సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని వాయవ్య ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తాజాగా ఏర్పడిన అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం కావడంవల్ల కోస్తాంధ్రపై ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావం కారణంగా రానున్న 24గంటల్లో ప్రధానంగా కోస్తాంధ్రలో ఉత్తర దిశగా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో కోస్తాలో దక్షిణ దిశగా, కొన్నిచోట్ల వాయవ్య దిశగా గంటకు 45నుంచి 50కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తం కావాలని హెచ్చరించారు.