(నీట్–అండర్ గ్రాడ్యుయేషన్)ను 2017–18 విద్యా సంవత్సరం నుంచి తెలుగుతో సహా ఎనిమిది భాషల్లో నిర్వహించాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది....
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని వైద్య విద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్–అండర్ గ్రాడ్యుయేషన్)ను 2017–18 విద్యా సంవత్సరం నుంచి తెలుగుతో సహా ఎనిమిది భాషల్లో నిర్వహించాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నీట్‌ను తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్, అస్సామీ, బెంగాలి, గుజరాతీ, మరాఠీ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్రం పేర్కొంది.
రాష్ట్రాల పరీక్షల విధానాలు, పలు అంశాలపై అధ్యయనం చేశాక రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మే నెలలో 18 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిర్వహించిన పలు సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయించినట్టు కేంద్ర వైద్య విద్య శాఖ సంయుక్త కార్యదర్శి ఏకే. సింఘాల్ తెలిపారు.