పాత పద్ధతిలోనే టెన్త్ పరీక్షలు
సిలబస్ మాత్రం కొత్తదే.. ఏపీ సర్కారు నిర్ణయం
పెండింగ్‌లో జీవో నంబర్ 17.. తాజాగా జీవో 29 విడుదల
జీవో 17లో పేర్కొన్న సంస్కరణలపై సర్వత్రా ఆందోళన
కమిషనర్ సూచనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరం (2014-15) పదో తరగతి పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిలబస్ మాత్రం పాతది కాకుండా కొత్తదే అనుసరించనున్నారు. ఈమేరకు 9, 10 తరగతుల పరీక్షల సంస్కరణలపై గతంలో ఇచ్చిన ‘జీవో 17’ను పెండింగ్‌లో పెట్టింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యద ర్శి అధర్‌సిన్హా మంగళవారం జీవో నంబర్ 29ను విడుదల చేశారు. సంస్కరణలపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు వచ్చే విద్యా సంవత్సరం (2015-16) నుంచి 9, 10 తరగతుల పరీక్షల్లో సంస్కరణలు అమలు చేస్తారు. గతంలో ఇచ్చిన జీవో 17లోని అంశాలపై క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సంస్కరణల్లో భాగంగా పరీక్ష పేపర్లను 11 నుంచి 9కి తగ్గించడం, 80 శాతం మార్కులు సబ్జెక్టు వెయిటేజిగా, 20 శాతం మార్కులు ఆయా స్కూళ్లు విద్యార్థుల ప్రతిభాపాటవాలపై అంతర్గత మదింపు ఆధారంగా నిర్ణయించాలని సూచించారు. కాంపోజిట్ భాషా పేపర్లు రెండింటికి గాను ఒక్కటే చేశారు. విద్యార్ధులకు ఉపయోగపడే ప్రాథమిక లక్ష్యాల సాధనకు నిరే ్దశించిన భాషా పేపర్లను ఇలా కుదించడం సరికాదన్న వాదన వినిపించింది.
కొత్త విధానంపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా అవగాహన కలగలేదు. ముందస్తుగా విద్యార్థులు, టీచర్లను సంసిద్ధులను చేయకుండా కొత్త విధానాన్ని అమలు చేస్తే పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. సర్వశిక్షా అభియాన్ కింద 8వ తరగతి వరకు సమగ్ర, నిరంతర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టి, దీనిపై రెండేళ్లుగా శిక్షణ ఇచ్చినప్పటికీ, పూర్తిగా గాడిలో పడలేదు. ఈ పరిస్థితుల్లో శిక్షణ, అవగాహన కలిగించకుండా 9, 10 తరగతుల పరీక్షల్లో సంస్కరణలు అమలు చేయడం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఉషారాణి జీవో 17ను పెండింగ్‌లో పెట్టాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విధానంపై కమిటీని నియమించి, సంస్కరణలపై నిపుణులతో అధ్యయనం చేయించి, సవరణలు చేసిన తర్వాతే అమలు చేయించాలని కోరారు. భారీ సంఖ్యలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 20 శాతం మార్కులకు నిర్దేశించిన అంతర్గత మదింపును పర్యవేక్షించడం సాధ్యం కాదని తెలిపారు. కొత్త సిలబస్‌తో పాత పద్ధతిలోనే పరీక్షల నిర్వహణకు అనుమతించాలని కోరారు. అంతర్గత మదింపు చేపట్టినప్పటికీ, మార్కుల వెయిటేజీ ఇవ్వకూడదని సూచిం చారు. ఈ లేఖను పరిశీలించిన ప్రభుత్వం జీవో17ను పెండింగ్‌లో పెట్టింది.
నవంబర్‌లోగా కమిటీ నివేదిక
టెన్త్ పరీక్షల సంస్కరణలను అధ్యయనం చేసి కొత్తగా సిఫార్సులు చేయడానికి ప్రభుత్వం ముగ్గురితో ఓ కమిటీని నియమించిం ది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) డైరక్టర్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్, ఎస్‌సీఈఆర్‌టీ డైరక్టర్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జీవో 17లో సూచించిన సంస్కరణలను పరిశీలిం చి 2015-16 విద్యా సంవత్సరం నుంచి అమలుకు వీలుగా నవంబర్‌లోగా వీరు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని తాజా జీఓలో సూచించారు.