడమిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ వేద్ ప్రకాశ్ మిశ్రాతో గెస్ట్‌కాలం...
ప్రపంచంలో ఎక్కువ మంది వైద్య నిపుణులను అందిస్తున్న దేశంగా మనకు గుర్తింపు ఉంది. దేశ వ్యాప్తంగా 400 వైద్య కళాశాలల్లో 56 వేల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కానీ వైద్య విద్యా విధానంలో నాణ్యత ప్రమాణాలు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎంబీబీఎస్ కొత్త కరిక్యులం నాణ్యతా ప్రమాణాలను పెంచే విధంగా ఉంటుంది. టీచింగ్ లెర్నింగ్ విధానాల్లో మార్పులు ఉంటాయి. వైద్య వృత్తి ప్రధాన ఉద్దేశమైన సమాజ సేవ భావనను పెంపొందించేలా సిలబస్ ఉంటుంది.
సిలబస్‌లోని అంశాలు
అభ్యసనం, నాణ్యత, సామాజిక కోణాలు.. కొత్త సిలబస్‌లో ప్రధానాంశాలుగా ఉంటాయి. వాస్తవ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీని రూపకల్పన జరిగింది. అవసరాలకు తగ్గట్లు కరిక్యులంను నిరంతరం సమీక్షిస్తుంటేనే నాణ్యత సాధ్యమౌతుంది. కొత్త కరిక్యులం నమూనాకు ఎంసీఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎంసీఐ జనరల్ బాడీలు ఆమోదం తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే అమల్లోకి వస్తుంది.
కనీస ప్రమాణాలు తప్పనిసరి
కొత్త మెడికల్ కాలేజీల స్థాపనకు ఎంసీఐ నిబంధనలు సరళం చేయాలనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంసీఐ యాక్ట్ - 1956లో 33వ సెక్షన్‌లో కొన్ని కనీస ప్రమాణాలను సూచించింది. ఈ సదుపాయాలు ఉంటేనే ఇటు విద్యార్థులు, అటు రోగుల కోసం టీచింగ్ హాస్పిటల్స్ ఏర్పాటు ఉద్దేశం నెరవేరుతుంది. అలా లేకుంటే ప్రజలను రోగాల నుంచి కాపాడాల్సిన వైద్య వృత్తి నాణ్యత విషయంలో రాజీ పడినట్లవుతుంది.
‘నకిలీ’ వాస్తవమే
మౌలిక సదుపాయాలు, బోధన పరంగా ఎన్నో నిబంధనలు విధించాం. అయినా ఎంసీఐ పర్యవేక్షణ కమిటీల తనిఖీ సమయంలో నకిలీ ఫ్యాకల్టీ, మెటీరియల్, సదుపాయాలు వంటివి వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలపై చర్యలు తీసుకునేందుకు ఎంసీఐ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఏదైనా మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీ లోపాలును గుర్తించినప్పుడు సదరు కమిటీ ఎంసీఐ ఎథిక్స్ కమిటీకి నివేదిక అందిస్తుంది. దీని ఆధారంగా ఎంసీఐ సంబంధిత మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది.
శాస్త్రీయంగా ఫీజుల పెంపు
ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఫీజుల పెంపు అధికారం రాష్ట్రాలకు కల్పించారు. ఆయా రాష్ట్రాల మధ్య ఎంబీబీఎస్ ఫీజుల వ్యత్యాసాలకు కారణం ఇదే. మెడికల్ సీటు ఫీజుల పెంపు శాస్త్రీయంగా ఉండాలి. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో ఫీజు రెగ్యులేటరీ కమిటీని నియమించాలి. పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జి అధ్యక్షులుగా, విద్యావేత్త, ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉండాలి. ఆయా ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు అందించే ప్రతిపాదనలు, వాస్తవాలను పరిశీలించిన తర్వాత కమిటీ ఫీజులపై సిఫార్సులు చేస్తుంది. ఆ రాష్ట్రాలు ఫీజులును నిర్ణయించాలి.
ఇంటర్న్‌షిప్ వ్యతిరేకత ఇందుకే
మెడికల్ గ్రాడ్యుయేట్లకు తప్పనిసరి చేసిన రూరల్ ఇంటర్న్‌షిప్‌పై విద్యార్థుల్లో వ్యతిరేకత ఉంది. రూరల్ హెల్త్ సెంటర్స్‌లో మౌలిక సదుపాయాల లేమి ఇందుకు ప్రధాన కారణం. ఇంటర్న్‌షిప్ వల్ల విద్యార్థుల్లో ప్రాక్టికల్ పరిజ్ఞానం పెరగడంతో పాటు ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇంటర్న్‌షిప్ ఫలితాలు మెరుగ్గా ఉండాలంటే.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అప్పుడే విద్యార్థుల్లో ఇంటర్న్‌షిప్ పట్ల ఉన్న వ్యతిరేకత తొలగిపోతుంది.
సేవాభావం పెంచుకోవాలి
వైద్య విద్య, వృత్తులను పవిత్రమైనవిగా భావించాలి. తమ వల్ల సమాజానికి మేలు జరగాలి అనే సేవా భావం పెంచుకోవాలి. అప్పుడే ఈ కోర్సు ఉద్దేశం నెరవేరుతుంది. ఒకసారి కోర్సులో చేరిన తర్వాత మెడికల్ విద్యా విభాగంలో వస్తున్న మార్పులపై అప్‌డేట్ అవుతూ ముందుకు సాగాలి.
కరిక్యులంలో ‘సామాజిక సేవ’కే పెద్దపీట!
Published Thu, Jul 23 2015 1:55 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
Advertisement
Advertisement