గురువులకు సర్కారు నామాలు | postponed dsc notifications | Sakshi
Sakshi News home page

గురువులకు సర్కారు నామాలు

Published Sat, Sep 6 2014 3:01 AM | Last Updated on Tue, Aug 14 2018 4:39 PM

గురువులకు సర్కారు నామాలు - Sakshi

గురువులకు సర్కారు నామాలు

డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా
- ఎప్పుడు జారీ చేస్తారో చెప్పలేని పరిస్థితి
- బదిలీ ఉత్తర్వుల్లోనూ చివరి క్షణంలో మెలిక
- 20 శాతం పరిమితి విధింపుపై ఆందోళన
- దీని ప్రభావం ఖాళీల భర్తీపైనా పడుతుందంటున్న సంఘాలు
- సమస్యలను ముందుగా పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి
శ్రీకాకుళం: ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ప్రణాళిక ప్రకారం నీరుగారుస్తున్న టీడీపీ ప్రభుత్వం టీచర్ల నియామకాలు, బదిలీల విషయంలోనూ అదే పంథా అనుసరిస్తోంది. టీచర్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్‌ను వాయిదా వేసిన సర్కారు, టీచర్ల బదిలీలకు సంబంధించి కొత్త జారీ చేసిన ఉత్తర్వులు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు పదే పదే ప్రకటించినా అది ఆచరణకు నోచుకోలేదు. కొన్ని న్యాయపరమైన అంశాలు తేలకపోవడంతో నోటిఫికేషన్‌ను వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానికత అంశం తేలకపోవడంతోనే వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనితోపాటు పండిట్ పోస్టుల అప్‌గ్రేడేషన్ తదితర విషయాలపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, లేనిపక్షంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేరని ఉపాధ్యాయ సంఘాలు మొదటి నుంచీ మొత్తుకుంటున్నా విధ్యాశాఖ మంత్రి ఏమాత్రం పట్టించుకోకుండా.. సెప్టెంబర్ 5న కచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామనే పాట పాడుతూ వచ్చారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులను డీఎస్సీ ప్రకటన వాయిదా నిర్ణయం ఉసూరుమనిపించింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తారన్నది అధికారులే చెప్పలేకపోతున్నారు.

పరిమితంగానే బదిలీలు
ఇదిలా ఉంటే బదిలీలకు సంబంధించి శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ఉపాధ్యాయులను కలవరపరుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 20 శాతం మందినే బదిలీ చేయాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో ఆదేశించింది. శ్రీకాకుళం జిల్లాలో 600 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. 20 శాతం పోస్టులకు మాత్రమే బదిలీలు చేయాలంటే 120 పోస్టులు మాత్రమే నింపాల్సి ఉంటుంది. మిగిలిన వాటిని ఖాళీలుగా చూపించలేని పరిస్థితి ఉంది. దీనివల్ల మైదాన, పట్టణ పరిసర ప్రాంతాలతోపాటు మండల కేంద్రాల్లోని ఖాళీలను చూపించకూండా మారుమూల ప్రాంతాలను మాత్రమే ఖాళీగా చూపించే అవకాశం ఉంది.

ఫలితంగా ఇప్పటికే 8 ఏళ్ల సర్వీసును ఒకే పాఠశాలలో పూర్తి చేసి తప్పనిసరిగా బదిలీ కావాల్సినవారు తాము మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుం దని ఆవేదన చెందుతున్నారు. ఖాళీలను దాచి ఉంచడానికి మరో కారణం ఉందని కొన్ని సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి సుమారు 5వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వారికి అడ్డదారిన అనుకూలమైన పాఠశాలలను కేటాయించేందుకే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి విధానాలకు స్వస్తి చెప్పి గతంలో మాదిరిగా బదిలీలను పరిమితి లేకుండా చేయకుంటే ఆం దోళన తప్పదని పలువురు సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement