38 లక్షల కిట్లు సిద్ధంచేసిన పాఠశాల విద్యాశాఖ
మండల కేంద్రాలకు బ్యాగులు, పుస్తకాలు, యూనిఫారాలు చేరవేత
3.12 కోట్ల మొదటి సెమిస్టర్ పుస్తకాలు సైతం పంపిణీకి సిద్ధం
ఈ నెల 12న పాఠశాల తెరిచిన మొదటిరోజే పంపిణీకి ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ఏటా అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫారం, బూట్లతో కూడిన కిట్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంచేసింది. ఈ నెల 12న పాఠశాలలు తెరిచిన మొదటిరోజే వాటిని అందించేందుకు సామగ్రిని మండల స్టాక్ పాయింట్లకు చేరవేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌లో బోధించే 3.12కోట్ల పాఠ్యపుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు ఇప్పటికే చేరవేశారు. యూనిఫారం సరఫరా శనివారం నుంచి మొదలైంది.
వస్తువులను ఒక్కొక్కటిగా స్టాక్ పాయింట్లకు చేర్చిన అనంతరం అక్కడ తరగతుల వారీగా కిట్లను రెడీ చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయగా మిగిలిన 2 లక్షల కిట్లకు అదనంగా ఈ విద్యా సంవత్సరానికి 36లక్షల కిట్లను అధికారులు సిద్ధంచేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా వస్తువులను అందించేలా సరఫరాదారులకు ఆదేశాలు జారీచేశారు.
అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్ వర్క్‌బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతోపాటు మూడు జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు.. అదేవిధంగా 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 తరగతుల విద్యార్థులకు నోట్‌బుక్స్, అందించనున్నారు. ఇప్పటివరకు విద్యాకానుక కిట్‌లో అందించే తొమ్మిది వస్తువుల్లో బూట్లు మినహా మిగిలిన బ్యాగులు, బెల్టులు, సాక్సులు, పాఠ్య, నోటుపుస్తకాలు, వర్క్‌బుక్స్, డిక్షనరీ వంటి 8 రకాల వస్తువులు 90 శాతం మండల కేంద్రాలకు చేరాయి. ఒకట్రెండు రోజుల్లో బూట్ల సరఫరా చేపట్టనున్నారు.
పాఠశాలలకు 3.12 కోట్ల పాఠ్య పుస్తకాలు..
ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను స్టాక్ పాయింట్లకు పంపించారు. 3–10 తరగతుల వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. ఈనెల 8వ తేదీ నాటికే అన్ని స్కూళ్లలోను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కిట్లను సిద్ధంచేయాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్లుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది.
రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్‌ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్ సిలబస్ పుస్తకాలను అందించనున్నారు. పదో తరగతి సాంఘిక శాస్త్రాన్ని సీబీఎస్‌ఈ తరహాలో జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ రూపంలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను పూర్తి ఆర్ట్ పేపర్‌పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదేతొలిసారి కావడం విశేషం.
ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్స్‌గా ఇంజినీరింగ్ విద్యార్థులు
ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. వీరి బోధనకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్స్‌గానూ నియమించింది. ఫ్యూచర్ స్కిల్స్ సిలబస్‌ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలు ముద్రించి పంపిణీకి సిద్ధంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment