సాక్షి, విజయవాడ : అసలే అంతంత మాత్రం ఆదాయంతో మనుగడ సాగిస్తున్న ఆర్టీసీకి సమైక్యసెగ తగిలింది. ఆరు రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల వల్ల ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్‌కు సుమారు రూ.9.5 కోట్లనష్టం వాటిల్లింది. పశ్చిమగోదావరి, కష్ణా,గుంటూరు జిల్లాలు విజయవాడ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ మూడు జిల్లాలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావం తీవ్రంగా ఉంది. గతంలో తెలంగాణ సకల జనుల సమ్మె కారణంగా 45 రోజుల పాటు ఆయా ప్రాంతాలకు బస్సులు నిలిపివేయడంలో కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిన విజయవాడ జోన్ ప్రస్తుతం సమైక్యాంధ్ర సెగ తగలడంతో మరింత నష్టాలబాట పడుతోంది. రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యమం జరిగిన దాని ప్రభావం ఆర్టీసీపై పడుతూ ఉండటంతో నష్టాల నుంచి కొలుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటుంది.
రోడ్డెక్కని 1500 బస్సులు....
జోన్ పరిధిలో సుమారు 3300 బస్సులు ఉండగా, అందులో 1500 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో బంద్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపోల్లో బస్సులు మూడు రోజులు పాటు రోడ్డుపైకే రాలేదు. గుంటూరు జిల్లాలోని మాచర్ల, తెనాలి డిపోల బస్సులు, కృష్ణాజిల్లాలోని గుడివాడ డిపో బస్సులు రెండు రోజుల పాటు డిపోలకే పరిమితమయ్యాయి. మిగిలిన డిపోల్లో బస్సులు తిరిగినా... ఆక్యుపెన్సీరేషియో (ఓఆర్) 50 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
25 బస్సులు ధ్వంసం - రూ.లక్ష నష్టం...
జోన్‌పరిధిలోని సమైక్యాంధ్ర ఆందోళన కారులు బస్సులపై తమ ప్రతాపం చూపించారు. అయితే గతంలో తరహాలో పెట్రోల్ పోసి నిప్పంటించడం వంటి దారుణాలకు పాల్పడకుండా అద్దాలు పగలగొట్టడం, టైర్లలో గాలి తీసివేయడం వంటి నిరసన కార్యక్రమాలను మాత్రమే చేపట్టారు. సుమారు 25 బస్సులు దెబ్బతినడం వల్ల సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లింది.
ప్రత్యామ్నాయం వైపు ప్రయాణికుల చూపు!
సమ్మె జరుగుతున్న సమయంలో ఆర్టీసీ బస్సుల్లో కంటే రైళ్లలోనూ, విమానాల్లోనూ ప్రయాణం చేయడం ఉత్తమమనే భావన ప్రయాణికుల్లో వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ రూట్‌లో నడిచే బస్సులు 60శాతం మించి ఓఆర్ రావడం లేదు. ప్రయాణికులంతా రైళ్లలో వెళుతూ ఉండటంతో అక్కడ సీట్లు దొరకడం క ష్టంగా మారింది. హైదరాబాద్ రూట్‌లో ఏ ఇబ్బందులు లేవని ప్రయాణికులు బస్సుల సౌకర్యం ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
అవకాశం ఉన్నంత వరకు బస్సులు నడుపుతాం
మూడు జిల్లాలోనూ రోజుకు కోటిన్నర పైగా నష్టం వస్తుంది. అవకాశం ఉన్నంత వరకు బస్సుల్ని నడుపుతున్నాం. అయితే బస్సు గమ్యస్థానం వరకు చేరదేమోనన్న భయంతో ప్రయాణికులు బస్సులు ఎక్కకపోవడంతో 50శాతం బస్సులు ఖాళీగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని ఓఆర్ తక్కువగానే ఉన్నప్పటికీ బస్సులు నడుపుతున్నాం. ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని సమైక్యాంధ్రవాదులు బస్సుల్ని అడ్డగించవద్దని కోరుతున్నాం.
- నాగరాజు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్
ఆర్టీసీ నష్టం రూ.9.5 కోట్లు
Published Tue, Aug 6 2013 12:53 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement