సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘీభావం తెలుపుతున్న గద్దర్, జి.రాములు, కోదండరాం, కె.లక్ష్మణ్, మంద కృష్ణ, ఉత్తమ్, చాడ, గోవర్ధ్దన్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించాలంటే ఉద్యమం పార్లమెంటును తాకాలని అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. వర్గీకరణ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాయని, మిగిలింది పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా ఉద్యమాన్ని తీవ్రం చేయాలని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలతో ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ)ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్యక్షతన సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ వర్గీకరణ సాధనపై అఖిలపక్ష పార్టీల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులతో పాటు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల అధ్యక్షులు, ఇతర నేతలు మాట్లాడుతూ, వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఉద్యమానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని, కార్యాచరణ ప్రకటిస్తే ఆమేరకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని హామీ ఇచ్చారు.
కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు చిత్తశుద్ధి లేదు. అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వర్గీకరణ ఉద్యమంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి చనిపోయిన సందర్భంలో కూడా రెండ్రోజుల్లో ఢిల్లీకి తీసుకెళ్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఆ ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా హామీని నిలబెట్టుకోవాలి. వర్గీకరణ అంశాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాం. పార్టీ అదిష్టానం తరఫున కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కృషి చేస్తాం.
అన్నింటికీ టైం దొరుకుతుంది కానీ..: మందకృష్ణ
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేవలం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు మాత్రమే టైం దొరకడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి అడుగడుగునా టీఆర్‌ఎస్ మద్దతుగా నిలుస్తోంది. అయినా కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదా? అధికారంలోకి వస్తే వందరోజుల్లో వర్గీకరణ చేస్తామని గతంలో బీజేపీ ప్రకటించింది. కానీ అధికారం చేపట్టి ఇన్ని రోజులు అయినా వర్గీకరణ ఊసేలేదు.
అణచివేస్తే తిరగబడతాం: కోదండ
ప్రస్తుతం ప్రజాసమస్యలపై గళమెత్తే పరిస్థితి లేదు. 506, 507 సెక్షన్లతో కొత్త చట్టాలను తీసుకొస్తున్నారు. కోర్టు జోక్యం లేకుండా నేరుగా అరెస్టులు చేసి జైల్లో పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. ఇక ఊరుకుంటే లాభంలేదు. తిరగబడదాం. ఎస్సీ రిజర్వేషన్లపై కేంద్రంతో చర్చించి ఒత్తిడి తీసుకొద్దాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలను, మాదిగలు దోషులుగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మంచిది.
ఇది కులస్పృహ ఉద్యమం: గద్దర్
ఎమ్మార్పీఎస్ ఉద్యమం కులస్పృహ ఉద్యమం. దళితుల్లోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కోరుతూ చేస్తున్న ఉద్యమం. నేను మాల అయినప్పటికీ ఒక ఉద్యమకారుడిగా, నక్సలైట్‌గా దీనిని సమర్థిస్తున్నా. అన్ని పార్టీల ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.
జనాభా ప్రాతిపదికన దక్కాలి: ఎల్.రమణ
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కాలి. టీడీపీ హయాంలో రిజర్వేషన్లు అమలు చేశాం.న్యాయపరమైన చిక్కులతో వర్గీకరణ మళ్లీ మొదటికొచ్చింది. ఎమ్మార్పీఎస్ కార్యక్రమాలకు టీడీపీ అండగా ఉంటుంది.
కొన్నివర్గాలకే పరిమితమయ్యాయి: చాడ
ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అవి కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. దీంతో దళితుల్లో సంపన్నులు మరింత పైకెళ్తున్నారు. పేదలు మరింత పేదలవుతున్నారు. ఈ అంతరాన్ని అధిగమించేందుకు వర్గీకరణ చేపట్టాలి.
కేంద్రం సానుకూలంగా ఉంది: కె.లక్ష్మణ్
కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా ఉంది. వర్గీకరణ న్యాయమైందే. అణగారిన వర్గాలకు సమన్యాయం జరగాలని రాజ్యాంగం చెబుతోంది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపాలి.
Comments
Please login to add a commentAdd a comment