డీఎస్సీతోపాటే టెట్?
- దీనిపై డీఎస్సీ నోటిఫికేషన్ సమయంలో స్పష్టత ఇస్తాం
- జనవరి లేదా ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్
- రాష్ట్రవ్యాప్తంగా 7,491 మంది విద్యా వలంటీర్ల నియామకం
- ఈనెల 5 వరకు స్కూళ్లలో చేరేందుకు గడువు పెంపు
- సుప్రీం తీర్పు మేరకు ఏకీకత సర్వీసు రూల్స్‌పై నిర్ణయం
- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గురువారం సచివాలయంలో కడియం విలేకరులతో మాట్లాడుతూ జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి స్కూళ్లలో కొత్త టీచర్లు ఉండేలా చూస్తామన్నారు. అయితే డీఎస్సీ, టెట్‌ను వేర్వేరుగా నిర్వహించాలా లేక కలిపి చేపట్టాలా అనే దానిపై డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేప్పుడు స్పష్టత ఇస్తామని, దానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉందని ఆయన వివరించారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల తరువాత విద్యార్థుల సంఖ్యనుబట్టి అవసరమైన ఖాళీలపై స్పష్టత వచ్చిందని..అందుకే 7,994 విద్యా వలంటీర్ల భర్తీకి ఆమోదించినా అవసరాలను బట్టి 7,759 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. దాదాపు 59 వేల మంది దరఖాస్తు చేసుకోగా అర్హతలు, రోస్టర్, రిజర్వేషన్లు, మెరిట్‌ను (ఇంటర్, డిగ్రీ, ఉపాధ్యాయ కోర్సు, టెట్ మార్కుల వెయిటేజీ ప్రకారం) బట్టి అభ్యర్థులను ఆన్‌లైన్ పద్ధతిలో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఎంపిక చేసినట్లు కడియం తెలిపారు.
మండలాల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలను గత నెల 18న ఎంఈవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు. వాటిపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించామన్నారు. 21న తుది ఎంపిక జాబితాలను ప్రకటించి 23లోగా స్కూళ్లలో చేరాలని సూచించామన్నారు. అయితే జిల్లా కలె క ్టర్ల విజ్ఞప్తి మేరకు ఆ గడువును ఈ నెల 5 వరకు పొడిగించినట్లు కడియం చెప్పారు. నోటిఫై చేసిన 7,759 పోస్టుల్లో 7,491 పోస్టులను భర్తీ చేయగా ఇప్పటివరకు 6,488 మంది విధుల్లో చేరారని, మిగిలినవారు ఈ నెల 5లోగా విధుల్లో చేరాల్సి ఉందన్నారు. ఈ నియామకాలపై ఇంకా అభ్యంతరాలుంటే ఆధారాలతో పాఠశాల విద్యా డెరైరక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని కడియం సూచించారు.
విద్యా వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుంచి తమ ప్రభుత్వం రూ. 8 వేలకు పెంచినట్లు కడియం తెలిపారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి తదితర కొన్ని జిల్లాల్లోని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో అదనంగా విద్యావలంటీర్లు కావాలని జిల్లా కలెక్టర్లు కోరారన్నారు. ఈనెల 5న చివరి జాయినింగ్ తరువాత ఆ నియామకాలపై దృష్టిపెడతామన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు పూర్తిస్థాయి కాపీ అందలేదని, కోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.