ఈ ఏడాది డీఎస్సీ లేదు
స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నిర్వహించబోమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు చాలా జిల్లాల్లో అవసరానికి మించి ఉన్నారని, కొన్ని జిల్లాల్లో మాత్రం స్వల్పంగా అవసరం ఉందని చెప్పారు. మరికొన్ని జిల్లాల్లో ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ విద్యా సంవత్సరంలో అవసరమైతే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు లేదా విద్యా వలంటీర్లను నియమిస్తామని వివరించారు. బుధవారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖపై సమీక్ష అనంతరం కడియం శ్రీహరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారని, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు కడియంపై పైవిధంగా స్పందించారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇంగ్లిషు మీడియం వైపు మొగ్గు చూపుతున్నారని, అందుకు అనుగుణంగా టీచర్లు ఆంగ్ల మాధ్యమంలో చెప్పగలిగేలా మెథడాలజీలో మార్పులు చేయాల్సి ఉందన్నారు.
అందుకే ఈ విద్యా సంవత్సరం డీఎస్సీ నిర్వహించబోమని చెప్పారు. 1998 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, దీనిపై సాధారణ పరిపాలన శాఖ (జే ఏడీ), న్యాయశాఖ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ సంఘాల అవసరం ఉందా అన్న అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశమై చర్చిస్తామన్నారు. మరోవైపు ఉపాధ్యాయ సమస్యలపై బుధవారం ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్, ఇతర సమస్యలను కడియంకు తెలియజేశారు.
నెలాఖరులోగా హాస్టళ్లలో ప్రవేశాలు
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల ఆవరణలో నిర్మించిన 102 బాలికల హాస్టళ్లలో ఈ నెలాఖరులోగా విద్యార్థులకు ప్రవేశాలను కల్పించనున్నట్లు కడియం శ్రీహరి వెల్లడించారు. వచ్చేనెల 1 నుంచి బాలికలు హాస్టళ్లలో ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ‘‘ఒక్కో హాస్టల్‌లో 25 గదులు నిర్మించాం. ఒక్కో గదిలో నలుగురు బాలికలకు వసతి కల్పిస్తాం. ఇలా 102 హాస్టళ్లలో 10,200 మంది బాలికలకు హాస్టల్ సదుపాయం కల్పిస్తాం. వీటిని ప్రభుత్వం ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించే గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రారంభిస్తాం.
బాలిక విద్యను ప్రోత్సహించేందుకు రూ.247 కోట్లతో ఈ హాస్టళ్లను నిర్మించాం. వీటి నిర్వహణ బాధ్యతను సీనియర్ టీచర్లకు అప్పగించాలా? ఔట్‌సోర్సింగ్‌పై ఇతరులకు అప్పగించాలా? అన్నది ఆలోచిస్తున్నాం. బాలికల హాస్టళ్లు కాబట్టి భద్రతపైనా ప్రత్యేక దృష్టి పెడతాం’’ అని ఆయన వివరించారు. రాష్ట్రానికి మొదటి విడతలో మంజూరైన 192 మోడల్ స్కూళ్లలో 177 స్కూళ్లను ఇప్పటికే ప్రారంభించామని, ఈ ఏడాది శంకర్‌పల్లి, షాబాద్, మంచిర్యాల, నర్నూర్, కొడిమ్యాలలో ప్రవేశాలు చేపట్టామన్నారు. స్కూళ్లల్లో రికార్డు స్థాయిలో 18,820 మరుగుదొడ్లను నిర్మించి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇందులో 30 శాతం మరుగుదొడ్లలో నీటి సదుపాయం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు, మోడల్ స్కూల్స్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.