జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 21వ తేదీ నుంచే 2016-2017 విద్యా సంవత్సరం ప్రారంభం ....
ఏప్రిల్ 23 వరకు నడవనున్న పాఠశాలలు
విద్యారణ్యపురి :జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 21వ తేదీ నుంచే 2016-2017 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈమేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఆదేశాలు జారీచేశారు. 1నుంచి 9వ తరగతి విద్యార్థులకు (సమ్మిటివ్-2) వార్షికపరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఉపాధ్యాయులు ఈనెల 17, 18 తేదీల్లో ఆ పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి విద్యార్థులకు ఫలితాలు ప్రకటించి వారికి ప్రోగ్రెస్‌కార్డులు కూడా అందజేయాలి. బుధవారం పరీక్షలు ముగిసినా గురువారం యధావిధిగా పాఠశాలలు నడపాల్సి ఉంటుంది. ఫలితాలు వెల్లడించాక విద్యార్థులను పైతరగతుల్లోకి తీసుకొంటారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూటబడులే కొనసాగుతాయి. 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 13నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉచిత పాఠ్యపుస్తకాలు వస్తున్నా యి.
బుధవారం వరకు జిల్లా కేంద్రంలోని గోదాంలోకి 35 శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయి. జిల్లాకు 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు 15,22,811 పాఠ్యపుస్తకాలు కావాలని అధికారులు ప్రతిపాదించగా.. ఇప్పటివరకు 5,20,800 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. మొత్తం 81 టైటిల్స్‌లో 30 టైటిల్స్ చేరుకున్నాయి. కాగా, పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రం నుంచి మండలాలకు సరఫరా చేసేందుకు టెండర్లు పిలవగా ఎవరూ ముందుకురాలేదు. దీంతో గతంలో మాదిరిగా ఎం ఈఓలే పుస్తకాలు తీసుకెళ్లాలని డీఈఓ బుధవారం ఆదేశించారు.