ఏలూరు సిటీ : ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో నూతన విధానాలకు తెరలేస్తోంది. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా నియామకాలు చేపట్టాల్సి ఉండగా, ఈసారి రాజధాని నుంచే ఎంపిక ప్రక్రియ చేస్తారని తెలుస్తోంది. టెట్ కమ్ టెర్ట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జాబితాను హైదరాబాద్ నుంచి విడుదల చేస్తారని, ఆ జాబితాను అనుసరించే ఉద్యోగాల భర్తీ చేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే డీఎస్సీగా ప్రకటించడం దేనికని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎంపిక జాబితాను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించి అనంతరం కౌన్సెలింగ్ చేపట్టి పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే, డీఎస్సీ-14 నియామక ప్రక్రియను ఏ విధంగా చేస్తారో తెలియక అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. జిల్లాలో ఎంపిక చేస్తేనే గతంలో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈసారి హైదరాబాద్‌లో ఎంపిక చేస్తే ఎవరికి చెప్పుకోవాలని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
15నాటికి ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ?
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన సమయంలో ఈనెల 15నాటికి కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఘంటాపథంగా చెప్పారు. నేటికీ మెరిట్ లిస్ట్ కూడా విడుదల కాలేదు. కోర్టు కేసు నేపథ్యంలోనే జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. అయితే 15నాటికి ప్రొవిజి నల్ సెలక్షన్ లిస్ట్ విడుద చేస్తారని తెలుస్తోంది. ఉద్యోగాలకు ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులతో సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయిస్తారని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన వారందరినీ ఒకేచోటకు రప్పించి నియామక పత్రాలు ఇచ్చి ప్రతిజ్ఞ చేయిస్తారా లేక ఒక జిల్లా అభ్యర్థులతోనే ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తారా అనే దానిపై సందిగ్ధత ఉంది.
వెబ్ కౌన్సెలింగ్ ఆలోచన
ఉపాధ్యాయ నియామకాల్లో వెబ్ కౌన్సెలింగ్‌ను తెరపైకి తెచ్చేందుకు అధికారులు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధానం సత్ఫలితాలిస్తుందా లేదా అనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎంపిక జాబితా అధారంగా అభ్యర్థులకు 1 నుంచి 99 ఆప్షన్లు నమోదు చేసుకునే వీలు కల్పిస్తారని, ర్యాం కుల ఆధారంగా ఆన్‌లైన్‌లోనే వారికి కావాల్సిన పాఠశాలను ఎంపిక చేసుకునేలా అవకాశం ఇస్తారని సమాచారం. తద్వారా డీఈవో కార్యాలయం, జిల్లా ఎంపిక కమిటీ ప్రమేయం లేకుండానే హైదరాబాద్ నుంచే నియామకాలు చేపడతారని అంటున్నారు. మొత్తానికి ఎన్నడూలేని విధంగా డీఎస్సీ-14 అభ్యర్థులను సర్కారు తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసింది.
డీఎస్సీయా.. ఏపీ ఎస్సీయా
Published Sat, Jun 13 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM
Advertisement
Advertisement