పీఆర్వోల కంటే వీరికే జీతాలెక్కువ
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌కు రూ.50,000, అసిస్టెంట్‌కు రూ.30,000
మంత్రుల పీఆర్వోలకు రూ.37వేలు
ప్రతీ మంత్రికీ ఒక పీఆర్వో, ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక అసిస్టెంట్
వేతనం, ఎంపిక విధివిధానాలను ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ప్రతీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులను వివరించడానికి ప్రతీ మంత్రి ఒక పీఆర్వో, ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్‌ను నియమించుకోవడానికి విధివిధానాలు, జీతభత్యాలను ఖరారుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏడాది కాలంపాటు ఔట్‌సోర్సింగ్ విధానంలో ఏడీ డిజిటల్ కార్పొరేషన్ సంస్థ ద్వారా వీరి నియామకాలు జరగాలని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
మంత్రుల పీఆర్వోల జీతం నెలకు రూ.37,000గాను, అదే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లకు నెలకు రూ.50,000లు, అసిస్టెంట్లకు రూ.30,000 చొప్పున నిర్ణయించారు. రోజువారీ కార్యక్రమాలు పర్యవేక్షించి, పత్రికా ప్రకటనలు విడుదల చేసే పీఆర్వోల కంటే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌కు అధిక జీతం ఇవ్వడంపై మంత్రుల పేషీల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
అంతేకాదు.. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ సమాచార సేకరణ కోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను కలవడానికి కూడా అనుమతించింది. ఫ్యాక్ట్‌చెక్ పరిశీలన కోసం ఉన్నతాధికారులతో పాటు సీనియర్ జర్నలిస్టులు, ఎడిటోరియల్ స్టాఫ్‌లను సంప్రదించాల్సిందిగా ఆదేశించింది. ఈ విధంగా పీఆర్వోల కంటే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లకు విస్తృత అధికారాలు కల్పించి సోషల్ మీడియా ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్కారు ఈ నిర్ణయం ద్వారా చాటిచెప్పింది.
ఎగ్జిక్యూటివ్‌లు, పీఆర్వోలకు అర్హతలివే..
ఇక ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లుగా.. అసిస్టెంట్లుగా నియమించుకోడానికి కనీసం డిగ్రీ విద్యార్హతగా నిర్ణయించింది. అదే పీఆర్వోలు కనీసం డిగ్రీ అర్హత ఉండి జర్నలిజంలో డిప్లమో లేదా పబ్లిక్ రిలేషన్స్‌లో కనీసం ఐదేళ్లు అనుభవం ఉండాలని పేర్కొంది. వీరిని ఔట్‌సోరి్సంగ్ నియామక సంస్థ ఆప్కాస్ ద్వారా ఎంపిక చేస్తారు.
కానీ, ఇప్పటికే చాలామంది మంత్రులు పీఆర్వోలను, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లను మూడు, నాలుగు నెలల క్రితమే నియమించుకున్నారు. జీఓ విడుదల కాకుండానే వీరిని అనధికారికంగా నియమించుకుని ఇప్పుడు వీరిని క్రమబద్ధీకరించుకోనున్నారు. కానీ, ఇలా అనుమతిలేకుండా నియమించుకోవడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment