17న జేఈఈ మెయిన్ నోటిఫికేషన్?
♦ కసరత్తు చేస్తున్న సీబీఎస్‌ఈ
♦ ఈసారి ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు వేర్వేరు పరీక్షలే!
♦ ఇంటర్ మార్కులకు వెయిటేజీ రద్దుపై త్వరలోనే స్పష్టత
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాల విషయంలో నెలకొన్న సందిగ్ధతకు క్రమంగా తెరపడుతోంది. వాటిల్లో ప్రవేశాల కోసం ఒకే పరీక్ష నిర్వహిస్తారా? పాత విధానంలోనే వేర్వేరు పరీక్షలు ఉంటాయా? అన్న గందరగోళం తొలగిపోనుంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై పరీక్షల నిర్వహణ సం స్థలు వేర్వేరుగా చర్యలు దిగాయి. దీంతో 2016-17 విద్యా సంవత్సరంలో వేర్వేరు పరీక్షలే జరుగుతాయన్నది స్పష్టం అవుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీలు, 18 ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కొనసాగే మరో 18 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 2016-17 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 17న నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.
మెయిన్ పరీక్షను ఏప్రిల్ 4వ తేదీన నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసం సీబీఎస్‌ఈ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన టెండర్ నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తామని గౌహతి ఐఐటీ వెల్లడించింది. ఆన్‌లైన్‌ద్వారా అందుకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు ఇప్పటికే గౌహతి ఐఐటీ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అంతేకాకుండా మే 22 లేదా 24వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహిస్తామంటూ తేదీని కూడా ఐఐటీ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. ఈ చర్యల నేపథ్యంలో ఈసారి ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు వేర్వేరు పరీక్షలే ఉంటాయని స్పష్టమవుతోంది.
ఒకే పరీక్షకు జేఏబీ ప్రతిపాదన
దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) చేపడుతోంది. ఇందుకోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ మెయిన్ స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియెట్ స్కోర్‌కు 40 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును ఖరారు చేస్తోంది. ఆ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు చేపడుతోంది. ఇక ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఏటా ఏదో ఒక ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఇక అన్ని ఐఐటీలు, సీబీఎస్‌ఈలు సంయుక్తంగా ఏర్పాటు చేసే జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ప్రవేశాలు చేపడుతోంది. అయితే జేఈఈ మెయిన్‌లో అత్యధిక మార్కులు సాధించిన 1.5 లక్షల మందిని మాత్రమే ఐఐటీ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హులుగా ప్రకటిస్తున్నారు.
ఇలా వేర్వేరు పరీక్షల విధానం వల్ల ప్రవేశాలు ఆలస్యం అవుతున్నాయని, సీట్లు మిగిలిపోతున్నాయన్న వాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒకే పరీక్ష, ఒకే ర్యాంకు, ఒకే కౌన్సెలింగ్ విధానం అమల్లోకి తేవాలని జేఏబీ ప్రతిపాదించింది. దీనికి అనుగుణంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన అక్టోబర్ 1న వరంగల్ నిట్‌లో, 6వ తేదీన ముంబై ఐఐటీలో జరిగిన సమావేశాల్లో వేర్వేరుగా కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కమిటీల నివేదికలు ఇంకా రాలేదు. ఒకే పరీక్షతోపాటు ఎన్‌ఐటీ ప్రవేశాల్లో ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీని కూడా రద్దు చేయాలన్న ఆంశంపై అధ్యయనం చే యాలని స్పష్టం చేశారు. అయితే ఆ కమిటీల నివేదికల పరిస్థితి ఎంతవరకు వచ్చిందన్న విషయాన్ని పక్కనబెట్టి పాత పద్ధతిలోనే ప్రవేశాలు చేపట్టేందుకు నిర్వహణ సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. ఇక ఇంటర్ మార్కుల వెయిటేజీ అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది.