RTC buses services
-
సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు
సాక్షి, అమరావతి: సంక్రాంతి ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా సాధారణ చార్జీలతోనే నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. గత 25ఏళ్లుగా దసరా, సంక్రాంతి సీజన్లో ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు (అంటే 150శాతం చార్జీలు) వసూలు చేస్తూ వచ్చింది. కానీ తొలిసారిగా ఈ ఏడాది దసరా సీజన్లో ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నడిపింది. అదే రీతిలో రానున్న సంకాంత్రి సీజన్లో కూడా ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నడపనుంది. సంక్రాంతికి సొంతూరు వెళ్లి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం 6,400 ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు విజయవాడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంక్రాంతి ప్రత్యేక బస్సుల వివరాలను వెల్లడించారు. సంక్రాంతి ప్రత్యేక బస్సు సర్వీసులకు సంబంధించిన వివరాలు సంక్రాంతికి ముందుగా జనవరి 6 నుంచి 14 వరకు 3,120 ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహిస్తారు. సంక్రాంతి అనంతరం జనవరి 15 నుంచి 18 వరకు 3,280 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతారు. మొత్తం 6,400 ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే 3,600 బస్సులను ఏపీకి నిర్వహించనుండటం విశేషం. బెంగళూరు నుంచి 430, చెన్నై నుంచి 150 బస్సు సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడుపుతారు. ► రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విజయవాడకు 800 బస్సులు, విశాఖపట్నానికి 450 బస్సులు, రాజమహేంద్రవరానికి 200 బస్సులు, ఇతర ప్రాంతాలకు మరో 770 ప్రత్యేక బస్సులు నడుపుతారు. ► అన్ని బస్సులను జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు. ► ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు అవకాశం కల్పించారు. ఆర్టీసీ పోర్టల్ (www.apsrtconline.in) ద్వారా నేరుగా రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఏటీబీ ఏజెంట్లు, ఏపీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలను సక్రమంగా నిర్వహించేందుకు అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, హైదరాబాద్‌లోని వివిధ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని ఏర్పాటుచేస్తారు. ► ప్రయాణికులకు సమాచారం కోసం 24/7 కాల్‌సెంటర్( 0866–2570005)ను ఆర్టీసీ నిర్వహిస్తుంది. ► ఆర్టీసీ నూతనంగా ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ సర్వీసు స్టార్ లైనర్ బస్సులను హైదరాబాద్, ఒంగోలు, కడప, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు నుంచి నడుపుతుంది. ► ఆర్టీసీ అన్ని దూర ప్రాంత సర్వీసులకు వచ్చి వెళ్లేందుకు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణచార్జీలో 10శాతం రాయితీ కల్పించింది. -
కీలక భేటీ వాయిదా.. బస్సు ప్రయాణికులకు నిరాశ
సాక్షి, హైదరాబాద్ : అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు ప్రారంభం కావడంతో ఇక వచ్చే వారం నుంచి బస్సుల్లో ప్రయాణించొచ్చని భావించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైంది. బుధవారం జరగాల్సిన కీలక భేటీ వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల భేటీని వాయిదా వేస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. కరోనా వైరస్ ప్రబలిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించిన తరువాత అంతరాష్ట్ర బస్సు సర్వీస్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే సడలింపుల్లో భాగంగా బస్సులను తిప్పడానికి రెండు రాష్ట్రాలు సన్నద్ధం అయ్యాయి. ఈ మేరకు గత వారం విజయవాడలో సమావేశమైన రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. మరోసారి చర్చించుకొని ఫైనల్ చేసుకోవాలని అప్పుడే అనుకున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 24న ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం వాయిదా పడింది. ఈ వారంలో భేటీ అయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఇప్పట్లో తిరిగి ప్రారంభం కావడం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర బస్సులను నడపడానికి సీఎం కేసీఆర్ అంగీకరించపోవచ్చని భావిస్తున్నారు. కాగా, తెలంగాణలో జిల్లాల్లో ఇప్పటికే బస్సులు తిరుగుతున్నాయి. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో... సిటీలో బస్సులను, మెట్రో రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఐతే... రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడిపినా సమస్యేమీ ఉండదనే అభిప్రాయం ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి వస్తుండటంతో... సర్కారు ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
వచ్చే వారం.. రైట్ రైట్
సాక్షి, అమరావతి: అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు ప్రారంభం కావడంతో వచ్చే వారం నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుహృద్భావ వాతావరణంలో అంతరాష్ట్ర ఒప్పందాన్ని పరిష్కరించుకోవాలని గురువారం జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. తెలంగాణ ఆర్టీసీ ఈడీలు యాదగిరి, వినోద్‌కుమార్ విజయవాడ చేరుకుని ఏపీఎస్ ఆర్టీసీ ఈడీలు బ్రహ్మానందరెడ్డి, కృష్ణమోహన్, జీవీ రావు, ఆదాం సాహెబ్‌లతో చర్చలు జరిపారు. ప్రాథమికంగా కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సుల్ని తిప్పేందుకు చర్చల్లో అంగీకారం కుదిరింది. ఈనెల 23న ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌లో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. అనంతరం రెండు రాష్ట్రాల రవాణా శాఖల మంత్రులు పేర్ని నాని, పువ్వాడ అజయ్‌కుమార్‌లతో ఆర్టీసీ ఎండీలు మాదిరెడ్డి ప్రతాప్, సునీల్ శర్మలు సమావేశమై అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోనున్నారు. విభజన నుంచి సింగిల్ పర్మిట్ వివాదం.. ► రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య సింగిల్ పర్మిట్ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ సమాన కిలోమీటర్లు నడిపేలా అధికారులు ప్రాథమికంగా చర్చలు ప్రారంభించారు. ఏపీ విజయవాడ–హైదరాబాద్ రూట్లో బస్సు సర్వీసులు ఎక్కువగా నడుపుతుండగా, తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్–తిరుపతి రూట్లో బస్సు సర్వీసులు అధికంగా నడుపుతోంది. ► ఏపీఎస్ఆర్టీసీ రోజుకు 4.92 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని తిప్పుతోంది. తెలంగాణ భూ భాగంలో 2.64 లక్షల కిలోమీటర్లు, ఏపీలో 2.28 లక్షల కిలోమీటర్ల మేర తిప్పుతోంది. ► తెలంగాణ ఆర్టీసీ రోజుకు 3.90 లక్షల కిలోమీటర్లు బస్సులు నడుపుతుండగాఏపీ భూ భాగంలో 1.40 లక్షల కిలోమీటర్లు, తెలంగాణ పరిధిలో 2.50 లక్షల కిలోమీటర్లు తిప్పుతోంది. ► ఏపీలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రోజూ 518 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. కర్ణాటకకు వచ్చే వారం 293 సర్వీసులు ► ఏపీ నుంచి కర్ణాటకకు ఈ నెల 17 నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం కాగా 168 సర్వీసుల్ని నడపాలని ప్రతిపాదనలు రూపొందించగా 10 జిల్లాల నుంచి 140 సర్వీసులు మాత్రమే నడిచాయి. రెండో దశలో 293 బస్సు సర్వీసులు నడపాలని ప్రతిపాదనలు రూపొందించారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే అంతరాష్ట్ర సర్వీసులు: ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానందరెడ్డి అంతరాష్ట్ర బస్ సర్వీసులను కోవిడ్ నిబంధనల ప్రకారమే నడుపుతామని ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్) బ్రహ్మానందరెడ్డి తెలిపారు. బస్టాండ్ నుంచి బస్టాండ్‌కు మాత్రమే సర్వీసులు నడుపుతామని స్పష్టం చేశారు. ప్రయాణీకుల్లో 5 శాతం మందికి వైద్య పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌గా తేలితే హోం క్వారంటైన్ చేస్తామన్నారు. ప్రస్తుతం కర్నాటకకు నడుపుతున్న అంతరాష్ట్ర సర్వీసులకు ఇవే నిబంధనలు వర్తిస్తున్నాయని, తెలంగాణకు త్వరలో సర్వీసులు ప్రారంభమైతే హెల్త్ ప్రోటోకాల్ విధిగా పాటిస్తామని చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ అధికారులతో జరిగిన చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని, ఈనెల 23న మరోమారు హైదరాబాద్‌లో చర్చలు జరపనున్నట్లు వివరించారు. -
బస్సుల కోసం విద్యార్థుల నిరసన
సాక్షి, రేగిడి(శ్రీకాకుళం) : విద్యార్థులకు రవాణా కష్టాలు మరింత కష్టతరం కావడంతో రోడ్డెక్కుతున్నారు. కళాశాలలకు వెళ్లే సమయంలో చాలినన్ని బస్సులు నడపకపోవడంతో ఇటీవల ఉణుకూరులో ఆందోళన చేపట్టిన ఘటన మరవక ముందే తోకలవలస జంక్షన్ వద్ద బుధవారం పలు గ్రామాల విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ మేరకు మండలంలోని తోకలవలసతోపాటు లింగాలవలస, వావిలవలస, బుడితిపేట, చిన్నశిర్లాం తదితర గ్రామాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు రెండు బస్సులు మాత్రమే తిరుగుతున్నాయని, పాలకొండ నుంచి ఉంగరాడమెట్టకు వచ్చేసరికే పరిమితికి మించిన ప్రయాణికులతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఈ విషయమై పలుమార్లు ఆర్టీసీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ విషయం తెలుసుకున్న రేగిడి పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళను విరమింపజేశారు. ఆ సమయంలోనే పాలకొండ నుంచి రాజాం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు విద్యార్థులు టాప్‌పైన ప్రయాణించే ప్రయత్నం కూడా చేశారు. నిత్యం ప్రాణాలతో చెలగాటమాడుతూ కళాశాలలకు వెళ్లాల్సి వస్తుందని, ఆర్టీసీ అధికారుల ఇప్పటికైనా స్పందించి అదనపు బస్సులను నడపాలని కోరుతున్నారు. -
ఆర్టీసీలో సమ్మె యోచన విరమణ
సాక్షి, అమరావతి: తాము చేయతలపెట్టిన సమ్మెను విరమించుకుంటు న్నట్టు ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం సచివాలయంలో కలిసిన జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జేఏసీ నేతలు వలిశెట్టి దామోదరరావు, సీహెచ్ సుందరయ్య, వి.వరహాలనాయుడు, వైవీ రావు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఆర్టీసీని విలీనం చేస్తామంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వారు చెప్పారు. కృతజ్ఞతలు తెలియజేసిన తమతో ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం తమ భుజం తట్టి చెప్పారన్నారు. ‘ఆర్టీసీకి ఎన్ని నష్టాలున్నా.. ప్రభుత్వమే భరిస్తుంది.. మీ భవిష్యత్తు నేను చూసుకుంటా.. ప్రభుత్వ ఉద్యోగులకు అందే సౌకర్యాలన్నీ మీకు అందుతాయి. ప్రైవేటు బస్సులకు దీటుగా ఆర్టీసీ బస్సులను నడపాలని’’ సీఎం తమకు చెప్పారని జేఏసీ నేతలు వివరించారు. ఆర్టీసీ అప్పులను, కేటాయించాల్సిన బడ్జెట్ గురించి జేఏసీ నేతలు ప్రస్తావించగా.. అవన్నీ ఆర్థికశాఖ చూసుకుంటుందని చెప్పారన్నారు. సీఎం తమ పట్ల కనబరిచిన ఆప్యాయత, స్పందన ఆనందదాయకంగా ఉందన్నారు. రవాణా, ఆర్ధిక శాఖ మంత్రులతో కూడిన కమిటీ త్వరలో నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతుందని సీఎం భరోసా ఇచ్చారని నాయకులు చెప్పారు. విలీన ప్రక్రియ పూర్తి అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఆర్టీసీ ఉద్యోగులు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేయడం వల్ల 55 వేల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది’ అని జేఏసీ కన్వీనర్ దామోదరరావు పేర్కొన్నారు. రవాణా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో కలిసి వెళ్లి సచివాలయంలో సీఎంను కలిసి వచ్చామని వివరించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె యోచన విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
బస్సులు కొండెక్కవు
సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్ర ఉద్యమం తిరుమల శ్రీవారిని తాకింది. తిరుమలకు బస్సులు నడపడంపై టీటీడీ అధికారులు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. జిల్లా లో 1,350 బస్సు సర్వీసులు ఉన్నాయి. ఒక్క తిరుమలకు మా త్రమే 500 బస్సు సర్వీసులు రోజుకు 3,200 ట్రిప్పులు తిప్పుతున్నారు. జిల్లాకు రోజుకు రూ.1.30 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 13 రోజులుగా సాగుతున్న సమ్మెతో చిత్తూరు జిల్లాలో ఆర్టీసీకి సుమారు రూ.13 కోట్లమేర నష్టం వాటిల్లినట్లు అంచనా. సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన నిరవధిక సమ్మెతో మరింత నష్టం వాటిల్లనుంది. 1975 ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించినపుడు మాత్రమే తిరుమలకు ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. తర్వాత ఇంతవరకు బస్సుల రాకపోకలకు ఆటంకం కలగలేదు. ఇప్పుడు సమైక్య ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచి తిరుమలకు బస్సులను నిలిపివేసినట్లు ఆర్టీసీ యూనియన్ ప్రకటించింది. ఈ సమ్మె ఢిల్లీని తాకాలి సమైక్యవాణి ఢిల్లీకి వినిపించాలంటే తిరుమలకు రాకపోకలను నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఎన్ఎంయూ నాయకులు చల్లా చంద్రయ్య, ప్రభాకర్, బీఎస్‌బాబు, వైఎస్సార్ ఆర్టీసీ యూని యన్ నాయకులు పీసీ బాబు, లతారెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రకాష్ తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలోనే తిరుమలకు బస్సుల రాకపోకలను నిలిపివేసినట్లు వారు గుర్తుచేశారు. శ్రీవారి భక్తులకు అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించాలని కోరారు. సేవల్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏపీఎస్ఆర్టీసీని విభజన పేరుతో రెండు గా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, సంస్థను, ఉద్యోగ, కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. తిరుమల రెండు ఘాట్ రోడ్లలో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎక్కడి బస్సులు అక్కడే సీమాంధ్ర జిల్లాల్లో 14 వేల బస్సులను ఎక్కడికక్కడే ఆపేసినట్లు ఆర్టీసీ జేఏసీ నాయకులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం నుంచే దూర ప్రాంతాల బస్సులను నిలిపివేశారు. గ్రామాల్లో రాత్రిపూట ఉండే పల్లెవెలుగు బస్సులు కూడా అర్ధరాత్రి ఆయా డిపోలకు చేరుకున్నాయి. విషయం తెలుసుకున్న ప్రయాణికులు కొందరు ముందే గమ్యస్థానాలకు చేరుకుంటే, మరి కొందరు రైళ్లు, ప్రైవేటు వాహనాల కోసం తంటాలు పడ్డారు. -
నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె
-
ఆర్టీసీ నష్టం రూ.9.5 కోట్లు
సాక్షి, విజయవాడ : అసలే అంతంత మాత్రం ఆదాయంతో మనుగడ సాగిస్తున్న ఆర్టీసీకి సమైక్యసెగ తగిలింది. ఆరు రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల వల్ల ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్‌కు సుమారు రూ.9.5 కోట్లనష్టం వాటిల్లింది. పశ్చిమగోదావరి, కష్ణా,గుంటూరు జిల్లాలు విజయవాడ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ మూడు జిల్లాలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావం తీవ్రంగా ఉంది. గతంలో తెలంగాణ సకల జనుల సమ్మె కారణంగా 45 రోజుల పాటు ఆయా ప్రాంతాలకు బస్సులు నిలిపివేయడంలో కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిన విజయవాడ జోన్ ప్రస్తుతం సమైక్యాంధ్ర సెగ తగలడంతో మరింత నష్టాలబాట పడుతోంది. రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యమం జరిగిన దాని ప్రభావం ఆర్టీసీపై పడుతూ ఉండటంతో నష్టాల నుంచి కొలుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటుంది. రోడ్డెక్కని 1500 బస్సులు.... జోన్ పరిధిలో సుమారు 3300 బస్సులు ఉండగా, అందులో 1500 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో బంద్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపోల్లో బస్సులు మూడు రోజులు పాటు రోడ్డుపైకే రాలేదు. గుంటూరు జిల్లాలోని మాచర్ల, తెనాలి డిపోల బస్సులు, కృష్ణాజిల్లాలోని గుడివాడ డిపో బస్సులు రెండు రోజుల పాటు డిపోలకే పరిమితమయ్యాయి. మిగిలిన డిపోల్లో బస్సులు తిరిగినా... ఆక్యుపెన్సీరేషియో (ఓఆర్) 50 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 25 బస్సులు ధ్వంసం - రూ.లక్ష నష్టం... జోన్‌పరిధిలోని సమైక్యాంధ్ర ఆందోళన కారులు బస్సులపై తమ ప్రతాపం చూపించారు. అయితే గతంలో తరహాలో పెట్రోల్ పోసి నిప్పంటించడం వంటి దారుణాలకు పాల్పడకుండా అద్దాలు పగలగొట్టడం, టైర్లలో గాలి తీసివేయడం వంటి నిరసన కార్యక్రమాలను మాత్రమే చేపట్టారు. సుమారు 25 బస్సులు దెబ్బతినడం వల్ల సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లింది. ప్రత్యామ్నాయం వైపు ప్రయాణికుల చూపు! సమ్మె జరుగుతున్న సమయంలో ఆర్టీసీ బస్సుల్లో కంటే రైళ్లలోనూ, విమానాల్లోనూ ప్రయాణం చేయడం ఉత్తమమనే భావన ప్రయాణికుల్లో వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ రూట్లో నడిచే బస్సులు 60శాతం మించి ఓఆర్ రావడం లేదు. ప్రయాణికులంతా రైళ్లలో వెళుతూ ఉండటంతో అక్కడ సీట్లు దొరకడం క ష్టంగా మారింది. హైదరాబాద్ రూట్లో ఏ ఇబ్బందులు లేవని ప్రయాణికులు బస్సుల సౌకర్యం ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అవకాశం ఉన్నంత వరకు బస్సులు నడుపుతాం మూడు జిల్లాలోనూ రోజుకు కోటిన్నర పైగా నష్టం వస్తుంది. అవకాశం ఉన్నంత వరకు బస్సుల్ని నడుపుతున్నాం. అయితే బస్సు గమ్యస్థానం వరకు చేరదేమోనన్న భయంతో ప్రయాణికులు బస్సులు ఎక్కకపోవడంతో 50శాతం బస్సులు ఖాళీగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని ఓఆర్ తక్కువగానే ఉన్నప్పటికీ బస్సులు నడుపుతున్నాం. ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని సమైక్యాంధ్రవాదులు బస్సుల్ని అడ్డగించవద్దని కోరుతున్నాం. - నాగరాజు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ -
సిమాంధ్రకు పూర్తిగా నిలిచిపోయిన ఆర్టీసి సర్వీసులు
-
నిలిచిన ఆర్టీసీ సేవలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో అటువైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే నష్టాలబాటలో నడుస్తున్న ఆర్టీసీని సీమాంధ్రలో సమైక్యాంద్ర ఉద్యమ సెగ ఆర్థికంగా మరింత కుంగదీస్తోంది. ఉద్యమ నేపథ్యంలో కోస్తా, రాయలసీమ వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసుల నిలిపివేతతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం ఎంజీబీఎస్ నుంచి దాదాపు లక్షన్నర మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుండగా సీమాంద్రలో ఉద్యమం కారణంగా ఈ సంఖ్య 50 వేలకు పడిపోయింది. ఎంజీబీఎస్ నుంచి రాయలసీమ జిల్లాలకు రోజూ ఆర్టీసీ 710 సర్వీసులు నడుపుతుంది. ఉద్యమం ఊపందుకోవడంతో గత ఐదు రోజులుగా రాయలసీమ జిల్లాల వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులన్నీ పూర్తిగా రద్దయ్యాయి. కాగా, శనివారం నుంచి ఒంగోలు, నెల్లూరు జిల్లాల వైపు 90 శాతం, విజయవాడ, గుంటూరు వైపు 75 శాతం ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఉభయ గోదావరి జిల్లాల వైపు 50 శాతం, విశాఖపట్నం వైపు 25శాతం సర్వీసులను అధికారులు రద్దు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా మారడంతో అనేకమంది తమ ప్రయాణాలను వాయిదాలు వేసుకుంటుండగా, అత్యవసర పనుల నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో రైలు, విమానాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. కర్నూలు జిల్లా వైపు సర్వీసుల పునరుద్ధరణకు నిర్ణయం రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, బెంగళూరు మార్గాల్లో వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు ఐదు రోజులుగా పూర్తిగా రద్దయిన విషయం విదితమే. కాగా ఆదివారం రాత్రి నుంచి రద్దీని బట్టి కర్నూలు జిల్లాకు ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించేందుకు అధికారులు నిర్ణయించారు. ఎంజీబీఎస్‌లోని కర్నూల్ సెక్టార్ నుంచి నిత్యం 260 బస్సులు రాకపోకలు కొనసాగిస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తే మరిన్ని సర్వీసులను నడిపించేందుకు సైతం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.