ఇంటర్ సిలబస్‌లో మార్పులు
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు బోర్డు సన్నాహాలు
♦ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంగ్లిష్‌లో మార్పుచేర్పులు
♦ ద్వితీయ సంవత్సర తెలుగు, మోడర్న్ లాంగ్వేజీలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్, ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్, తెలుగు, మోడర్న్ లాంగ్వేజ్ సబ్జెక్టుల సిలబస్‌ను మారుస్తోంది. ఈ విద్యా సంవత్సరం (వచ్చే జూన్) నుంచే ఈ మార్పులను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ మార్పుల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబోతోంది.
తెలంగాణ కవులకు పెద్దపీట
తెలుగులో తెలంగాణ కవులు, సాహితీవేత్తలు, రచయితల రచనలకు ప్రత్యేక స్థానం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం సగం వరకు ఉన్న ఆంధ్ర కవులు, రచయితల పాఠాలను తొలగించి తెలంగాణ కవులు, రచయితల రచనలు వెలుగులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మాండలికాల ప్రత్యేకతలను వీటిల్లో వివరించనుంది. తెలంగాణలోని పద్య కవులు, గద్య కవులు, జానపద కవులు, రచయితలకు సంబంధించి ప్రత్యేక పాఠాలను పొందుపరచనుంది. తెలంగాణ ఉద్యమం, దళిత సాహిత్యం తీరుతె న్నులకు సంబంధించిన పాఠాలు పొందుపరిచేందుకు చర్యలు చేపట్టింది. 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు చేసిన మార్పుల్లో కవర్ కాని తెలంగాణ కవులు, రచయితల రచనలకు స్థానం కల్పించనుంది.
అయితే తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి ఆద్యులైన ప్రాచీన కవులైన నన్నయ వంటి వారి రచనలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. రాష్ట్ర చిహ్నాలు పొందుపరుచనుంది. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారికి సంబంధించిన పాఠ్యాంశాలను పొందుపరుచనుంది. సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారులపై పాఠ్యాంశాలను రూపొందించే ఏర్పాట్లు చేస్తోంది. ఇంగ్లిష్‌లో యాక్టివిటీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం లేదా తెలంగాణకు సంబంధించిన అంశాలపై పేరాలు ఇచ్చి, వాటిల్లోని అంశాలపై ప్రశ్నలకు జవాబులు రాబట్టే విధానాన్ని పెట్టేందుకు చర్యలు చేపట్టింది.
జూన్ 1 నాటికి ఇచ్చేలా చర్యలు..
సిలబస్ మార్పు చేసిన పుస్తకాలతోపాటు ఇతర అన్ని పుస్తకాలను జూన్ 1 కల్లా ప్రభుత్వ కాలేజీలు, మార్కెట్లో అందుబాటులో ఉంచేలా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 1న కాలేజీలు ప్రారంభం కాగానే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు పుస్తకాలను ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. అలాగే ప్రథమ సవంత్సర విద్యార్థులకు ప్రభుత్వ కాలేజీల్లో చేరిన రెండోరోజే ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సిలబస్‌లో మార్పులు తెస్తున్న పుస్తకాలల్లో పాఠ్యాంశాల రచనతోపాటు, అన్ని పుస్తకాల ముద్రణపైనా తెలుగు అకాడమీతో ఇంటర్ బోర్డు చర్చలు జరుపుతోంది.
గతేడాదే చే యాల్సి ఉన్నా..
ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ సిలబస్‌లో గత ఏడాదే మార్పులు చేయాలని భావించింది. కానీ, ఆలస్యం కావడంతో అప్పట్లో మార్పులు చేయలేదు. ప్రస్తుతం ప్రథమ సంవత్సర ఇంగ్లిష్‌తోపాటు ద్వితీయ సంవత్సర ఇంగ్లిష్‌లో మార్పులు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ మార్పులను ఖరారు చేయనుంది. ఇంగ్లిష్ విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవి యథాతథంగా అమలు చేస్తే సాంకేతికపరమైన సమస్యలు వస్తాయని, అందుకే మార్పులు చేయాల్సిందేనని బోర్డు నిర్ణయించింది. ప్రథమ సంవత్సర తెలుగు సిలబస్‌ను గత ఏడాదే మార్పు చేసిన ఇంటర్ బోర్డు ఈసారి ద్వితీయ సంవత్సర తెలుగు సిలబస్‌తోపాటు మోడర్న్ లాంగ్వేజ్ సిలబస్‌లో మార్పులు చేస్తోంది.