జూన్ 12 నుంచే పాఠశాలల పున ః ప్రారంభం
ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వని విద్యాశాఖ
హైదరాబాద్: రాష్ట్రంలోని 178 మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలపై సందిగ్ధత నెలకొంది. 2015-16 విద్యా సంవత్సరంలో ప్రవేశాలను కల్పిస్తారా, లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మోడల్ పాఠశాలలు ఇంగ్లిషు మీడియంలో నిర్వహించనున్న నేపథ్యంలో.. వాటిల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఏప్రిల్ నుంచే ఎదురుచూస్తున్నారు. సాధారణంగా జూన్ 12వ తేదీ నుంచే పాఠశాలలు ప్రారంభమవుతాయి. కానీ మే చివరి వారం వచ్చినా మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేయలేదు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర స్కూళ్లలో చేర్పించాలా, లేక వేచి చూడాలా అన్న గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న పిల్లలకోసం జూన్‌లో ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీజులు చెల్లించకపోతే వాటిల్లో సీట్లను కోల్పోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు.
ప్రభుత్వం వద్దే ఫైలు..
177 మోడల్ స్కూళ్లలోని ఆరో తరగతిలో మొత్తంగా 14,160 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రవేశాలను లాటరీ ద్వారా కాకుండా ప్రవేశ పరీక్ష ద్వారా చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. గురుకులాలు, నవోదయ పాఠశాలల తరహాలోనే వీటికి పరీక్ష నిర్వహించాలని భావించిన అధికారులు.. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ ఆ ఫైలు ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉండిపోయింది. అయితే త్వరలోనే ఈ ఫైలుకు ఆమోదం లభిస్తుందని, రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పటికిప్పుడు ఇచ్చినా..!
మోడల్ స్కూళ్లలో పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టేలా ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ జారీ చేసినా విద్యా సంవత్సరం ఆలస్యం కాకతప్పదు. నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష, ఫలితాల వెల్లడి అనంతరం ప్రవేశాలు పూర్తి చేయాలి. ఇందుకు దాదాపు 45 రోజులు పడుతుంది. మరోవైపు ఎలాగైనా ఆలస్యమయ్యే అవకాశమున్నందున.. వీలైనంత ముందుగా ప్రక్రియ పూర్తిచేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి.
‘మోడల్’ నోటిఫికేషన్ ఎప్పుడు?
Published Tue, May 19 2015 2:40 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM
Advertisement
Advertisement