బంగారు బడులే..
నాణ్యమైన విద్యే ధ్యేయం
♦ సర్కారు పాఠశాలల్లో మెరుగైన వసతులు
♦ గత పాలకుల వల్లే వ్యవస్థ చిన్నాభిన్నం
♦ జిల్లాకు 30 గురుకుల పాఠశాలలు మంజూరు
♦ విద్యా సమీక్ష సమావేశంలో మంత్రి కడియం
♦ ‘భోజనం’లో తేడా రావొద్దు: మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే కాక, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియెట్, సాంకేతిక విద్య, ప్రాథమిక జిల్లా పరిషత్ విద్య పై విద్యాశాఖ, ప్రజా ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గానికి రూ. 5 కోట్లు ఎమ్మెల్యే నిధుల ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే మరో రూ. 5 కోట్లు ఇతర పద్దుల కింద మంజూరుచేసి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నిధులు సమకూరుస్తామన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు రాలేకపోతున్నారని, ఇందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలే ప్రధాన కారణమని మంత్రి గుర్తు చేశారు. విద్యారంగానికి గత ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో పాఠశాలల్లో సమస్యలు నెలకొన్నాయన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన మాదిరిగా నియోజకవర్గ స్థాయిలో సమీక్ష సమావేశాలను నిర్వహించినట్లయితే విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు కొంతమేరకైనా పరిష్కారమవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను పటిష్టపరిస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తారని అన్నారు.
ప్రైవేటు పాఠశాలల కంటే నాణ్యమైన విద్యతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, విశాలమైన క్రీడా మైదానాలు, తరగతి గదులు ఉన్నా విద్యార్థులు పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపకపోవడం వెనక గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందన్నారు. జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నిధులు వెచ్చించాల్సి ఉందని, వాటికి తోడుగా ప్రభుత్వం తరఫున కూడా 50 శాతం నిధులు మంజూరు చేస్తుందన్నారు. జిల్లాకు 11 మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఎస్సీలకు 8, ఎస్టీలకు 8, మూడు డిగ్రీ కళాశాలలతో పాటు ఎస్సీ బాలికల కోసం ప్రత్యేకంగా గురుకుల కళాశాలలను మంజూరు చేశామన్నారు. జిల్లాకు మంజూరైన 30 గురుకుల పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని సీఎం ఆదేశించారన్నారు.
నాణ్యమైన ‘భోజనం’ అందిస్తాం
సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో లోపాలను సవరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకు గాను వారంలో మూడు రోజులు మండల విద్యాశాఖ అధికారులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడమేకాక, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించారు. దీని ద్వారా నాణ్యమైన భోజనం అందుతుందో లేదో తెలుసుకోవచ్చన్నారు. పాఠశాలలకు పాత సన్న బియ్యాన్నే సరఫరా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎక్కడైనా లోపాలు జరిగితే ఎంఈఓలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
అలాగే నాసిరకపు బియ్యాన్ని సరఫరా చేసే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని జేసీ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు. ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా అదనపు తరగతి గదులు, ప్రహరీలు, ఇతర భవనాల నిర్మాణాలు నత్తనడకన నడుస్తున్నాయని, అధికారులకు ఇచ్చే నివేదికల్లో ఆ శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ ఆ శాఖ ఏఈ అనిల్ కుమార్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు రావడం లేదని, వాటిని పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మంత్రి హరీష్‌రావు డీఈఓ నజీమోద్దీన్‌ను ఆదేశించారు. విద్యా వలంటీర్ల నియామకంలో జాప్యం జరగకుండా ఈ నెల 30 లోగా నియామకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూనియర్ కళాశాలల పరిస్థితిపై ఆర్‌ఐఓ కిషన్ ఇచ్చిన వివరణపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు.