సాక్షి, అమరావతి: అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు ప్రారంభం కావడంతో వచ్చే వారం నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుహృద్భావ వాతావరణంలో అంతరాష్ట్ర ఒప్పందాన్ని పరిష్కరించుకోవాలని గురువారం జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. తెలంగాణ ఆర్టీసీ ఈడీలు యాదగిరి, వినోద్‌కుమార్ విజయవాడ చేరుకుని ఏపీఎస్ ఆర్టీసీ ఈడీలు బ్రహ్మానందరెడ్డి, కృష్ణమోహన్, జీవీ రావు, ఆదాం సాహెబ్‌లతో చర్చలు జరిపారు. ప్రాథమికంగా కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సుల్ని తిప్పేందుకు చర్చల్లో అంగీకారం కుదిరింది. ఈనెల 23న ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌లో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. అనంతరం రెండు రాష్ట్రాల రవాణా శాఖల మంత్రులు పేర్ని నాని, పువ్వాడ అజయ్‌కుమార్‌లతో ఆర్టీసీ ఎండీలు మాదిరెడ్డి ప్రతాప్, సునీల్ శర్మలు సమావేశమై అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
విభజన నుంచి సింగిల్ పర్మిట్ వివాదం..
► రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ మధ్య సింగిల్ పర్మిట్ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ సమాన కిలోమీటర్లు నడిపేలా అధికారులు ప్రాథమికంగా చర్చలు ప్రారంభించారు. ఏపీ విజయవాడ–హైదరాబాద్ రూట్లో బస్సు సర్వీసులు ఎక్కువగా నడుపుతుండగా, తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్–తిరుపతి రూట్లో బస్సు సర్వీసులు అధికంగా నడుపుతోంది.
► ఏపీఎస్‌ఆర్టీసీ రోజుకు 4.92 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని తిప్పుతోంది. తెలంగాణ భూ భాగంలో 2.64 లక్షల కిలోమీటర్లు, ఏపీలో 2.28 లక్షల కిలోమీటర్ల మేర తిప్పుతోంది.
► తెలంగాణ ఆర్టీసీ రోజుకు 3.90 లక్షల కిలోమీటర్లు బస్సులు నడుపుతుండగాఏపీ భూ భాగంలో 1.40 లక్షల కిలోమీటర్లు, తెలంగాణ పరిధిలో 2.50 లక్షల కిలోమీటర్లు తిప్పుతోంది.
► ఏపీలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రోజూ 518 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి.
కర్ణాటకకు వచ్చే వారం 293 సర్వీసులు
► ఏపీ నుంచి కర్ణాటకకు ఈ నెల 17 నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం కాగా 168 సర్వీసుల్ని నడపాలని ప్రతిపాదనలు రూపొందించగా 10 జిల్లాల నుంచి 140 సర్వీసులు మాత్రమే నడిచాయి. రెండో దశలో 293 బస్సు సర్వీసులు నడపాలని ప్రతిపాదనలు రూపొందించారు.
కోవిడ్ నిబంధనల ప్రకారమే అంతరాష్ట్ర సర్వీసులు: ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానందరెడ్డి
అంతరాష్ట్ర బస్ సర్వీసులను కోవిడ్ నిబంధనల ప్రకారమే నడుపుతామని ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్) బ్రహ్మానందరెడ్డి తెలిపారు. బస్టాండ్ నుంచి బస్టాండ్‌కు మాత్రమే సర్వీసులు నడుపుతామని స్పష్టం చేశారు. ప్రయాణీకుల్లో 5 శాతం మందికి వైద్య పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌గా తేలితే హోం క్వారంటైన్ చేస్తామన్నారు. ప్రస్తుతం కర్నాటకకు నడుపుతున్న అంతరాష్ట్ర సర్వీసులకు ఇవే నిబంధనలు వర్తిస్తున్నాయని, తెలంగాణకు త్వరలో సర్వీసులు ప్రారంభమైతే హెల్త్ ప్రోటోకాల్ విధిగా పాటిస్తామని చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ అధికారులతో జరిగిన చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని, ఈనెల 23న మరోమారు హైదరాబాద్‌లో చర్చలు జరపనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment