Inter syllabus
-
ఇంటర్ సిలబస్ 70 శాతానికి కుదింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిలబస్‌ను 30 శాతం తగ్గిస్తూ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం వెలువరించింది. కరోనా నేపథ్యంలో ఫస్టియర్ సిలబస్‌ను గతేడాది 70 శాతం అమలు చేశారు. దీనికి కొనసాగింపు పాఠ్యాంశాలు రెండో సంవత్సరంలో ఇంతకాలం బోధించడం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరో వైపు ఈ ఏడాది కూడా ప్రత్యక్ష బోధన ఆలస్యంగా మొదలైంది. ఆన్లైన్ క్లాసులు జరిగినా కొంతమంది విద్యార్థులు దీన్ని అందుకోలేకపోయారు. మారుమూల గ్రామాల్లో సరైన ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం, మొబైల్ సిగ్నల్స్ అందకపోవడం వల్ల బోధన అరకొరగా జరిగిందని విద్యార్థులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కూడా ఇదే తరహాలో సిలబస్ తగ్గింపుపై ప్రతిపాదనలు పంపింది. దీనిపై ఇంటర్ బోర్డ్ సానుకూలంగా స్పందించి, ప్రభుత్వానికి తగ్గింపుపై నివేదిక పంపింది. ఇటీవల ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో 30 శాతం సిలబస్ తగ్గింపు నిర్ణయాన్ని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. తగ్గించిన సిలబస్, నమూనా ప్రశ్నపత్రాలను విద్యార్థుల కోసం బోర్డ్ వెబ్సైట్లో అందుబాటుల ఉంచినట్టు బోర్డ్ తెలిపింది. -
తూచ్..అది ప్రతిపాదనే!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ సిలబస్ తగ్గింపుపై ఇంటర్ బోర్డు వెనక్కి తగ్గింది. సిలబస్ కుదింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన మాట వాస్తవమేనని, అయితే దానిపై కాంపిటెంట్ అథారిటీ నిర్ణయం ఇంకా తీసుకోలేదని బుధవారం బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ పని దినాలు నష్టపోయినందున వాటిని సర్దుబాటు చేసేందుకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 30 శాతం సిలబస్‌ను కుదిస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించిన ఇంటర్ బోర్డు.. తెల్లవారే అది ప్రతిపాదన మాత్రమేనని చెప్పడం కొంత గందరగోళానికి దారితీసింది. బోర్డు అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపమే దీనికి కారణమని తెలుస్తోంది. బోర్డు కార్యదర్శి ఆమోదం లేకుండానే పరీక్షల నియంత్రణాధికారి (సీవోఈ) సంతకంతో సిలబస్ కుదింపు ప్రకటనతోపాటు, సబ్జెక్టుల వారీగా సిలబస్ విడుదల అయింది. బుధవారం మాత్రం కాంపిటెంట్ అథారిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదనిబోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. ప్రముఖుల పాఠాలు తొలగించం... నిబంధనల ప్రకారం.. ఇంటర్ బోర్డులో కాంపిటెంట్ అథారిటీ అంటే బోర్డు కార్యదర్శే. లేదంటే ప్రభుత్వం. అంటే బోర్డులో కీలకమైన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కార్యదర్శి ఆమోదం లేకుండానే సిలబస్‌ను విడుదల చేశారా.. అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. కరోనా కారణంగా నష్టపోయిన పని దినాలను సర్దుబాటు చేసేందుకు సీబీఎస్ఈ కుదించిన 30 శాతం సిలబస్‌కు అనుగుణంగా.. రాష్ట్రంలోనూ సిలబస్ తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. దీనిపై వెంటనే సిలబస్ కమిటీలను ఏర్పాటు చేశామని.. వారు కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 30 శాతం సిలబస్ కుదింపునకు సిఫారసు చేశారన్నారు. అదీ ఈ ఒక్క సంవత్సరం కోసమేనని పేర్కొన్నారు. అయితే.. దీనిపై కాంపిటెంట్ అథారిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రతిపాదన దశలోనే ఉందని, త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. అలాగే హ్యుమానిటీస్ సిలబస్‌లో జాతి నేతలు, సంఘ సంస్కర్తలు, ప్రముఖుల పాఠాలను తొలగించే ప్రశ్నే లేదని చెప్పారు. -
ఇంటర్లో 30% సిలబస్ కోత
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నష్ట పోయిన పనిదినాలకు అనుగుణంగా సిల బస్‌ను సర్దుబాటు చేయను న్నారు. తద్వారా విద్యార్థులు, అధ్యాప కులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాలని ఇంటర్మీడియట్ బోర్డు పంపించిన ప్రతిపాద నకు ప్రభుత్వం ఓకే చెప్పింది. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో సీబీఎస్ఈ కోత విధించిన సిల బస్‌కు అనుగుణంగా రాష్ట్రంలోనూ ఇంటర్మీడి యట్లో కోత విధించనున్నారు. జేఈఈ మెయిన్, నీట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్త కుండా సీబీఎస్ఈ తొలగించిన పాఠాలనే రాష్ట్ర సిలబస్‌లోనూ తొలగించనున్నారు. అలాగే హ్యుమానిటీస్ కోర్సుల్లో ప్రాధాన్యం తక్కువగా ఉన్న పాఠాలను తొలగించేలా చర్యలు చేపట్టారు. పనిదినాలు గతేడాది 222 ఉంటే ఈసారి 182కు పరిమితమయ్యాయి. 40 రోజులు తగ్గిపోయాయి. అందుకు అనుగుణంగా సిలబస్‌ను తగ్గించనున్నారు. తొలగించాల్సిన పాఠ్యాంశాలపై ఇప్పటికే బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే నియమించిన సబ్జెక్టు కమిటీలు కోత పెట్టాల్సిన సిలబస్‌ను ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఖరారు చేయనున్నాయి. ఆ వెంటనే తొలగించే పాఠ్యాంశాల వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించనుంది. మరోవైపు గత మార్చిలో జరిగిన వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించి వివిధ కారణాలతో పరీక్షలు రాయని 27 వేల మంది విద్యార్థులను కూడా పాస్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కూడా త్వరలోనే బోర్డు ఉత్తర్వులను జారీ చేయనుంది. ఆన్లైన్లో ఇంటర్ ప్రవేశాలు.. రాష్ట్రంలో ఇప్పటికే అనుబంధ గుర్తింపు పొందిన ప్రభుత్వ కాలేజీలు, సంక్షేమ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్ కాలేజీలు, కేజీబీవీలు, ఫైర్ ఎన్వోసీ ఉన్న 77 ప్రైవేటు కాలేజీలు మొత్తంగా 1,136 కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. మరోవైపు 1,496 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపు జారీ చేయలేదు. అయితే అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ కొనసాగుతోందని ఇంటర్ బోర్డు పేర్కొంది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా (www.tsbie. cgg.gov.in)అందుబాటులో ఉన్న ఈ కాలేజీల్లో చేరవచ్చని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఇతర కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని పేర్కొన్నారు. జీవన నైపుణ్యాలు, సమతుల్య జీవన శైలిపై శిక్షణ.. విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, సమతుల్య జీవన శైలిపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు జలీల్ తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి 10:30 గంటల వరకు దూరదర్శన్ యాదగిరి చానల్లో 16 వారాల పాటు కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. -
ఇంటర్ సిలబస్ 30 శాతం కుదింపు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నేపథ్యంలో విద్యాసంవత్సరంలో కాలేజీల్లో బోధన సాగించే పరిస్థితి లేకపోవడం, తరగతుల నిర్వహణ ఆలస్యం కానుండడంతో ఇంటర్మీడియెట్ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర కుదించింది. ఈ మేరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి కుదించిన సిలబస్ సమాచారాన్ని బోర్డు వెబ్సైట్లో పొందుపరిచింది. సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు సంబంధించి బోధనాంశాలు ఏవి? కుదింపు అంశాలు ఏవో వివరిస్తూ పాఠ్యాంశాల వారీగా వివరాలను అధికారిక వెబ్సైట్లో పెట్టింది. లాంగ్వేజ్‌లకు సంబంధించి కూడా ఒకటి రెండు రోజుల్లో వివరాలు అప్లోడ్ చేయనున్నారు. కోవిడ్–19 కారణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి సిలబస్‌ను 30 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే బాటలో ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు సిలబస్ కుదింపు చర్యలు చేపట్టింది. ఇలా ఉండగా, ఇంటర్మీడియెట్ 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఆయా అభ్యర్థుల తాజా మార్కులతో కూడిన షార్ట్ మార్కుల మెమోలను కూడా బోర్డు వెబ్సైట్లో ఉంచింది. అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. -
మొక్కు'బడి విలువలు'
రాయవరం (మండపేట): నేటి ఆధునిక సమాజంలో నైతికత–మానవ విలువలు, పర్యావరణ విద్య ప్రాధాన్యత అంశాలుగా గుర్తించి ఇంటర్ విద్యలో పాఠ్యాంశంగా చేర్చారు. ఏటా ఈ అంశాలపై నిర్వహిస్తున్న పరీక్షల తీరు మొక్కుబడిగా మారిపోతోందనే విమర్శలున్నాయి. చాలా కళాశాలల్లో ఈ అంశాలపై బోధన మాటే ఉండడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండానే పరీక్షలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది విద్యాశాఖ పలు సంస్కరణలకు చర్యలు తీసుకుంటున్నా.. అవి ఎంత వరకు సఫలం అవుతాయన్నది ప్రశ్నార్థ్ధకమే. నైతిక విలువల సుగంధాలను అద్దేందుకే.. పెరిగి పోతున్న పాశ్చాత్య పెడ ధోరణుల్లో విద్యార్థి లోకానికి నైతిక విలువల సుగంధాన్ని అందించేందుకు రాష్ట్ర మానవ వనరుల శాఖ 2015 నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ‘నైతికత–మానవ విలువలు’, పర్యావరణం అనే పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారు. ఈ నెల 27న నైతిక, మానవ విలువలు, 29న పర్యావరణ విద్యపై పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష పాసై తీరాలి... ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశ పెట్టిన ఈ పరీక్షలో విద్యార్థి ఉత్తీర్ణత కాకుంటే ఇంటర్ తప్పినట్లుగా పరిగణిస్తారు. అయితే మార్కులను పరిగణనలోనికి తీసుకోరు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనా ‘నైతికత–మానవ విలువలు’, ‘పర్యావరణ విద్య’ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కాకపోతే మార్కుల జాబితాను అందజేయరు. జిల్లాలో 43 ప్రభుత్వ, 18 ఎయిడెడ్, 237 ప్రెవేటు జూనియర్ కళాశాలల్లో 53,713 మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పాఠ్యప్రణాళికలో దక్కని చోటు.. ఇంటర్లో పర్యావరణ విద్య, నైతికత–మానవ విలువలును పాఠ్యాంశంగా 2015 నుంచి అమలు చేస్తున్నారు. ఈ అంశాలను పాఠ్య ప్రణాళికలో మాత్రం చేర్చకుండా ఇంటర్‌బోర్డు విస్మరిస్తోంది. ఏటా ఈ అంశాలపై పరీక్షలను ఫస్టియర్ విద్యార్థులకు నిర్వహిస్తున్నా.. పాఠ్య ప్రణాళికలో చోటు కల్పిద్దామన్న ఆలోచన విద్యాశాఖకు ఉండడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. మొక్కుబడిగా పరీక్షలు.. పాస్ మార్క్ వస్తే చాలని, ఇంటర్ మార్కులకు వీటిని కలపక పోవడంతో ఈ సబ్జెక్టును కేవలం మొక్కుబడిగానే పరిగణిస్తున్నారు. ఈ పరీక్షలను ఏ కళాశాలలో చదివే విద్యార్థులకు ఆ కళాశాలలోనే నిర్వహిస్తున్నారు. దీని వల్ల కళాశాలల్లో చూచిరాతలు కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. వీటిని ప్రాధాన్యం లేని పరీక్షలుగా పలు ప్రైవేటు యాజమాన్యాలు కొట్టి పారేస్తున్నాయి. ఉత్తీర్ణత తప్పనిసరి.. 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 60 మార్కులకు నిర్వహించే ప్రశ్నా పత్రంలో ఐదు కేటగిరీల్లో ఒక్కో దానికి 15 మార్కులు చొప్పున ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. వీటితో పాటు సుమారుగా 15 ప్రాజెక్టులు ఉంటాయి. వీటిలో నచ్చిన ప్రాజెక్టును ఎంపిక చేసుకుని పూర్తి చేయాలి. రాత పరీక్షకు 60 మార్కులు, వ్యక్తిగత ప్రాజెక్టుకు 20, గ్రూపు ప్రాజెక్టుకు 20మార్కులు ఉంటాయి. -
ఇంటర్ సిలబస్‌లో మార్పులు
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు బోర్డు సన్నాహాలు ♦ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంగ్లిష్‌లో మార్పుచేర్పులు ♦ ద్వితీయ సంవత్సర తెలుగు, మోడర్న్ లాంగ్వేజీలో మార్పులు సాక్షి, హైదరాబాద్: ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్, ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్, తెలుగు, మోడర్న్ లాంగ్వేజ్ సబ్జెక్టుల సిలబస్‌ను మారుస్తోంది. ఈ విద్యా సంవత్సరం (వచ్చే జూన్) నుంచే ఈ మార్పులను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ మార్పుల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబోతోంది. తెలంగాణ కవులకు పెద్దపీట తెలుగులో తెలంగాణ కవులు, సాహితీవేత్తలు, రచయితల రచనలకు ప్రత్యేక స్థానం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం సగం వరకు ఉన్న ఆంధ్ర కవులు, రచయితల పాఠాలను తొలగించి తెలంగాణ కవులు, రచయితల రచనలు వెలుగులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మాండలికాల ప్రత్యేకతలను వీటిల్లో వివరించనుంది. తెలంగాణలోని పద్య కవులు, గద్య కవులు, జానపద కవులు, రచయితలకు సంబంధించి ప్రత్యేక పాఠాలను పొందుపరచనుంది. తెలంగాణ ఉద్యమం, దళిత సాహిత్యం తీరుతె న్నులకు సంబంధించిన పాఠాలు పొందుపరిచేందుకు చర్యలు చేపట్టింది. 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు చేసిన మార్పుల్లో కవర్ కాని తెలంగాణ కవులు, రచయితల రచనలకు స్థానం కల్పించనుంది. అయితే తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి ఆద్యులైన ప్రాచీన కవులైన నన్నయ వంటి వారి రచనలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. రాష్ట్ర చిహ్నాలు పొందుపరుచనుంది. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారికి సంబంధించిన పాఠ్యాంశాలను పొందుపరుచనుంది. సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారులపై పాఠ్యాంశాలను రూపొందించే ఏర్పాట్లు చేస్తోంది. ఇంగ్లిష్‌లో యాక్టివిటీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం లేదా తెలంగాణకు సంబంధించిన అంశాలపై పేరాలు ఇచ్చి, వాటిల్లోని అంశాలపై ప్రశ్నలకు జవాబులు రాబట్టే విధానాన్ని పెట్టేందుకు చర్యలు చేపట్టింది. జూన్ 1 నాటికి ఇచ్చేలా చర్యలు.. సిలబస్ మార్పు చేసిన పుస్తకాలతోపాటు ఇతర అన్ని పుస్తకాలను జూన్ 1 కల్లా ప్రభుత్వ కాలేజీలు, మార్కెట్లో అందుబాటులో ఉంచేలా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 1న కాలేజీలు ప్రారంభం కాగానే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు పుస్తకాలను ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. అలాగే ప్రథమ సవంత్సర విద్యార్థులకు ప్రభుత్వ కాలేజీల్లో చేరిన రెండోరోజే ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సిలబస్‌లో మార్పులు తెస్తున్న పుస్తకాలల్లో పాఠ్యాంశాల రచనతోపాటు, అన్ని పుస్తకాల ముద్రణపైనా తెలుగు అకాడమీతో ఇంటర్ బోర్డు చర్చలు జరుపుతోంది. గతేడాదే చే యాల్సి ఉన్నా.. ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ సిలబస్‌లో గత ఏడాదే మార్పులు చేయాలని భావించింది. కానీ, ఆలస్యం కావడంతో అప్పట్లో మార్పులు చేయలేదు. ప్రస్తుతం ప్రథమ సంవత్సర ఇంగ్లిష్‌తోపాటు ద్వితీయ సంవత్సర ఇంగ్లిష్‌లో మార్పులు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ మార్పులను ఖరారు చేయనుంది. ఇంగ్లిష్ విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవి యథాతథంగా అమలు చేస్తే సాంకేతికపరమైన సమస్యలు వస్తాయని, అందుకే మార్పులు చేయాల్సిందేనని బోర్డు నిర్ణయించింది. ప్రథమ సంవత్సర తెలుగు సిలబస్‌ను గత ఏడాదే మార్పు చేసిన ఇంటర్ బోర్డు ఈసారి ద్వితీయ సంవత్సర తెలుగు సిలబస్‌తోపాటు మోడర్న్ లాంగ్వేజ్ సిలబస్‌లో మార్పులు చేస్తోంది.