![Sankranthi holidays start for schools in AP from 10th Jan - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/5/as.jpg.webp?itok=m0uKJSAL)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్కూళ్లకు ఈనెల పదో తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. మొత్తం ఎనిమిది రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండేలా విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌లో పనిదినాలను సర్దుబాటు చేసింది. ఈ ఏడాది కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, ఇంకా పూర్తిస్థాయిలో స్కూళ్లు తెరవలేని పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో విద్యాసంవత్సరంలో పనిదినాలు కోల్పోకుండా ఉండేందుకు విద్యాశాఖ పండగ సెలవులను కుదించాలని భావించింది.
ఈనెల 13 నుంచి మూడు రోజులు పండగ దినాలు కావడంతో సెలవులు అటుఇటుగా ఆ మేరకు ప్రకటించాలనుకున్నారు. అయితే సంక్రాంతికి ఉన్న ప్రాధాన్యం, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ సెలవు రోజులను పెంచేలా చర్యలు తీసుకుంది. 10వ తేదీ ఆదివారం సెలవు. అయితే, 11న సోమవారం అమ్మ ఒడి కార్యక్రమం ఉన్నందున హాఫ్ డే వర్కింగ్ డేగా ఉంటుంది. హాఫ్ డే సెలవు ఉంటుంది. తర్వాత 17వ తేదీ వరకు వరుసగా సెలవులు ఉంటాయి. 18వ తేదీ సోమవారం పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.
7, 8 తరగతుల ఫార్మేటివ్ పరీక్షలు వాయిదా
ఈనెల 21 నుంచి 23 వరకు జరగాల్సిన ఫార్మేటివ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. సిలబస్ పూర్తికి సంబంధించి ఉపాధ్యాయుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షలను ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment