Director of Education
-
ఈ నెల 21నుంచే విద్యాసంవత్సరం ఆరంభం
ఏప్రిల్ 23 వరకు నడవనున్న పాఠశాలలు విద్యారణ్యపురి :జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 21వ తేదీ నుంచే 2016-2017 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈమేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఆదేశాలు జారీచేశారు. 1నుంచి 9వ తరగతి విద్యార్థులకు (సమ్మిటివ్-2) వార్షికపరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఉపాధ్యాయులు ఈనెల 17, 18 తేదీల్లో ఆ పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి విద్యార్థులకు ఫలితాలు ప్రకటించి వారికి ప్రోగ్రెస్‌కార్డులు కూడా అందజేయాలి. బుధవారం పరీక్షలు ముగిసినా గురువారం యధావిధిగా పాఠశాలలు నడపాల్సి ఉంటుంది. ఫలితాలు వెల్లడించాక విద్యార్థులను పైతరగతుల్లోకి తీసుకొంటారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూటబడులే కొనసాగుతాయి. 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 13నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉచిత పాఠ్యపుస్తకాలు వస్తున్నా యి. బుధవారం వరకు జిల్లా కేంద్రంలోని గోదాంలోకి 35 శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయి. జిల్లాకు 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు 15,22,811 పాఠ్యపుస్తకాలు కావాలని అధికారులు ప్రతిపాదించగా.. ఇప్పటివరకు 5,20,800 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. మొత్తం 81 టైటిల్స్‌లో 30 టైటిల్స్ చేరుకున్నాయి. కాగా, పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రం నుంచి మండలాలకు సరఫరా చేసేందుకు టెండర్లు పిలవగా ఎవరూ ముందుకురాలేదు. దీంతో గతంలో మాదిరిగా ఎం ఈఓలే పుస్తకాలు తీసుకెళ్లాలని డీఈఓ బుధవారం ఆదేశించారు. -
ముగిసిన రేషనలైజేషన్
జిల్లా పరిషత్ పాఠశాలల్లో మిగులు పోస్టులను గుర్తించిన విద్యాశాఖ వాటిని సర్దుబాటు చేసేందుకు నానాపాట్లు పడాల్సి వచ్చింది. సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం కావడంతో బదిలీల షెడ్యూల్లోనే మార్పులు చేయాల్సి వచ్చింది. విద్యాశాఖ డెరైక్టర్ నుంచి రోజుకో జీఓ జారీ కావడం...దానికి అనుసరించి మార్పులు చేర్పులు చేయడంలో విద్యాశాఖ రేయింబవళ్లు శ్రమించింది. బుధవారం ఉపాధ్యాయ తుదిఖాళీల జాబితాను విద్యాశాఖ వెబ్సైట్లో ప్రవేశపెట్టింది. అలాగే బదిలీల కోసం ఉపాధ్యాయుల దరఖా స్తు కూడా ముగిసింది. 19 మంది విద్యార్థుల లోపు ఉన్న పాఠశాలలకు ఒక టీచరు, 20 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఇద్దరు టీచర్లు చొప్పున కేటగిరీల వారీగా మిగులు పోస్టులను సర్దుబాటు చేశారు. ఈ విధంగా సర్ధుబాటు చేయగా ఇంకా మిగిలిన పోస్టులను డీఈఓ వద్దనే ఉంచారు. ప్రభుత్వం భవిష్యత్తులో డీఎస్సీ ద్వారా లేదా కొత్త పోస్టులు మంజూరు చేసినప్పుడు వీటిని వాడుకుంటారు. బుధవారం రాత్రి 10 గంటల సమయం వరకు విద్యాశాఖ అందించిన సమాచారం మేరకు వివరాలు....జిల్లా పరిషత్ యాజమాన్య కోటాలో జిల్లా ప్రాథమిక పాఠశాలలు 2179 ఉన్నాయి. ఈ పాఠశాలలకు ప్రభుత్వం 5,838 పోస్టులను మంజూరు చేసింది. రేషనలైజేషన్ జీఓ నెం.11, 17 ప్రకారం కా వాల్సిన పోస్టులు 4,765 మాత్రమే. ఇవి గాక 1073 పోస్టులు మిగులుతున్నాయి. దీంట్లో 436 పోస్టులను కదిలించకుండా అక్కడే ఉంచారు. మిగులు పోస్టుల నుంచి కదలించకుండా ఉన్న పోస్టులను తీసేయగా 637 ఎస్జీటీ పోస్టులు మిగిలాయి. వీటిని డీఈఓ వద్దనే ఉంచారు. జెడ్పీ కోటా కిందనే ఉర్దూ విభాగంలో జిల్లాలో 19 పాఠశాలలు ఉన్నాయి. దీంట్లో 41 పోస్టులు మంజూరు కాగా 30 పోస్టులు అవసరం ఉంది. ఈ పోస్టులను సర్దుబాటు చేయగా 11 పోస్టులు మిగులుతున్నాయి. దీంట్లో 5 పోస్టులను కదలించకుండా అక్కడే ఉంచడం ద్వారా 5 పోస్టులు మిగిలాయి. ఉర్దూ మీడియంలో.. ప్రభుత్వ మేనేజ్మెంట్ కింద ఉర్దూ మీడియంలో జిల్లాలో 14 పాఠశాలలు ఉన్నాయి. 38 పోస్టులను మంజూరు చేయగా రేషనలైజేషన్ జీఓ ప్రకారం 24 పోస్టులు సరిపోతున్నాయి. ఈ పోస్టులను మినహాయిస్తే 14 పోస్టులు మిగులుతున్నాయి. దీంట్లో 7 పోస్టులు కదిలించకుండా అక్కడే ఉంచడం ద్వారా మరో 7 పోస్టులు డీఈఓ వద్దనే ఉంచారు. తెలుగు మీడియంలో.. ప్రభుత్వ మేనేజ్మెంట్ కింద తె లుగు మీడియంలో జిల్లాలో 77 పాఠశాలలు ఉన్నాయి. దీంట్లో 225 ఎస్జీటీ పోస్టులు మంజూరు చేశారు. కానీ రేషనలైజేషన్ జీఓ ప్రకారం 167 పోస్టులు సరిపోతున్నాయి. 58 పోస్టులు మిగులుతున్నాయి. దీంట్లో 17 పోస్టులు కదిలించలేదు. ఈ పోస్టుల్లోంచి మిగులు పోస్టులను తీసేయగా 41 పోస్టులు డీఈఓ వద్దనే ఉంచారు. స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల వివరాలు ఇంకా అందాల్సి ఉంది. -
లోపం ఎక్కడుంది?
అన్ని వసతులు ఉన్నా విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది టీచర్లను నిలదీసిన పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు హైదరాబాద్: ‘‘నేను మూడు రోజుల క్రితం నల్లగొండ జిల్లా, కొత్తపల్లిలోని శివారెడ్డి గూడెంకు వెళ్లి అక్కడి పాఠశాలలో మీటింగ్ పెట్టాను. అక్కడ అంతా బాగానే ఉంది. ఆరు గదులతో పాఠశాల, కాంపౌండ్ వాల్, తాగునీరు, మూత్రశాలలు ఉన్నాయి. అయితే పిల్లలు ఎంత మంది ఉన్నారని ఆరా తీస్తే 13 మంది అని తేలింది. సరే అక్కడే ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఎంత మంది ఉన్నారు అని తెలుసుకుంటే 410 మంది ఉన్నారని తెలిసింది. మరి లోపం ఎక్కడుంది’’ అని రాష్ట్ర పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు ఉపాధ్యాయులను నిలదీశారు. శనివారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆవిష్కరణోత్సవానికి వచ్చిన చిరంజీవులు మాట్లాడుతూ ‘మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, ఉచిత పాఠపుస్తకాలు, దుస్తులు, అన్ని సదుపాయాలతో విద్యను అందిస్తున్నాం, అయినా కూడా విద్యార్థుల సంఖ్య తగ్గుతూనే ఉంది’ అని అసహనం వ్యక్తం చేశారు. ఏటా లక్ష నుంచి 1.50 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికనుగుణంగా ఉపాధ్యాయులు మారాలని, పాఠశాలకు సమయానికి రావడంతో పాటు బోధన పద్ధతిలో కూడా కొంత మార్పు తీసుకువచ్చి విద్యార్థుల సంఖ్యను పెంచాలని అన్నారు. రాష్ట్రంలో ఐదు వేల పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయని, వాటిని మూలన పెట్టకుండా విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు చెప్పాలని సూచించారు.