యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులను ఎంచుకునేందుకు, ఒక విశ్వవిద్యాలయం నుంచి మరో విశ్వవిద్యాలయానికి మారేం దుకు వీలు కల్పించే సరికొత్త విధానం అమల్లోకి రాబోతోంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి సరికొత్త విధానం
న్యూఢిల్లీ: యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులను ఎంచుకునేందుకు, ఒక విశ్వవిద్యాలయం నుంచి మరో విశ్వవిద్యాలయానికి మారేం దుకు వీలు కల్పించే సరికొత్త విధానం అమల్లోకి రాబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం (చాయిస్ బేస్డ్ క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ సిస్టం) దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. మంగళవారమిక్కడ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో జరిగిన రాష్ట్రాల విద్యామంత్రుల సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పద్ధతిని కేంద్రం ఇప్పటికే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అమలు చేస్తోంది.
తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం ఉండాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే మంగళవారం అన్ని రాష్ట్రాల విద్యామంత్రులతో స్మృతి ఇరానీ సమావేశమై దీనిపై చర్చించారు. కొత్త విధానం అమలుకు మంత్రులంతా సుముఖత వ్యక్తంచేశారు. ఇది అమల్లోకి వస్తే విద్యార్థులు అదనంగా ఎంచుకునే కోర్సుల కాలపరిమితి కూడా ఇతమిత్థంగా ఏమీ ఉండదు. విద్యార్థుల వీలునుబట్టి కోర్సును పూర్తి చేసుకోవచ్చు. ఈ కొత్త విధానం అమలులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు నామినేట్ చేసే సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు.