డీఎస్సీ అభ్యర్థులు డీలా
డీఎస్సీ ఫలితాలు ఆలస్యం కావడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. జూన్ 15 నాటికే ఉపాధాయ్య నియామకాలు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పినా ఆ హామీ నెరవేరలేదు. డీఎస్సీ నిర్వహణ, ఫలితాలకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడం తో మెరిట్ జాబితా విడుదల, నియామకాల ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఇందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి.
- మెరిట్ జాబితా మరింత ఆలస్యం
- న్యాయపరమైన చిక్కులే కారణం
- ఉపాధ్యాయ నియామకాలు ఎప్పటికో...?
సాక్షి,చిత్తూరు: డీఎస్సీ అభ్యర్థులు డీలా పడ్డారు. మెరిట్ జాబితా కోసం ఎదురు చూపులు తప్పడంలేదు. న్యాయపరమైన చిక్కులంటూ రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేయడం విమర్శలకు తావిస్తోంది. గత ఏడాది నవంబర్ 20న డీఎస్సీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 1336 ఉపాధ్యాయపోస్టులకు సంబంధించి తొలుత 42 వేల మందికి పైగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా 37,268 మంది అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ పరీక్షకు హాజరయ్యారు. మే 9, 10, 11 తేదీల్లో ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష నిర్వహించింది.
జూన్ 3న విద్యాశాఖ ఫలితాలను వెల్లడించింది. జూన్ 9 నాటికి మెరిట్ లిస్ట్ జిల్లాలకు పంపి 15 నాటికే ఉపాధ్యాయ నియామకాలు పూర్తిచేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ప్రకటించారు. అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో విద్యాశాఖ మెరిట్ జాబితా విడుదలను వాయిదా వేసింది. డీఎస్సీ ప్రశ్నాపత్రాల కీ లోని తప్పులపై 1,836 కేసులు నమోదయ్యాయి. డీఎస్సీ ప్రాథమిక కీ పైనే 3 వేలకుపైగా అభ్యంతరాలు విద్యాశాఖకు అందినట్లు సమాచారం.
ప్రాథమిక కీ పై అభ్యంతరాలు వచ్చినా విద్యాశాఖ ఫైనల్ కీ విడుదలలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వీటిన్నింటినీ అంశాల వారీగా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు సరిచేసుకోవాల్సి ఉంది. అనంతరం ఈ నివేదికలను ట్రిబ్యునల్‌కు సమర్పించాలి. ఆపై ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాల మేరకు అభ్యర్థుల మెరిట్ జాబితా, నియామకపు ఉత్తర్వులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు డీఎస్సీ -2014 నిర్వహణ పైనే మరో కేసు ఉంది. డీఎస్సీ 2014ను గతకంటే భిన్నంగా నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.
గతంలో టీచర్ ఎలిజబులిటి టెస్ట్ (టెట్)ను నిర్వహించి అందులో క్వాలిఫై అయిన వారికి డీఎస్సీ (టీచర్ రిక్రూట్‌మెంట్ -టెర్ట్)ను పెట్టేవారు. ఈ సారి టెట్, టెర్ట్‌లను కలిపేసి డీఎస్సీ నిర్వహించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని న్యాయస్థానంలో ఇప్పటికే కొందరు సవాల్ చేస్తున్నారు. ఈ వివాదాలన్నింటికీ తెరపడాల్సి ఉంది. దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల, ఉపాధ్యాయ నియామకాలు మరింత ఆలస్యం కానున్నాయి. డీఎస్సీ రాసిన అభ్యర్థుల్లో మరింత ఆందోళన నెలకుంది.