ముందే మేల్కొన్నారు..
• జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు
• అవసరమైన పాఠ్యపుస్తకాలు 2,92,491
• నేటి వరకు చేరుకున్నవి 1,35,719
• రావాల్సినవి 1,56,772
కరీంనగర్‌ఎడ్యుకేషన్ : విద్యాశాఖ ముందే మేల్కొంది. ఏటా విద్యాసంవత్సరం ఆరంభమై నెలలు గడిచిన పుస్తకాలు స్కూళ్లకు చేరకపోవడం వంటివి చూశాం. అయితే ఈసారి ఇప్పటికే యాబై శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. విద్యాసంవత్సరం ఆరంభమయ్యే మార్చి 21 వరకు విద్యార్థులకు పుస్తకాలు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సర్వశిక్షా అభియాన్, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా కసరత్తు ప్రారంభించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇప్పటికే సగం వరకు పుస్తకాలు చేరుకున్నాయి.
మార్చి 21 నుంచి విద్యాసంవత్సరం
2017–18 సంవత్సరాన్ని మార్చి 21 నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్‌ను విడుదల చేసింది. గత విద్యాసంవత్సరంలో ముందస్తుగానే మొదలుపెట్టాలని ఆలోచించినప్పటికీ సాధ్యంకాలేదు. ఈసారి ఎలాంటి ఆటంకాలు రానీయకుండా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. గతంలో పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం పునర్‌ప్రారంభమై నెలల గడిచినా పుస్తకాలు చేరకపోయేవి. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేవారు. మార్కెట్‌లో డబ్బు పెట్టి పుస్తకాలు కొనుగోలు చేసేవారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రారంభం రోజునే అంటే మార్చి 21నే పుస్తకాలు, దుస్తులు అందించేందుకు అధికారులు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించారు.
చేరిన పుస్తకాలు
జిల్లాలోని 16 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ పాఠశాల, కస్తూర్బా పాఠశాలల్లో 27,256 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లిష్ మీడియంకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు 2,92,491 అవసరమని జిల్లా విద్యాశాఖాధికారులు రాష్ట్ర అధికారులకు ఇండెంట్ పంపించారు. ఈ నివేదిక ప్రకారం జిల్లాకు గురువారం నాటికి 1,35,719 పాఠ్య పుస్తకాలు చేరాయి. మిగతా 1,55,772 పాఠ్యపుస్తకాలు పది రోజుల్లోగా చేరుకోనున్నాయి. మార్చి మొదటి వారం నుంచి కరీంనగర్ కేంద్రంలోని గోదాం నుంచి పాఠ్యపుస్తకాలను ఆయా మండలాల ఎమ్మార్సీ కేంద్రాలకు అక్కడి నుంచి సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలకు మార్చి 20లోగా పంపిణీ చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లను చేపట్టారు.
ప్రారంభం రోజునే పుస్తకాలు
పాఠశాల ప్రారంభమయ్యే మార్చి 21న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేస్తాం. జిల్లాకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు మార్చి 10లోగా పూర్తిస్థాయిలో చేరుతాయి. మరో పది రోజుల్లో పంపిణీ పూర్తవుతుంది. పాఠ్యపుస్తకాలు సకాలంలో అందడంతోవిద్యార్థులు వేసవి సెలవుల్లోనూ చదువుకునే అవకాశం ఉంది. – పి.రాజీవ్, డీఈవో