సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రతరం
Published Fri, Aug 9 2013 2:05 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఈ ప్రభావం జిల్లాపై తీవ్రంగా పడింది. దాదాపు పాలన స్తంభించిపోయింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. అత్యవసర విభాగాలు తప్పితే మిగతావన్నీ ఉద్యమ బాటలో ఉన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం గురువారానికి తొమ్మిదో రోజుకు చేరింది. విద్యార్థులు, న్యాయవాదులు, వ్యాపారులు, వైద్యులు, విద్యుత్ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల బ్యాంకులు మూత పడడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలను ఉద్యమకారులు అడ్డుకుంటున్నారు. దీంతో భారీ వాహనాల రాకపోకలు తగ్గాయి.
పెట్రోల్ బంకుల్లో చమురు విక్రయాలు 20 నుంచి 30 శాతం మేరకు తగ్గిపోయాయని జిల్లా పెట్రోల్ బంకుల యజమానుల సంక్షేమ సంఘం కార్యదర్శి నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో ఉద్యమం తీవ్రతరం కావడంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రైవేట్ వాహనాలతోపాటు, ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా తగ్గిపోయాయి. విశాఖ నుంచి తెలంగాణలోని జిల్లాలకు వెళ్లాల్సిన అంతర్రాష్ట్ర సర్వీసులు అధిక సంఖ్యలో నిలిచిపోనున్నాయి. జిల్లా నుంచి తూర్పు గోదావరి కేవలం రాత్రి సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. ఫలితంగా రీజియన్ పరిధిలో రోజుకి రూ.30 లక్షల నష్టం వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి బస్సులను నిలిపివేస్తామని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ర్ట ఉప ప్రధాన కార్యదర్శి పి.దామోదరరావు తెలిపారు. ఈ ప్రభావం నిత్యావసరాలతో పాటు అన్నింటిపై పడే అవకాశముంది.
సమైక్యాంధ్ర ఉద్యమంపై ఆరా
నర్సీపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఉద్యమంపై ప్రత్యేకాధికారిగా నియమితులైన అడిషనల్ డీజీ వినయ్‌కుమార్ సింగ్, డీఐజీ ఉమాపతి, ఎస్పీ దుగ్గల్ గురువారం స్థానిక టౌన్ పోలీస్‌స్టేషను సందర్శించారు. పది రోజులుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని గమనించి, పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాలని అడిషనల్ డీజీ స్థానిక పోలీసులను ఆదేశించినట్టు తెలిసింది. కార్యక్రమంలో ఓఎస్‌డీ దామోదర్, ఇన్‌చార్జ్ డీఎస్‌పీ అశోక్‌కుమార్‌తో పాటు స్థానిక సీఐలు రాజేంద్రకుమార్, ప్రసాదరావులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement