► బడులు ప్రారంభమై నెల దాటినా విడుదల కాని అకాడమిక్ క్యాలెండర్
► యూనిట్ టెస్టుల నిర్వహణపై సందిగ్ధం
► ప్రభుత్వానికి ప్రతిపాదించామంటున్న విద్యాశాఖ అధికారులు
► సమయం, పరీక్షల నిర్వహణపై గందరగోళం
ఏ పనికైనా ప్రణాళిక అవసరం.. ప్రణాళిక లేనిదే ఏ పని కూడా ఆచరణకు నోచుకోదంటే అతిశయోక్తి కాదు. కానీ.. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే అకాడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయక ఆలస్యం చేస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణ, సమయపాలన, పాఠ్యాంశాల బోధనపై గందరగోళం నెలకొంది.
కరీంనగర్‌ఎడ్యుకేషన్: ఏ పనికైనా ప్రణాళిక ప్రధానం.. కానీ పాఠశాల విద్యాశాఖ మాత్రం ప్రణాళికలు లేకుండానే బడులను కొనసాగిస్తోంది. విద్యా సంవత్సరానికి ప్రారంభం ముందే రావాల్సిన అకాడమిక్ క్యాలెండర్ ఇప్పటివరకూ విడుదల చేయలేదు. దీంతో పరీక్షల నిర్వహణ, సమయపాలన, పాఠ్యాంశాల బోధనపై ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. అయితే.. ప్రభుత్వం కావాలనే అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేయడం లేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పాఠశాలలు సంపూర్ణంగా కొనసాగేందుకు ఏటా పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేస్తోంది.
వారంలో ఏ పాఠశాల (ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల) ఎన్ని గంటలకు ప్రారంభించాలి.. ఎప్పుడు ముగించాలి.. ఏ సబ్జెక్టు ఎన్ని గంటలు బోధించాలి.. ఏయే పరీక్షలు ఏ నెలలో నిర్వహించాలి.. ఏ పండుగకు ఎన్నిరోజుల సెలవులు.. పాఠశాలల్లో క్రీడా పోటీలు ఎప్పుడు నిర్వహించాలి.. ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి కొనసాగించాలి.. బడులకు వేసవి సెలవులు ఎప్పటి నుంచి ఇవ్వాలి.. వచ్చే విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభించాలి.. తదితర అంశాలన్నీ అకాడమిక్ క్యాలెండర్‌లో పొందుపరిచి ఉంటాయి. దీని ప్రకారమే పాఠశాల నిర్వహణ కొనసాగుతుంది. కానీ.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి ప్రణాళిక విడుదల కాలేదు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు దాటినా ప్రభుత్వం గాని, విద్యాశాఖ గాని ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రధానోపాధ్యాయుల ఆందోళన..
జిల్లాలో 425 ప్రాథమిక, 75 ప్రాథమికోన్నత, 149 ఉన్నత పాఠశాలలు కలుపుకోని మొత్తం 649 పాఠశాలలున్నాయి. కేజీబీవీలు 11, ఆద ర్శ పాఠశాలలు 11 మొత్తం 22 పాఠశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తం గా 45,990 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 3,006 మంది ఉపాధ్యాయులు, 81 మంది విద్యావలంటీర్లు పనిచేస్తున్నారు. అకాడమిక్ క్యాలెండర్ విడుదల కాకపోవడంపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఏ నెలలో ఏం చెప్పాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. జూలైలోనే యూనిట్ టెస్టు నిర్వహిం చాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో యూనిట్ టెస్టు నిర్వహణపై తర్జనభర్జన పడుతున్నారు. విద్యాప్రణాళి క క్యాలెండర్‌పై ప్రధానోపాధ్యాయులు డీఈవోలను అడిగితే పాత అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠాలు చెప్పాలని మౌఖిక ఆదేశాలు ఇస్తుండడంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు.
తేలని గణితం, ఫిజిక్స్ టీచర్ల పంచాయితీ..
కొంత కాలంగా జరుగుతున్న గణితం, ఫిజిక్స్ టీచర్ల పంచాయితీ ఎటూ తేలడం లేదు. 6,7 తరగతులకు సంబంధించిన గణితం సబ్జెక్టు ఎవరు చెప్పాలనే దానిపై స్పష్టత కరువైంది. విద్యాశాఖ అధికారులు గతేడాది ఉత్తర్వులు ఒకరకంగా ఇచ్చి ఇప్పుడు పాత పద్ధతిలోనే అమలు చేయమనడంతో పాలుపోలేని పరిస్థితి నెలకొంది. కొత్తగా అమలు చేయాలని చెబుతున్న దానికి ఉత్తర్వులు మాత్రం ఇంతవరకు రాలే దు. దీంతో ఆ సబ్జెక్టు టీచర్ల మధ్య పాఠశాలల్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ పంచాయితీకి పరిష్కారం అకాడమిక్ క్యాలెం డర్ విడుదల మాత్రమేనని ప్రధానోపాధ్యాయులు భావిస్తున్నారు.
కావాలనే కాలయాపన..: అకాడమిక్ క్యాలెండర్‌ను ఈ విద్యా సం వత్సరానికి విడుదల చేయకపోవడానికి కారణం ప్రభుత్వ ఆలసత్వమేనని పలువురు విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. అకాడమిక్ క్యాలెండ ర్ ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదం కోసం రెండు నెలల క్రితమే పాఠశాల విద్యాశాఖ అధికారులు పంపించారు. కానీ.. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు దాని ఆమోదించడం కానీ, తిరస్కరించడం కానీ చేయలేదు. దీన్ని బట్టి ప్రభుత్వమే అకాడమిక్ క్యాలెండర్ విడుదలపై కాలయాపన చేస్తోందని భావించవచ్చు. విద్యా సంవత్సరం ప్రారంభాన్ని జూన్ 1కి మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాసంవత్సరం ముగింపు తేదీలు మారే అవకాశం ఉంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను సేకరిస్తామని చాలా రోజులుగా ప్రభుత్వం చెబుతూ వస్తున్నా.. అమలుకు నోచలేదు.