రాష్ట్ర విభజన నిర్ణయంపై సకల జనులూ కళ్లెర్ర జేశారు. చేయాల్సిందంతా చేసి సమైక్య పల్లవి ఎత్తుకున్న కాంగ్రెస్, టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ప్రజల చీత్కారాలు భరించలేక కొందరు నేతలు ముఖం చాటేస్తుండగా, మరికొందరు ఉనికి కోసం పాట్లుపడుతున్నారు. ఏదో ఒకటి చేసి తామూ సమైక్యవాదులమేనని నిరూపించుకుంటేనే భవిష్యత్ ఉంటుందని, లేదంటే తెరమరగు కాక తప్పదని రోడ్డెక్కుతున్నారు. ఎన్జీఓలు సైతం విధులు బహిష్కరించి నిరసనలకు దిగడంతో ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయాయి. ఎవరికి వారు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూ సమైక్య ఉద్యమ సెగ నింగినంటేలా రగిలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, లాయర్ల దీక్షలు కొనసాగుతున్నాయి. విభజన
నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరిస్తున్నారు.
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనపై నిరసనలు నింగినంటాయి. ప్రజలకు నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు (ఎన్జీఓలు) కూడా తోడు కావడంతో మరింత ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. విభజన ఆగేదాకా పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టీకరిస్తున్నారు. 14వ రోజైన మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగింది. అనంతపురం నగరంతో పాటు పట్టణాలు, మారుమూల పల్లెల్లో సైతం సమైక్య నినాదం మార్మోగింది. జాక్టో, నాన్‌పొలిటికల్ జేఏసీ, ఏపీ ఎన్జీఓ సంఘం, ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల జేఏసీ, గ్రంథాలయ ఉద్యోగుల అసోసియేషన్, జెడ్పీ, పంచాయితీరాజ్, పీఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్, విద్యుత్ ఉద్యోగుల యూనియన్ తదితర సంఘాల రిలేదీక్షలు, ధర్నాలతో అనంతపురం నగరం దద్దరిల్లిపోయింది. స్థానిక టవర్‌క్లాక్, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాలు, సప్తగిరి సర్కిల్, మున్సిపల్ సర్కిల్, తెలుగుతల్లి కూడలి తదితర ప్రాంతాలు సమైక్యవాదులతో పోటెత్తాయి.
వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. డెకరేషన్ అసోసియేషన్, దూదేకులు, మోచి, ముచ్చి కుల సంఘాలు, పానీపూరీ వ్యాపారుల సంఘం, జిల్లా పోలీసు కార్యాలయ (డీపీఓ) ఉద్యోగులతో పాటు వివిధ డివిజన్ల ప్రజలు స్వచ్ఛందంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రాజస్థాన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంటా వార్పు చేపట్టారు. ఎస్కేయూలో విద్యార్థి జేఏసీ చేపట్టిన రిలే దీక్షలకు ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య సంఘీభావం ప్రకటించారు. అక్కడే విద్యార్థులు, ఎస్కేయూ ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. అనంతపురంలో న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలకు వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి సంఘీభావం తెలిపారు. రాయదుర్గంలో రజక సంఘం ఆధ్వర్యంలో గాడిదలతో ప్రదర్శన నిర్వహించారు. రోడ్డుపైనే బట్టలు ఉతికి, అనంతరం ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. కదిరిలో నాయీ బ్రాహ్మణులు రోడ్డుపైనే ఉచితంగా క్షవరం చేసి నిరసన తెలిపారు. చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌సర్కిల్‌లో షూ పాలిష్ చేసి నిరసన తెలిపారు. మడకశిరలో సమైక్యవాదులపై అక్రమ కేసులు బనాయించడంతో ఉద్యమకారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. గుడిబండ మండలం గుణేమోరుబాగల్ గ్రామం, మండల కేంద్రమైన అగళిలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కళ్యాణదుర్గంలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి.. దహనం చేశారు. గుంతకల్లు, హిందూపురం పట్టణాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడి మండలం కల్లూరులో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి.
ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వంటా వార్పు నిర్వహించారు. పట్టణంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రజా, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. తాడిపత్రిలో మున్సిపల్ ఉద్యోగులు, జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శాంతియాగం నిర్వహించారు. ఉరవకొండలో మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎన్జీఓలు సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. కూడేరులో విభిన్నప్రతిభావంతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కదిరిలో ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వాహకులు ర్యాలీ చేశారు. రాష్ట్రం విడిపోతే ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేస్తూ ఆర్టీసీ కార్మికులు నాటిక ప్రదర్శించారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమైక్య ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో 14వ రోజు కూడా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు, బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోలు బంకులు మూతబడ్డాయి.
ఎమ్మెల్యేలకు చేదు అనుభవం
ప్రజాభిప్రాయాన్ని గౌరవించని ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మంగళవారం అనంతపురం నగరంలో సంఘీభావం తెలపడానికి వచ్చిన టీడీపీకి చెందిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు నినాదాలు చేశారు. ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటున్నట్లు పల్లె చెప్పడంతో వారు శాంతించారు. పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ ఇవ్వడం కూడా కారణమేనంటూ మండిపడ్డారు. టీడీపీ అధిష్టానం వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని పెనుకొండ నియోజక వర్గ ఇన్‌చార్జ్ కేటీ శ్రీధర్‌ను పెనుకొండలోని 44వ జాతీయ రహదారి వద్ద నిరసనకారులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంతకల్లులో కాంగ్రెస్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కొట్రికె మధుసూదన్‌గుప్తాకు సమైక్యసెగ తగిలింది. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలకు సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఈ సందర్భంగా ఇరు వర్గాల నడుమ ఘర్షణ వాతావరణం తలెత్తింది. రాష్ట్ర విభజన గురించి సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులకు, ఎంపీలకు ముందే తెలిసినా అడ్డుకునే ప్రయత్నం చేయలేదని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా టీడీపీ అధినేత చంద్రబాబు తన తప్పు తెలుసుకుని కేంద్రానికి సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నింగికెగిసిన నిరసన
Published Wed, Aug 14 2013 4:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement