సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉధృతమైన సమైక్యాంధ్ర ఉద్యమం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలను భయపెడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, ఉపాధ్యాయులు కార్యాలయాలు, పాఠశాలలకు తాళాలు వేసి ఉద్యమంలోకి దిగడం ఈ పార్టీల నేతలను మరింతగా కలవరపెడుతోంది. ఎన్‌జీవోలు, టీచర్లకు దూరమైతే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు తప్పవన్న భయం ఇప్పుడు వీరిని వెంటాడుతోంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, టీచర్లు వంటి వారి ఆగ్రహానికి కారణమైనందునే చంద్రబాబు నాయుడు 2004, 2009 ఎన్నికల్లో ఓటమి చెందారనే భావన తెలుగుదేశం నేతలు, క్యాడర్‌లో ఉంది.
వస్తున్నా మీ కోసం యాత్ర చేపట్టిన చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని పలుచోట్ల అంగీకరించి ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి తాను తిరిగి అధికారంలోకి వస్తే బాగా చూస్తానని, పలు సదుపాయాలు కల్పిస్తానని హామీలు గుప్పించారు. మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఉద్యోగ అనుకూల విధానాలు వారిలో విశ్వాసాన్ని పెంచాయి. ఆయన నేతృత్వంలో కాంగ్రె స్ రెండోసారి అధికారంలోకి రావడానికి ఎన్‌జీవోలు తమవంతు సహకారాన్ని అందించారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయేదీ తామే అన్న భావనతో రాష్ట్రంలో ఎన్నడూ లేనంత తీవ్ర ఉద్యమాన్ని వారు ప్రారంభించారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకమన్న నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా వీరు పలు పార్టీల అధినేతలను స్వయంగా కలసి విన్నవించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఎన్‌జీవోలకు సానుకూల స్పందన రాలేదు. విభజన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చంద్రబాబునాయుడు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఏపీ ఎన్‌జీవో నేతలను బాగా నిరాశపరిచింది. దానికి తగ్గట్టుగానే చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఎన్‌జీవోల ఉద్యమంలోనూ కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు పెద్దగా పాల్గొనడం లేదు. కాంగ్రెస్‌కు చెందిన తిరుపతి ఎంపీ చింతామోహన్ తాను సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానని గట్టిగా చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు.
ఓట్లేసి గెలిపించిన ప్రజల కంటే కాంగ్రెస్ అధిష్టానమే ముఖ్యమన్నట్లుగా ఆయన సమైక్య ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు. తిరుపతిలో తెలుగుదేశం నేతలెవరూ సమైక్య ఉద్యమాల్లో పాల్గొనడం లేదు. ఎన్‌జీవోలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పార్టీ నేతల వైఖరి ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ పార్టీ నేతల వైఖరి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని ఎన్‌జీవో సంఘాల నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు దూరమైతే ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్, తెలుగుదేశం కిందిస్థాయి నేతలు భయపడుతున్నా ప్రజాప్రతినిధులను మాత్రం ఒప్పించలేకపోతున్నారు.
కాంగ్రెస్, టీడీపీకి ఎన్‌జీవోల భయం
Published Fri, Aug 16 2013 3:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement