ఉక్కుపాదం
సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాధ్యమైనంత వరకు అణగదొక్కేందుకు పోలీసు యంత్రాం గం సిద్ధమైంది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఉద్యమంలో పాల్గొనేందుకు వీల్లేకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. జువనైల్ జస్టిస్ యాక్ట్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్‌ఐఓ), జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) కార్యాలయాలకు ప్రత్యేక హెచ్చరికలు పంపింది. ఇన్నాళ్లూ ఉద్యమాలకు ఆతిథ్యమిచ్చిన కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి తమ వైఖరి బయటపెట్టుకుంది.
విద్యార్థుల్ని రోడ్డెక్కనీయొద్దు!
ఏ ఉద్యమమైనా విద్యార్థుల భాగస్వామ్యం తోనే ఉధృత స్థితికి చేరుతుంద న్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ విషయం తేటతెల్లమయింది. అదే దారిన జిల్లాలో కూడా ఉద్యమాల్లో విద్యార్థులు కీలకపాత్ర పోషిస్తున్నారు. కానీ 18 ఏళ్లలోపు వయసున్నవారు తల్లిదండ్రులు/విద్యాసంస్థల యాజమాన్యాల పర్యవేక్షణలో ఉండాలని, అలాంటి
వారిని రోడ్లపైకి ఆందోళనకు పంపిస్తే ఊరుకునేది లేదని నగర పోలీసు కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై విద్యార్థి జేఏసీ, రాజకీయ ప్రతినిధులు, సమైక్యాంధ్ర ఉద్యమకారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం తెలంగాణవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనల్ని విశాఖలోనే ప్రవేశపెట్టడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. నగరంలో ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుండడంతో భయపడిన కొందరు తెలంగాణ సానుభూతిపరుల కుట్రపూరిత చర్యలేనని ధ్వజమెత్తుతున్నారు. విద్యార్థులు శాంతియుత ఉద్యమాలు చేస్తున్నారు తప్ప, ఎలాంటి విధ్వంసాలకు పాల్పడట్లేదని చెప్తున్నారు.