సమైక్యాంధ్ర ఉద్యమంతో జిల్లా రగిలిపోతోంది. ఉద్యోగ సంఘాల సమ్మె బాటతో పాలన స్తంభించింది. రూ.కోట్లు నష్టం వస్తున్నా వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్నారు. పదహారు రోజులుగా జిల్లాలో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ ప్రజాప్రతినిధులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కేవలం మద్దతుకే పరిమితమవుతున్నారు. ప్రజలు, ఉద్యోగ సంఘాలు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు ఒకటి రెండు రోజులు వచ్చి ఫొటోలకు పోజులివ్వడం మినహా.. ప్రత్యక్ష ఉద్యమానికి దిగడం లేదు. దీనిపై సమైక్యవాదులు మండిపడుతున్నారు.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా అన్ని వర్గాలవారు ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ప్రజలు సైతం రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం అప్పుడప్పుడు కనిపించి వెళ్లడం తప్ప ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనడం లేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దీక్ష, ధర్నా, ర్యాలీలు చేస్తున్న వారి శిబిరాలకు ఎమ్మెల్యేలు రావడం, మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పడం, పత్రికల కోసం ఫొటోలు దిగడం, అనంతరం వెళ్లిపోవడం మినహా చేసేదేమీ ఉండడం లేదని విమర్శిస్తున్నారు.
ఒకవైపు సమైక్యాంధ్ర అంటూనే మరోవైపు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామనడం వారి చిత్తశుద్ధికి అద్దంపడుతోంది. పీఎన్‌జీవోలు సమ్మెకు దిగి పాలనను స్తంభింపచేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళనలతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. త్వరలోనే విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెబాట పడుతున్నారు. అంటే ఉద్యమం తీవ్రత రెట్టింపవుతోంది. కానీ ప్రజాప్రతినిధులు మాత్రం సొంత పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. ప్రత్యక్ష పోరాటానికి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారశైలిపై ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.
రాజీనామాలు చేశారా! : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే జిల్లాలో ఉద్యమం పెల్లుబికింది. ఎమ్మెల్యేలు, మంత్రుల రాజీనామాకు ఒత్తిడి తీవ్రమైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు మినహా మిగిలినవారంతా రాజీనామాలు చేసినట్లు ప్రకటించారు. వారి రాజీనామాలు అసెంబ్లీ స్పీకర్‌కు చేరాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వపరమైన సౌకర్యాలను పొందుతున్నారు. ప్రభుత్వ వాహనాలతో పాటు సెక్యూరిటీ కూడా కొనసాగుతోంది. దీంతో వీరు నిజంగా రాజీనామాలు చేశారా అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది.
సమైక్యాంధ్ర కోసం ఉద్యమించకపోగా ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సిన ప్రజాప్రతినిధులు సమైక్యవాదులలో వేరు కుంపట్లు పెట్టేలా ప్రేరేపిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో మూడు శిబిరాల వెనుక ఓ మంత్రి ‘హస్తం’ ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా మంత్రి బాలరాజు తీరుపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నా రాజీనామా చేయకపోవడంతో పాటు చేయమని అడిగిన ఉపాధ్యాయ సంఘాలపై ఒంటికాలిపై లేవడం పట్ల ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు.
పోరు మాని పోజులు!
Published Sat, Aug 17 2013 2:27 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement
Advertisement