రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 23వ తేదీ నుంచి దసరా సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చేనెల 6న తిరిగి పునఃప్రారంభమవుతాయి.
వచ్చే నెల 6న పునఃప్రారంభం డీఈఓలకు అకడమిక్ క్యాలెండర్ జారీ
మారిన బడివేళలు, పెరిగిన పనిగంటల వివరాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 23వ తేదీ నుంచి దసరా సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చేనెల 6న తిరిగి పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు విద్యాశాఖ రూపొందించిన అకడమిక్ కేలండర్‌ను జిల్లాల విద్యాశాఖ అధికారులకు పంపించింది. మారిన బడివేళలు, పెరిగిన పనిగంటల ప్రకారం పాఠశాలలు కొనసాగాలని స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచి పాఠశాలలు ప్రారంభం కావాలని పేర్కొంది. ఇక సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు ఉంటాయని పేర్కొంది. మారిన పని వేళల ఆధారంగా సబ్జెక్టుల వారీగా, తరగతుల వారీగా పీరియడ్లను కేటాయించింది. వారంలో ప్రాథమిక పాఠశాలలకు 48 పీరియడ్లు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 48 పీరియడ్లు, ఉన్నత పాఠశాలల్లో 54 పీరియడ్లు ఉండాలని నిర్ణయించింది. ఏయే నెలలో ఏయే పాఠ్యాంశాల బోధన పూర్తి చేయాలి. పరీక్షలు ఎప్పుడెప్పుడు నిర్వహించాలనే వివరాలను పొందుపరిచింది.
ఇక సహపాఠ్య కార్యక్రమాలైన విలువల విద్య, నైతిక విద్య, పనివిద్య, కంప్యూటర్ విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యకు వారంలో ఎన్ని పీరియడ్లు కేటాయించాలి? ఏయే అంశాలను ఏయే సబ్జెక్టుల వారు బోధించాలనే సమగ్ర వివరాలను అందులో పొందుపరిచిందని పీఆర్‌టీయూ, ఎస్టీయూ అధక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, పి.సరోత్తంరెడ్డి, సీహెచ్ రాజిరెడ్డి, భుజంగరావు పేర్కొన్నారు. ఏడాదిలో మూడుసార్లు సమ్మేటివ్, మూడుసార్లు ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసిందని తెలిపారు. ఈ కేలండర్ ప్రకారం ఒకటి, రెండో ఫార్మేటివ్ పరీక్షల సమయం గడిచిపోయింది. ఇక మూడో ఫార్మేటివ్ పరీక్ష డిసెంబరులో, నాలుగో ఫార్మేటివ్ పరీక్షను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఇక సమ్మేటివ్ అసేస్‌మెంట్-ఎస్‌ఏ-1(త్రైమాసిక) అక్టోబరు 13 నుంచి 18వ తేదీ నిర్ణయించారు. ఎస్‌ఏ-2ను (అర్ధవార్షిక) డిసెంబరు 16 నుంచి 23 వరకు, ఎస్‌ఏ-3 (వార్షిక) 2015 ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించాలని స్పష్టం చేసింది. పదో తరగతి వార్షిక పరీక్షలను మార్చి/ఏప్రిల్ నెలల్లో ఉంటాయి. పాఠశాలలకు చివరి పనిదినం ఏప్రిల్ 23 కాగా, తిరిగి పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం అవుతాయి.