
ఇక పీటర్సన్ అకాడమీలు!
అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత ఐపీఎల్‌పై దృష్టిపెట్టిన ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ ఇప్పుడు మరో కొత్త ఇన్నింగ్స్‌కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.
మొదట దుబాయ్‌లో... తర్వాత భారత్‌లో
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత ఐపీఎల్‌పై దృష్టిపెట్టిన ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ ఇప్పుడు మరో కొత్త ఇన్నింగ్స్‌కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఆడినన్ని రోజులు ప్రీలాన్స్ క్రికెటర్‌గా ఉంటూనే... అకాడమీలు కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాడు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో దుబాయ్‌లో సకల సౌకర్యాలతో కూడిన క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయనున్నాడు. తర్వాత భారత్‌లో రెండో అకాడమీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ‘వేదిక ఇంకా ఖరారు కానప్పటికీ దుబాయ్ అకాడమీ మాత్రం అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది.
7-18 ఏళ్ల వయసుగల కుర్రాళ్లు ఇందులో చేరొచ్చు. ఇక్కడ భిన్నమైన కోర్సులు అందుబాటులో ఉంటాయి. రెండు వారాల కోచింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా రావొచ్చు. వెనుకబడిన కుర్రాళ్లకు చేయూతనిచ్చేందుకు ఓ నిధిని కూడా సమకూరుస్తున్నా. అకాడమీ ప్రాజెక్ట్ కొత్త ఉత్సాహన్ని ఇస్తోంది. కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని మొదలుపెడతా’ అని అంబేద్కర్ స్టేడియంలో ‘ఫిఫా’ ప్రపంచకప్‌కు వెళ్లే ఇద్దరు పిల్లలను ఎంపిక చేసే కార్యక్రమంలో పాల్గొన్న కేపీ వెల్లడించాడు. ఫిఫా టోర్నీకి వెళ్లనున్న మొత్తం ఆరుగురు పిల్లల్లో మరో నలుగురిని ఇతర నగరాల నుంచి ఎంపిక చేస్తారు.
ఇంగ్లండ్‌లో కోహ్లి, పుజారా కీలకం
జూలైలో జరగబోయే ఇంగ్లండ్ పర్యటనలో భారత్ విజయవంతం కావాలంటే విరాట్ కోహ్లి, చతేశ్వర్ పుజారా చాలా కీలకమని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టమైందని కితాబిచ్చాడు. ‘ఇంగ్లండ్ జట్టు పునర్నిర్మాణ దశలో ఉంటే... ధోనిసేనలో అద్భుతమైన నైపుణ్యం ఉంది. కాబట్టి సిరీస్ రసవత్తరంగా సాగుతుంది. కోహ్లి, పుజారా, విజయ్‌ల టెక్నిక్ అమోఘం. ఇంగ్లండ్‌లో ఇది చాలా కీలకం’ అని పీటర్సన్ వివరించాడు. స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ రిటైర్ కావడం ఇంగ్లండ్‌కు లోటేనన్నాడు. అన్ని జట్లకు 2015 వన్డే ప్రపంచకప్‌ను గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. ఐపీఎల్-7లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ... ‘మా బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. కాకపోతే సమష్టిగా రాణించలేకపోతున్నాం. బౌలింగ్‌లో కాస్త మెరుగుపడాలి. కీలక మ్యాచ్‌ల్లో గెలిస్తే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’ అని పీటర్సన్ అన్నాడు.