
శృతి తప్పుతోంది!
అధ్యయన కేంద్రంలో తెలుగు తమ్ముళ్ల హవా
అంతా ఉమామహేశ్వర ప్రసాదం
విలువైన కాలాన్ని నష్టపోతున్న విద్యార్థులు
మంటగలుస్తున్న కళాశాల ప్రతిష్ట
విజయవాడ కల్చరల్ : సంగీత కళాశాల శృతి తప్పుతోంది. మృదంగ ధ్వని తడబడుతోంది. వీణా తంత్రులు అపస్వరాలు పలుకుతున్నాయి. శ్రద్ధగా సంగీత పాఠాలు నేర్చుకుందామనుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులు సంగీత కళాశాలలో వేళాపాళా లేకుండా నిర్వహించే రాజకీయ సభల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. పాఠాలు శ్రద్ధగా నేర్చుకోలేకపోతున్నారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలపై రాజకీయ నాయకుల ప్రభావంతో విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు. ఎప్పుడు ఏ రాజకీయ సభ జరుగుతుందో, ఎప్పుడు కుల సంఘాల వేడుకలు జరుగుతాయో తెలియని పరిస్థితి. కార్యక్రమాలు జరిగే ప్రతిసారీ విద్యార్థులు సంగీత పాఠాలపై ఏకాగ్రత చూపలేకపోతున్నారు. పరీక్షల సమయంలో కూడా ప్రజాప్రతినిధుల నిర్వాకం వల్ల కళాశాల ప్రతిష్ట మంటగలుస్తోంది. స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొందరు తమ ప్రాపకం కోసం కళాశాలలో కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి సిఫార్సులు చేస్తున్నారు. మరోపక్క నిర్వహణ కోసం సంగీత కళాశాలకు చెల్లించాల్సిన కనీస మొత్తం కూడా చెల్లించకుండా భారీ స్థాయిలో పంగనామాలు పెడుతున్నారు.
ఆధిపత్యం కోసం ఆరాటం
ప్రజాప్రతినిధులకు తోడు స్థానిక కార్పరేటర్ల భర్తలు కూడా సంగీత కళాశాలపై ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. ప్రైవేటు కార్యక్రమాలకు కూడా తమను పిలవాలని ఒత్తిడి తెస్తున్నారని సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలకు ఆ డివిజన్‌కు సంబంధించిన ప్రతినిధులను పిలవటం రివాజు. అయితే ఇక్కడ ఇతర ప్రాంతాల ప్రజాప్రతినిధులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలను శాసించే స్థాయికి ఎదిగిపోయారు. సంగీత కళాశాలలో పాగా వెయ్యటానికి ప్రజాప్రతినిధులు కొందరు కళాశాల గేటు వద్ద క్యాంటీన్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దీనిపై విద్యార్థినీ విద్యార్థులు జిల్లా కలెక్టర్‌కు మొర పెట్టుకోవటంతో ఆ ప్రయత్నానికి ఆదిలోనే గండి పడింది.
శ్రీకాకుళం ట్రాన్స్‌ఫర్ అయిపోతావ్...
తమ మాట వినటం లేదని, తాను చెప్పినవారికి కళాశాల అద్దెకు ఇవ్వలేదని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ సంగీత విద్వాంసుడు, కళాశాల నిర్వాహకుడిని పత్రికల్లో రాయటానికి వీలులేని భాషలో దూషించినట్లు సమాచారం. మాట వినకపోతే శ్రీకాకుళం ట్రాన్స్‌ఫర్ అయిపోతావని బెదిరించినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి శ్రీకాకుళంలో సంగీత కళాశాల లేదని ఆ ప్రజాప్రతినిధికి తెలియపోవటం విచారకరం.
వినాయక సేవా సమితి భారీ బకాయిలు
రాష్ట్రంలోనే అతి పెద్ద వినాయకుని విగ్రహాన్ని నిర్మించి మూడు నెలల పాటు సంగీత కళాశాలను అద్దెకు తీసుకొని రూ.4 లక్షలకు పైగా అద్దె బకాయి పడ్డారు. రాజకీయ నాయకుల ఆధిపత్య పోరులో కొందరు బుద్ధిపూర్వకంగానే తప్పుడు చిరునామాతో అద్దెకు తీసుకొని సొమ్ము చెల్లించకుండా జారుకున్నారు. నిర్వాహకులపై కేసు పెట్టాలని కలెక్టర్ ఆదేశించినా చిరునామా సరిగా లేకపోవటం వల్ల ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా మారుపేరుతో సేవా సమితి అద్దెకు తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రిన్సిపాల్ గోవిందరాజన్ వద్ద ప్రస్తావించగా, ఆ విషయం వాస్తవమేనని, రూ.3 లక్షలకు పైగా సంగీత కళాశాలకు బాకీ పడ్డారని వివరించారు.
మంత్రి మాటలు బేఖాతరు
భాషా సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గతంలో సంగీత కళాశాలలో సంగీత, సాహిత్య, సంప్రదాయ కళలు మాత్రమే ప్రదర్శించాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. ప్రజాప్రతినిధులు ఆయన మాటలు బేఖాతరు చేస్తూ తమకు నచ్చిన కార్యక్రమాలనే ప్రదర్శించుకుంటున్నారు. గతంలో భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించేవారు. ఇప్పుడు సంగీత కళాశాలలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. సంచాలకులు డాక్టర్ విజయ భాస్కర్ స్థానికంగానే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళాశాల నిర్వహణ, కార్యక్రమాల పర్యవేక్షణ స్వయంగా పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు.